తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ‘జెమిని’ కిరణ్‌ | Sakshi
Sakshi News home page

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ‘జెమిని’ కిరణ్‌

Published Sun, Jul 30 2017 11:06 PM

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ‘జెమిని’ కిరణ్‌ - Sakshi

‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ (తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత పర్వతనేని కిరణ్‌ (‘జెమిని’ కిరణ్‌) ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో గల ఫిల్మ్‌ చాంబర్‌లో ఈ ఎన్నికలు జరిగాయి. చాంబర్‌లో భాగమైన నిర్మాణ (ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌ ), పంపిణీ (డిస్టిబ్య్రూటర్‌ సెక్టార్‌), ప్రదర్శన (ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌), స్టూడియో సెక్టార్‌ – ఈ నాలుగు విభాగాల సభ్యులు ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌కు ఒక్కరు మినహా సి. కల్యాణ్‌ ప్యానెల్‌లోని అభ్యర్థులందరూ విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రతాని రామకృష్ణగౌడ్‌ ప్యానెల్‌తో సంబంధం లేకుండా∙విజయం సాధించారు. తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డిస్టిబ్య్రూటర్‌ సెక్టార్‌ ఎన్నికల్లో హీరో నితిన్‌ తండ్రి సుధాకర్‌రెడ్డి ప్యానెల్‌ ఘన విజయం సాధించింది.

ఈసారి ఛాన్స్‌ నిర్మాతలది
ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్ష పదవికి ఒక్కోసారి ఒక్కో సెక్టార్‌ నుంచి ఎన్నుకుంటారు. నిబంధనల ప్రకారం ఈసారి ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌కు అవకాశం దక్కింది. ఈ సెక్టార్‌ నుంచి గెలిచిన 12 మందిలో ఒకరైన పర్వతనేని కిరణ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చాంబర్‌ ఉపాధ్యక్షులుగా వి. వీరినాయుడు, పి. శ్రీనివాసబాబు, కె. బసిరెడ్డి, కార్యదర్శులుగా ఎమ్‌. రాందాస్, కె. శివప్రసాద్‌రావు, సంయుక్త కార్యదర్శులుగా మోహన్‌ వడ్లపట్ల, వి. రామకృష్ణ (ఆర్కే), ఎమ్‌. సుధాకర్‌ (విజయవాడ), జె. మోహన్‌రెడ్డి (గుంతకల్‌), పి. సాంబమూర్తి (విశాఖ), ఎన్‌. నాగార్జున (తిరుపతి), కోశాధికారిగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement