కరణ్ జోహార్‌పై మరో వివాదం | Sakshi
Sakshi News home page

కరణ్ జోహార్‌పై మరో వివాదం

Published Tue, Nov 1 2016 6:12 PM

కరణ్ జోహార్‌పై మరో వివాదం

ముంబై: బాలీవుడ్ దర్శకుడు కరణ్‌ జోహార్‌ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. కరణ్ తాజా సినిమా ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో  ప్రఖ్యాత గాయకుడు మహ్మద్ రఫీని అవమానించారని ఆయన కొడుకు షాహిద్ రఫీ ఆరోపించారు. ఈ సినిమాలో మహ్మద్ రఫీని కించపరిచేలా ఓ డైలాగ్ ఉందని చెప్పారు. నటి అనుష్క శర్మకు 'మహ్మద్ రఫీ పాడరు, ఏడుస్తారు' అనే డైలాగ్ ఉందని, ఇది రఫీని అవమానించడమేనని షాహిద్ అన్నారు. కరణ్ జోహార్ నుంచి ఇలా ఊహించలేదని, ఇది సిగ్గుపడే విషయమని విమర్శించారు. కరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కరణ్ జోహార్ తండ్రి యాష్ జోహార్ కోసం తన తండ్రి ఎన్నో పాటలు పాడారని, అయితే కరణ్‌ చేసిందేమిటని ప్రశ్నించారు. రఫీ సాబ్ అంటే ఏంటో కరణ్కు తెలియదని అన్నారు. లెజండరీ సింగర్ గురించి ఇలాంటి చౌకబారు డైలాగ్ ఏలా రాస్తారని విమర్శించారు. తన తండ్రి అభిమానులు తన ఫేస్బుక్ ఎకౌంట్కు 9 వేల మెసేజ్లు పంపారని, కరణ్ జోహార్కు వ్యతిరేకంగా ఈ నెల 2న నిరసన చేపడుతామని తెలిపారు.

పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్కు కరణ్‌ జోహార్ ఏ దిల్ హై ముష్కిల్లో అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాను అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రదర్శించబోమని థియేటర్ల యజమానుల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరణ్ .. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేలను కలసి సినిమా విడుదలకు సహకరించాలని విన్నవించడంతో లైన్ క్లియరైంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement