ఇది ప్రజల సినిమా | Sakshi
Sakshi News home page

ఇది ప్రజల సినిమా

Published Sun, Mar 22 2015 11:57 PM

ఇది ప్రజల సినిమా - Sakshi

 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన తెలుగు సినీ ఆణిముత్యం ‘మా భూమి’ అని పలువురు సినీ ప్రముఖులు, మేధావులు మరొక్కసారి గుర్తు చేసుకున్నారు.  ‘మా భూమి’ చిత్రం విడుదలై (1980  మార్చి, 23) సోమవారంతో 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ చిత్రంలో పాల్గొన్న నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ఆదివారం హైదరాబాద్‌లో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్రనిర్మాతల్లో ఒకరైన బి. నరసింగరావు మాట్లాడుతూ... ‘మా భూమి’ చిత్రనిర్మాణానికి ఆ రోజుల్లో తాము పడిన కష్టనష్టాలను, చిత్రప్రదర్శనకు రాజ్యవ్యవస్థ నుంచి ఎదురైన నిర్భంధాలను గుర్తు చేశారు.
 
  చాలా ఏళ్లుగా అందుబాటులో లేని ఈ చిత్రాన్ని పాతిక లక్షల రూపాయల ఖర్చుతో డిజిటలైజ్ చేశామనీ, అది మరో పది రోజుల్లో బ్లూ రే డీవీడీ రూపంలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ‘‘సమాజం కోసం 40 ఏళ్ల క్రితం ప్రజా కళాకారులుగా మేం చేసిన పనిని ఇప్పటి యువతరం అందుకుని బాధ్యతలు చేపట్టాలి. అందుకు మేము అన్ని విధాలా అండదండగా ఉంటాం’’ అని కూడా బి. నరసింగరావు చెప్పారు. ‘‘ఇది ప్రజల సినిమా. కేవలం ఆంధ్రా సినిమానో.. తెలంగాణా సినిమాని కాదు’’ అని చిత్రనిర్మాతల్లో మరొకరైన జి. రవీంద్రనాథ్ (అమెరికా) అన్నారు.
 
 ఈ కార్యక్రమంలో ‘మా భూమి’ చిత్రంలో నటించిన సాయిచంద్, సీనియర్ నటుడు కాకరాల, భూపాల్‌రెడ్డి. గాయని సంధ్య తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ రాజకీయ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. చిత్రబృందానికి జ్ఞాపికలు అందించడం విశేషం. సోమవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు మా టీవీలో ‘మా భూమి’ని ప్రసారం చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. సభానంతరం కిక్కిరిసిన జనాల మధ్య ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement