అమ్మ,నాన్న ఓ స్నేహితురాలు.. | Sakshi
Sakshi News home page

అమ్మ,నాన్న ఓ స్నేహితురాలు..

Published Sun, Jul 30 2017 1:44 AM

అమ్మ,నాన్న ఓ స్నేహితురాలు..

తమిళసినిమా: అమ్మానాన్న ఓ స్నేహితురాలు. ఏమిటీ తలా తోక లేకుండా అనుకుంటున్నారా? మన జీవితంలో మన బాగు కోరేవారెవరైనా ఉన్నారంటే అది తల్లిదండ్రులే. అయితే ఒక్కోసారి వారు కూడా చేయని మేలు స్నేహితుల వల్ల జరిగిపోతుంది. తన జీవితం మలుపునకు తన స్నేహితురాళ్లే అంటోంది నటి కీర్తీసురుశ్‌.

దక్షిణాదిలో కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉన్న ఈ బ్యూటీ గురించి పెద్దగా ఇంట్రడక్షన్‌ అనవసరం అనుకుంటా. అతి తక్కువ కాలంలోనే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ అభిమానుల్ని అలరిస్తున్న కీర్తీసురేశ్‌ కోలీవుడ్‌కు ఇదుఎన్న మాయం చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా పరిచయ చిత్రంగా మంచి పునాదినే వేసింది. ఆ తరువాత నటించిన రజనీమురుగన్, రెమో చిత్రాలు సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ పట్టికలో చేర్చాయి.

ఇక విజయ్‌కు జంటగా నటించిన భైరవా చిత్రం తరువాత కోటీకిపైగా పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకుంది. అదే విధంగా తెలుగులో నటించిన నేను శైలజా, నేను లోకల్‌ చిత్రాలు అక్కడా హిట్‌ చిత్రాల నాయకిగా నిలబెట్టాయి. ప్రస్తుతం సూర్యకు జంటగా నటించిన తానాసేర్న్‌దకూటం చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా మహానటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో టైటిల్‌ పాత్రలో నటిస్తోంది.

త్వరలో విశాల్‌తో రొమాన్స్‌ చేయడానికి సిద్ధం అవుతోంది. అసలు ఈ అమ్మడు నటిగా ఇంత వేగంగా ఎదగడానికి కారణం ఎవరో తెలుసా? కీర్తీసురేశ్‌ స్నేహితురాలట. ఆ ఫ్లాష్‌బ్యాక్‌ ఏమిటో తెలుసుకోవాలనుందా? కీర్తీకి చిన్నతనం నుంచి నటనంటే పచ్చి మోహం అట. అందులో భాగంగానే డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఫ్యాషన్‌డిజైనింగ్‌ కోర్సును చేసింది. అయితే నటినవ్వాలన్న తన ఆకాంక్షను తల్లిదండ్రుల వద్ద వ్యక్తం చేయగా వలదంటే వలదన్నారట.

ఇంతకీ కీర్తీసురేశ్‌ తల్లిదండ్రులెవరో తెలుసా? తల్లి మేనక ఒకప్పుడు నటుడు రజనీకాంత్‌కు జంటగా నటించారు. తండ్రి సురేశ్‌ మలయాళంలో పేరున్న నిర్మాత. అయినా నటి కావాలన్న కీర్తీ కోరికను నిరాకరించారు. దీంతో తన బాధను కీర్తీసురేశ్‌ స్నేహితురాలికి చెప్పుకుని తెగ ఇదైపోయిందట. తాను వేరే వాళ్లకు పుడితే నటించడానికి అనుమతి లభించేదేమోనని వాపోయిందట.ఈ విషయం కీర్తీసురేశ్‌ తల్లిదండ్రుల చెవిన పడడంతో అంతగా ఆశ పడుతున్న తన కూతుర్ని నటించడానికి పచ్చజెండా ఊపారట. ఈ విషయాన్ని కీర్తీనే ఒక భేటీలో తెలిపారు. అలా కీర్తీసురేశ్‌ కథానాయకి కావడంలో అమ్మానాన్న ఓ స్నేహితురాలు ఒక భాగం అయ్యారట.

Advertisement
Advertisement