ఆ వేడుక ఆగస్టులో.. | Sakshi
Sakshi News home page

ఆ వేడుక ఆగస్టులో..

Published Wed, Nov 16 2016 2:46 AM

ఆ వేడుక ఆగస్టులో..

జీవితంలో వివాహమనే ప్రధాన ఘట్టానికి నటి సమంత చేరువవుతున్నారు. ఆ వేడుక వచ్చే ఏడాది ఆగస్టులో జరగనుందన్నది తాజా సమాచారం. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య, సమంత ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు ఆమోదముద్ర వేసిన సంగతి విదితమే. అదే విధంగా నాగచైతన్య సోదరుడు అఖిల్ వ్యాపారవేత్త కూతురు, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీయ ప్రేమించుకుంటున్నారు. ఈ జంట వివాహ నిశ్చితార్థం డిసెంబర్‌లో జరగనుంది. వివాహం వేడుక వచ్చే ఏడాది మేలో జరగనుందని సమాచారం.కాగా నాగచైతన్య, సంమతల పెళ్లి వచ్చే ఏడాది ఆగస్ట్‌లో జరగనుందని సినీ వర్గాల సమాచారం.

వీరి వివాహంలో విశేషం ఏమిటంటే నాగచైతన్యది హిందూ మతం. సమంత క్రిస్టియన్ మతం. దీంతో వీరి పెళ్లి రెండు సంప్రదాయాల ప్రకారం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో హిందు సంప్రదాయం ప్రకారం, ఆ తరువాత చెన్నైలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహతంతును నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టులో జరిగే పెళ్లికి సమంత ఇప్పటి నుంచే నగలు, చీరలు కొనుగోలు చేసే పనిలో పడినట్లు టాక్. సమంత చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉన్నాయి . వాటిలో విశాల్ సరసన నటించే ఇరుంబు కుదిరై, శివకార్తికేయన్ జంటగా ఒక చిత్రం, విజయ్‌సేతుపతితో మరో చిత్రం చేయనున్నారు.

ఈ బ్యూటీ తెలుగులో ఒక్క చిత్రం చేయకపోవడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను త్వరగా పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలన్నది సమంత ఆలోచనగా తెలుస్తోంది. అయితే సమంత వివాహానంతరం నటించాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని నాగచైతన్య ఇప్పటికీ  ప్రకటించడం గమనార్హం.

Advertisement
Advertisement