Sakshi News home page

వందేళ్ల తర్వాత సినిమా విడుదల!

Published Sat, Sep 24 2016 12:36 AM

వందేళ్ల తర్వాత సినిమా విడుదల!

 - 18 నవంబర్ 2115లో రిలీజ్
 సినిమా తీసేవాళ్లు, యాక్ట్ చేసేవాళ్లు ఎప్పుడెప్పుడు ఆ సినిమాని స్క్రీన్ మీద చూసుకుందామా? అని ఆసక్తిగా ఉంటారు. స్టార్స్ నటించిన సినిమా అయితే అభిమానులు ఆ సినిమా విడుదల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. అప్పుడా చిత్రబృందం ‘వందేళ్ల తర్వాత ఈ సినిమా విడుదలవుతుంది’ అని ప్రకటిస్తే.. ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయిపోతారు. విన్నవాళ్లు విన్నది నిజమేనా? అనుకుంటారు. తీసినవాళ్లు, యాక్ట్ చేసినవాళ్లు కూడా ఈ సినిమాని చూడలేరు. ఆ మాటకొస్తే.. వాళ్ల పిల్లలు, పిల్లల పిల్లలు కూడా చూడరు.
 
 ఆ తర్వాతి తరం వాళ్లు చూస్తారు. భవిష్యత్తులో ఎప్పుడో వారసులు మాత్రమే చూడదగ్గ చిత్రం ఇప్పుడు రూపొందింది. అది హాలీవుడ్ సినిమా. పేరు ‘హండ్రెడ్ ఇయర్స్...’. ఉపశీర్షిక  ‘ది మూవీ యు విల్ నెవర్ సీ’. ఇంకో వందేళ్ల దాకా చూడలేని సినిమా కాబట్టి, టైటిల్ యాప్ట్‌గానే పెట్టారు. రాబర్ట్ రోడ్రిగె దర్శకత్వంలో లూయి 13 కాగ్నక్ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. జాన్ మాల్కొవిచ్ కథ అందించడంతో పాటు కీలక పాత్ర చేశారు. ఇంకా షూయా చాంగ్, మార్కో జరోర్ నటించారు. 18 నవంబర్ 2115లో ఈ చిత్రం విడుదల కానుంది.
 
 అన్నేళ్లు ఎలా భద్రపరుస్తారు?
 ఓ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే కొన్ని సీన్లు, పాటలకు సంబంధించిన క్లిప్పింగ్స్, నటీనటుల గెటప్స్ బయటికొచ్చేస్తున్నాయ్. విడుదలయ్యాక సినిమా మొత్తం పైరసీకి గురవుతోంది. ఈ నేపథ్యంలో వందేళ్లు ఈ సినిమా కాపీని ఎలా భద్రపరుస్తారు? అనే విషయానికి వస్తే.. దీని కోసం ప్రత్యేకంగా ఓ బుల్లెట్ ప్రూఫ్ లాకర్‌ను తయారు చేయించారు. అందులో ఈ చిత్రం ప్రింటుని భద్రపరుస్తారు. ఆ లాకర్‌కి ఓ టైమ్ సెట్ చేశారు. 18 నవంబర్ 2115లో ఆ లాకర్ దానంతట అది తెరుచుకుంటుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ లాకర్‌ని ఆ మధ్య ఫ్రాన్స్ నగరంలో జరిగిన కాన్స్ చలన చిత్రోత్సవాల్లో, ఆ తర్వాత పలు చిత్రోత్సవాల్లోనూ చూపించారు.
 
 ట్రైలర్‌లోనూ ఏమీ చూపించలేదు!
 వందేళ్ల తర్వాత విడుదల కానున్న ఈ సినిమా కథ ఏంటో బయటకు రాలేదు. ఎప్పుడో రిలీజ్ కానున్న ఈ చిత్రకథ తెలుసుకోవాలని ఇప్పటివాళ్లకు ఉంటుంది. అయితే టూకీగా కూడా కథ చెప్పడానికి చిత్రబృందం రెడీగా లేదు. అంతెందుకు? గతేడాది ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్‌లో కూడా కథ గురించి క్లూ ఇవ్వలేదు. సినిమాలో ఉన్న సన్నివేశాలను ఆ ట్రైలర్‌లో చూపించలేదు. వందేళ్ల తర్వాత టెక్నికల్‌గా ఎలా ఉంటుంది? అనేది ఊహించి, ట్రైలర్‌లో చూపించారు?  మామూలుగా ఏడాదికీ రెండేళ్లకీ సాంకేతికం గా చాలా మార్పొస్తోంది. మరి.. వందేళ్ల తర్వాత విడుదల కానున్న ఈ సినిమా టెక్నాలజీ పరంగా భవిష్యత్ తరాన్ని ఏ మేరకు అలరిస్తుంది? అనేది సమాధానం దొరకని ప్రశ్నే.

 ప్రీమియర్‌కు వెయ్యి మంది!
  అంతా బాగానే ఉంది... ఈ  సినిమాని ఇప్పుడు నిర్మించడం ఎందుకు? అంటే... ఎవరి ఆనందం వాళ్లది. ఇలాంటి ఓ ప్రయత్నం చేశారంటే దానివెనక బలమైన కారణం ఏదైనా ఉండే ఉండాలి. ఆ కారణానికి కూడా ఇప్పుడు జవాబు దొరకదు. థియేటర్లో విడుదల చేయకపోయినా చిత్రానికి సంబంధించిన కీలక నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రివ్యూ చూసేస్తారు. చిత్ర దర్శక-నిర్మాతలు 18 నవంబర్ 2115లో ఈ చిత్రం ప్రీమియర్ ప్రదర్శించేటప్పుడు వెయ్యి మంది అతిథులను ఆహ్వానించాలని లిఖితపూర్వకంగా తమ వారసులకు పేర్కొన్నారట. ప్రింటు భద్రపరచిన లాకర్‌లోనే ఆ ఉత్తరం  ఉంటుందని సమాచారం. మామూలుగా ఏదైనా అర్థం కాకపోతే ‘దీని భావమేమి తిరుమలేశా’ అనడం ఆనవాయితీ. సో.. వందేళ్ల తర్వాత విడుదల కాబోయే ఈ సినిమా నిర్మాణం వెనక అసలు కారణమేమి తిరమలేశా’ అనాలి.
 

Advertisement

What’s your opinion

Advertisement