ఆ బుజ్జి బంగారాన్ని కలిశానోచ్! | Sakshi
Sakshi News home page

ఆ బుజ్జి బంగారాన్ని కలిశానోచ్!

Published Sat, Nov 14 2015 7:24 PM

ఆ బుజ్జి  బంగారాన్ని కలిశానోచ్! - Sakshi

తిరువనంతపురం:  చిన్ననాటి స్నేహితులను, విడిపోయిన బంధువులను కలపడంలో, కావాల్సిన వారిని వెతికి పట్టుకోవడంలో సోషల్ మీడియా ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో మలయాళ సుప్రసిద్ధ  దర్శకుడు రవికుమార్ ఇపుడు  చాలా సంతోషంగా  ఉన్నారు. తన తీపి రాగాల కోయిలమ్మను వెదికి పట్టుకోవడంలో  సాయం చేసిన ఫేస్ బుక్కు ఆయన కృతజ్ఙతలు తెలుపుతున్నారు.  ఇంతకీ ఏమిటా  సాయం అనుకుంటున్నారు కదూ....

వివరాల్లోకి వెళితే...  ఈ మధ్య కాలంలో  రవికుమార్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఓ  విద్యార్థిని...  స్కూలు  అసెంబ్లీలో పాట పాడుతున్న వీడియో అది.  అద్బుతమైన  గాత్రశుద్ధికి ముగ్ధుడైన  రవి... ఆమె  చిరునామా కనుక్కోవడంలో సాయం చేయాలంటూ ఫేస్బుక్లో కోరారు.  ఆ చిన్నారి కి తన సినిమాలో పాట పాడే  అవకాశం ఇవ్వనున్నట్టు  ప్రకటించారు. అంతే  అతి స్వల్ప వ్యవధిలో దాదాపు  రెండు లక్షల లైక్‌లు, ఎనిమిది వేల షేర్ లభించాయి ఆ వీడియోకి.

అంతేకాదు కేవలం రెండురోజుల్లోనే  ఆ వీడియోలో ఉన్న   గాన కోకిల  ఆచూకీ కూడా దొరికేసింది. ఆమె పేరు షాహ్నా అని.. కేరళలోని  వాయినాడ్ పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసింది. అంతే ఆగమేఘాల మీద అక్కడకు వెళ్లిన రవికుమార్ ...ఆ విద్యార్థిని కలిశారు. అనంతరం ఆ అనుభూతిని ఆయన తన ఫేస్బుక్‌లో పంచుకున్నారు.

 

'షాహ్నా కళ్లలో  మెరుపు చూశాను.. ఎదుటివారు ఆనందంగా ఉంటే చూడ్డానికి చాలా  బావుంటుంది కదూ.. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.. షాహ్నా, ఆమె స్నేహితులు, తల్లిదండ్రులు,  స్కూలు టీచర్లను కలిశాను.  గాడ్ బ్లెస్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు.  అంతేకాదు  షాహ్నా భవిష్యత్తులో మంచి గాయని కాబోతోంది, థ్యాంక్స్ ఫేస్బుక్ అంటూ  దర్శకుడు రవికుమార్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement