ఐశ్వర్యారాయ్‌ని ముట్టుకోవాలంటే చేతులు వణికాయి | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యారాయ్‌ని ముట్టుకోవాలంటే చేతులు వణికాయి

Published Sat, Nov 5 2016 12:53 PM

ఐశ్వర్యారాయ్‌ని ముట్టుకోవాలంటే చేతులు వణికాయి

ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో తాను ఐశ్వర్యా రాయ్‌తో కలిసి నటించాలని తనకు కరణ్ జోహార్ చెప్పగానే ఒక్కసారి ఆనందంతో గంతులేశానని, కానీ తర్వాత మాత్రం.. అసలు ఆమె తనతో నటిస్తుందా లేదా అన్న అనుమానం కలిగిందని హీరో రణబీర్ కపూర్ చెప్పాడు. 1999లో విడుదలైన 'ఆ అబ్ లౌట్ చలే' అనే సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని, అందులో ఐశ్వర్యారాయ్ నటించిందని రణబీర్ చెప్పాడు. అప్పటినుంచే తామిద్దరం మంచి స్నేహితులమని అన్నాడు. 
 
ఏ దిల్.. సినిమా షూటింగ్ సందర్భంగా ఐశ్వర్యను ముట్టుకోవాల్సి వచ్చినప్పుడు మొదట్లో తన చేతులు వణికేవని తెలిపాడు. కానీ ఆ తర్వాత ఐశ్వర్య మాత్రం తనను చాలా కూల్‌గా చేసిందని, చిన్నపిల్లాడిలా వేషాలు వేయడం మానేసి సీన్‌లో సరిగా నటించాలని చెప్పిందని అన్నాడు. ఆ తర్వాత తనకు కాస్తంత ఆత్మవిశ్వాసం వచ్చిందన్నాడు. ఆ తర్వాతి నుంచి ఇతర హీరోయిన్లతో ఎలా చేస్తానో ఐశ్వర్యతోనూ అలాగే చేశానన్నాడు. ఆమె ఎంత పెద్ద స్టార్ అయినా, సీనియర్ అయినా.. అసలు ఆ ఫీలింగ్ రానివ్వలేదని వివరించాడు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా గతంలో వచ్చిన కభీ అల్విదా నా కెహనా సినిమాకు దగ్గరగా ఉందన్న విమర్శలను రణబీర్ కొట్టిపారేశాడు. ఆ సినిమా వివాహేతర సంబంధాల గురించి ఉంటుందని, ఈ సినిమాలో అసలు తనకు పెళ్లే కాదని తెలిపాడు. ఇది లవ్ స్టోరీ కాదు గానీ, ప్రేమ, ప్రేమ వైఫల్పయం, వెళ్లిపోవడం, పట్టుకోవడం, స్నేహం.. ఇలా అన్నింటి గురించిన స్టోరీ అని అన్నాడు.

Advertisement
Advertisement