పెళ్లి అనేది పాత కాన్సెప్ట్! | Sakshi
Sakshi News home page

పెళ్లి అనేది పాత కాన్సెప్ట్!

Published Sun, Nov 24 2013 1:07 AM

పెళ్లి అనేది పాత కాన్సెప్ట్! - Sakshi

కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయడానికి ఆరాటపడే కమల్‌హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివాహ బంధం గురించి మాట్లాడుతూ.. ‘అది చాలా పాత కాన్సెప్ట్’ అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఆయన మాజీ భార్య సారిక ఈ మధ్య ‘పెళ్లనేది ఓ అందమైన కాన్సెప్ట్’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కమల్ దగ్గర ప్రస్తావించినప్పుడు -‘‘నా దృష్టిలో పెళ్లి అందమైన కాన్సెప్ట్ కాదు. అదొక చట్టపరమైన షరతులాంటిది. ఒక్కరితోనే జీవితం పంచుకుని తీరాలని ఆ షరతు ఒత్తిడి చేస్తుంది. అందుకే చెబుతున్నా.. ఒకవేళ ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే.. ఆ ప్రేమకు షరతులతో, ఒప్పంద పత్రాలతో సంబంధం లేదు. 
 
అవేవీ లేకపోయినా ప్రేమగా ఉండొచ్చు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. దాదాపు మూడు రోజుల క్రితం శ్రుతిహాసన్ ఇంట్లోకి ఓ అపరిచితుడు చొరబడటానికి ప్రయత్నం చేసిన విషయం గురించి కమల్‌ని అడిగితే - ‘‘కన్నబిడ్డకు ఇలాంటిది జరిగితే ఏ తండ్రయినా ఆందోళన చెందుతాడు. ఈ వార్త విన్నప్పుడు కంగారుపడ్డాను. సేఫ్‌గా ఉండమని శ్రుతికి చెప్పాను. తను చాలా ధైర్యవంతురాలు. తల్లిదండ్రులు విడిపోవడం చూసిన అమ్మాయి. ఆ సంఘటనను డీల్ చేయడం అంత సులువు కాదు. అయితే మంచికో చెడుకో తనకు మాత్రం ఆ సంఘటన చాలా నేర్పించింది’’ అని తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement