Sakshi News home page

థియేటర్స్‌లోనే సినిమాలను విడుదల చేయాలి

Published Tue, May 5 2020 12:40 AM

Multiplex Association writes to producers to not release movies online - Sakshi

కరోనా వైరస్‌ కారణంగా సినిమా షూటింగ్స్‌ అన్నీ నిలిచిపోయాయి. థియేటర్స్‌ మూతపడ్డాయి. దాంతో ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబయిన కొన్ని సినిమాలు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాయన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాల నిర్మాతలు కూడా ఇటువైపే ఆసక్తి చూపుతున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మల్టీప్లెక్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎమ్‌ఐఏ) స్పందించింది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి తిరిగి థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యేంతవరకు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాల విడుదలకు నిర్మాతలు ఆసక్తి చూపకుండా సినిమా ఎగ్జిబిషన్‌ సెక్టార్‌కు అండగా నిలవాలని ఎమ్‌ఐఏ కోరింది. ‘‘దశాబ్దాలుగా థియేటర్స్‌లోనే ప్రేక్షకులు సౌకర్యవంతమైన వసతులతో సినిమాలను ఆస్వాదిస్తున్నారు.

కానీ కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్‌ మూతపడ్డాయి. దీంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. అంతేకాక థియేటర్స్‌ రంగంపై ఆధారపడి పని చేస్తున్న ఉద్యోగులు, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న కార్మికులు కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. నిర్మాతలు, స్టూడియో అధినేతలు, ఆర్టిస్టులు, కంటెంట్‌ క్రియేటర్స్‌.. ఇలా అందరూ సినిమాలు థియేటర్స్‌లోనే ప్రదర్శితం అయ్యేలా సహకరించాలి. థియేటర్స్‌ మళ్లీ ప్రారంభమయ్యేంతవరకు నిర్మాతలు వేచి ఉండాలని కోరుతున్నాం. ఈ కష్టకాలం ముగిసిన తర్వాత ఇండస్ట్రీ వ్యాపారం తిరిగి గాడిలో పడేందుకు మా వంతు ప్రయత్నం తప్పక ఉంటుంది. అలాగే థియేటర్స్‌లోనే సినిమాలను విడుదల చేయాలన్న తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న నిర్మాతలు, దర్శకులు, స్టూడియోలకు ధన్యవాదాలు’’ అని ఎమ్‌ఐఏ పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement