టిప్పు ప్రేమకథకు శ్రీకారం | Sakshi
Sakshi News home page

టిప్పు ప్రేమకథకు శ్రీకారం

Published Tue, Aug 12 2014 11:06 PM

టిప్పు ప్రేమకథకు శ్రీకారం

ప్రముఖ పంపిణీదారుడు డి.బి. సీతారామరాజు (‘వైజాగ్’ రాజు) తనయుడు కార్తీక్ హీరోగా పరిచయ మవుతున్న చిత్రం ‘టిప్పు’. సంస్కృతి, కనికా కపూర్ కథానాయికలు. జగదీశ్ దానేటి దర్శకుడు. ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ముహూర్తపు దృశ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్-గ్రామీణ నీటిపారుదల శాఖామాత్యులు అయ్యన్న పాత్రుడు కెమెరా స్విచాన్ చేశారు. తెలంగాణ ఐటీ - పంచాయతీరాజ్ శాఖమంత్రి కె.తారకరామారావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చక్కని ప్రేమకథాచిత్రమిది. హైదరాబాద్, బెంగళూరు, మైసూరుల్లో చిత్రీకరణ జరుపుతాం. పాటలు విదేశాల్లో తీస్తాం’’ అని తెలిపారు. నటునిగా తన తొలి అడుగు ఓ మంచి కథతో పడటం ఆనందంగా ఉందని కార్తీక్ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మంత్రులూ సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు.
 
 ఇరు ప్రాంతాల్లో సినిమా అభివృద్ధి కావాలి: కేటీఆర్
 చెన్నై నుంచి తెలుగు సినిమాను హైదరాబాద్ తరలించడానికి ఎందరో మహానుభావులు శ్రమిం చారు. ప్రస్తుతం భాగ్యనగరంలో తెలుగు సినిమా కళకళలాడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు నెలలు దాటింది. ఈ కారణంగా చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. అవన్నీ పయనించే మేఘాల్లాంటివి. త్వరలో అన్నీ చక్కబడతాయి. భారతీయ సినిమా కేంద్రంగా హైదరాబాద్‌ని అభివృద్ధి చేయడమే మా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, వైజాగ్‌లో కూడా తెలుగు సినిమా అభివృద్ధి చెందాలి. వైజాగ్, అరకు ప్రాంతాలు సినిమాకు అనుకూలాలు.
 కళాకారుడికి ప్రాంతీయ భేదాలుండవ్
 
 - అయ్యన్న పాత్రుడు
 రాష్ట్రం రెండుగా విడిపోయింది కాబట్టి, పరిశ్రమలో కూడా మార్పులొస్తాయని పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. వారికి చెప్పేదొక్కటే. కళాకారుడు ఏ ప్రాంతం వాడైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. వారికి ప్రాంతీయభేదాలుండవ్. సినిమాను నమ్ముకొని ఇక్కడ కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వారందరికీ మరింత ఉపాధి లభించాలి. అలాగే... వైజాగ్‌లో కూడా తెలుగు సినిమాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
 

Advertisement
Advertisement