మా ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేస్తే..! | Sakshi
Sakshi News home page

మా ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేస్తే..!

Published Wed, Oct 28 2015 11:12 PM

మా ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేస్తే..!

‘‘కోటితో తీసే సినిమాకైనా, అరవై కోట్లతో తీసే సినిమా కైనా శ్రమ, ప్రేమ ఒకేలా ఉంటాయి.
నా బేనర్లో సినిమా చేసినా బయటి బేనర్లో చేసినా సొంత సినిమాలానే భావిస్తా’’ అన్నారు నందమూరి కల్యాణ్ రామ్. మల్లికార్జున్ దర్శకత్వంలో ఆయన హీరోగా కొమర వెంకటేశ్ నిర్మించిన చిత్రం ‘షేర్’ రిలీజ్ రేపే.
కల్యాణ్‌రామ్ మాటల్లో ఆ విశేషాలు...

 
* వాస్తవానికి ‘పటాస్’కన్నా ముందే ఈ చిత్రాన్ని అంగీకరించా. కానీ, ముందు ఆ సినిమా పూర్తయ్యింది. ‘పటాస్’ విజయం సాధించడంతో తదుపరి చిత్రంపై అంచనాలు ఉంటాయి కాబట్టి, ‘షేర్’ కథలో కొన్ని మార్పులు చేశాం. ఇది డిఫరెంట్ మూవీ అని నేను అనడం లేదు. బోల్డన్ని ట్విస్టులతో, క్షణం క్షణం ఉత్కంఠకు గురి చేస్తూ కాకుండా హాయిగా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అది ఆసక్తికరంగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసే సినిమా అందిస్తున్నాం. ఈ సినిమా ముఖ్యంగా దర్శకుడు మల్లి (మల్లికార్జున్) కోసం ఆడాలని కోరుకుంటున్నా. సరైన కథ కుదరకో... వేరే కారణాల వల్లో మల్లికి రావాల్సినంత బ్రేక్ రాలేదు. మంచి కంటెంట్‌తో తీసిన ఈ సినిమా తనకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడింది తనే. ఇది నా బేనర్లో తీసిన సినిమా కాక పోయినా, బడ్జెట్ కంట్రోల్‌లో ఉండాలనుకున్నా. అందుకే, సెట్స్ వేయిస్తానని నిర్మాత అంటే, ‘మా సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) కంపెనీలో చేసేద్దాం’ అన్నాను.

* ఈ చిత్రంలో నేను సివిల్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు వేరేది చేసే వ్యక్తి అన్నమాట. మల్లి ఈ కథ నాకు చెప్పినప్పుడు అతనిలో కాన్ఫిడెన్స్ కనిపించింది.

* మూడేళ్ల పాటు వేరే సినిమా ఏదీ ఒప్పుకోకుండా నేను చేసిన ‘ఓం’ చాలా నిరుత్సాహపరిచింది. త్రీడీలో తీసిన ఆ సినిమా కోసం చాలా పరిశోధనలు చేశాం. ఆ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బోల్డన్ని ట్విస్టులుంటాయి. అన్ని మలుపులు ఉంటే ప్రేక్షకులు ఒత్తిడికి గురవుతారని అప్పుడు తెలిసింది. అందుకే థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు హాయిగా ఎంజాయ్ చేసే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా. అలాగని ప్రయోగాలు మానను. జయాపజయాల విషయంలో నాకు పెద్దగా తేడా కనిపించడం లేదు. ఫెయిలైనప్పుడు ఎక్కువ ఆలోచిస్తాం, సక్సెస్ అయినప్పుడు తక్కువ ఆలోచిస్తాం... అంతే.

* ‘షేర్’ చిత్రం ఆడియో వేడుకలో నేను ఉద్వేగంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. బేసిక్‌గా నేను పక్కా ఫ్యామిలీ మ్యాన్‌ని. కుటుంబ అనుబంధాల మీద ప్రగాఢమైన నమ్మకం ఉంది. మా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే, ఎవరైనా మా ఫ్యామిలీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే... భరించలేను. మా ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేస్తే ఎమోషనల్ అయిపోతాను.

* తమ్ముడు (ఎన్టీఆర్)తో నిర్మించనున్న చిత్రం గురించి ప్రణాళికలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరాక అధికారికంగా ప్రకటిస్తా. దానిలో నేను నటించడం అవసరమా? (నవ్వుతూ). నా తదుపరి చిత్రం గురించి కూడా త్వరలో చెబుతాను.

Advertisement
Advertisement