నేనా... రెండో కథానాయికగానా!? | Sakshi
Sakshi News home page

నేనా... రెండో కథానాయికగానా!?

Published Sun, Dec 7 2014 10:45 PM

నేనా... రెండో కథానాయికగానా!?

‘‘పదకొండేళ్ల నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను. ఇన్నేళ్లలో నేను ఇక్కడ చేసింది పందొమ్మిది సినిమాలు. అగ్రకథానాయకులు, అగ్రదర్శక, నిర్మాతలతో సినిమాలు చేశాను. ఒక నంది అవార్డు, మూడు ఫిలింఫేర్లతో పాటు మరెన్నో అవార్డులు దక్కాయి. తెలుగులో నా ట్రాక్ రికార్డ్ ఇది. ఇంత ఘనమైన కెరీర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని త్రిష చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఇప్పటివరకు త్రిష చేసిన సినిమాలు యాభై పైచిలుకు. ఈ నెల 5తో ఆమె తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి, పదకొండేళ్లయ్యింది. ఎన్నో గొప్ప పాత్రలు చేసే అవకాశం తెలుగు పరిశ్రమ తనకు కల్పించిందని ఈ సందర్భంగా త్రిష పేర్కొన్నారు.
 
  ఇన్నేళ్ల కెరీర్‌లో త్రిష ఇద్దరు నాయికలున్న చిత్రాలు చేసింది చాలా తక్కువ. కావాలనే అలాంటి చిత్రాలకు దూరంగా ఉన్నారా? అనే ప్రశ్న త్రిష ముందుంచితే - ‘‘ఇద్దరు హీరోయిన్ల కథల మీద నాకు ఆసక్తి లేని మాట వాస్తవమే. కానీ, కొన్ని చిత్రాలు చేశాను. వాటిలో నా పాత్రలెంతో గొప్పగా ఉంటాయి. అందుకే చేశా. భవిష్యత్తులో కూడా గొప్ప పాత్ర వస్తే.. ఇద్దరు నాయికలున్న చిత్రంలో నటించడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ, రెండో కథానాయికగా మాత్రం ఎప్పటికీ చేయను’’ అని తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement