విడుదలకు ముందే.. | Sakshi
Sakshi News home page

విడుదలకు ముందే..

Published Sun, Oct 23 2016 2:24 AM

విడుదలకు ముందే.. - Sakshi

 కొన్ని చిత్రాలు విడుదల అనంతరం వివాదాల్లో చిక్కుకుంటాయి. మరి కొన్ని తెరపైకి రాక ముందే చర్చకు దారి తీస్తాయి. రెండవ కోవకు చెందిన చిత్రం తిరైక్కు వరాద కథై. సీనియర్ నటి నదియ చాలా గ్యాప్ తరువాత తమిళంలో నటించిన చిత్రం ఇది. ఆమెతో పాటు కోవైసరళ, ఇనియ, ఈడెన్, ఆర్తీ, ఆరది ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం విశేషం ఏమిటంటే ఒక్క నటుడు కూడా కనిపించరు. అందరూ నటీమణులే నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ మలయాళ దర్శకుడు తులసీదాస్ తెరకెక్కించారు. కే.మణికంఠన్ నిర్మించిన తిరైక్కు వరాద కథై చిత్రం దీపావళి పండగ సందర్భంగా విడుదల కానుంది.
 
 ఇక్కడి వరకూ బాగానే ఉంది. చిత్రంలో లెస్బియన్ లాంటి పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబంబించే సన్నివేశాలు చోటు చేసుకోవడం చిత్రపరిశ్రమలో పెద్ద అలజడికే దారి తీసింది. హాస్టల్‌లో ఉంటూ నర్సులుగా పని చేసే ఇద్దరు యువతుల మధ్య స్నేహం ప్రేమగా మారడం, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనే పరిస్థితి దారి తీయడం లాంటి సన్నివేశాలతో పాటు లెస్బియన్ సన్నివేశాలు చోటు చేసుకోవడం లాంటి అంశాలు వివాదానికి తెర తీశాయి. సెన్సార్ సభ్యులు కూడా ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు, చివరికి వివాదాస్పదమైన సన్నివేశాలను తొలగించి చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌ను ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
 
 అయితే ఇలాంటి ప్రచారాన్ని చిత్ర వర్గాలు ఖండిస్తున్నారు. చిత్రంలో లెస్బియన్‌కు సంబంధించిన అంశాలు రెండుసన్నివేశాల్లో, అదీ సంభాషణలే ఉంటాయని, తిరైక్కు వరాద కథై పూర్తి వినోదాత్మక కథా చిత్రంగా ఉంటుందని అంటున్నారు. నటి నదియ ఇందులో పోలీస్ అధికారిగా నటించారు. ఒక హత్య జరగడంతో అందుకు కారణాలేమిటి, హంతకుడెవరూ అన్న విచారణ జరిపై కీలక పాత్ర నదియాదని చిత్ర యూనిట్ తెలిపారు. మొత్తం మీద ఈచిత్రం విడుదలకు ముందే సంచలనం కలిగి స్తోంది. ఈ ప్రచారం చిత్రానికి ప్లస్ అవుతుందో లేదో చూడాలి.
 

Advertisement
Advertisement