Sakshi News home page

ముచ్చటగా మూడో లుక్!

Published Wed, Sep 17 2014 12:35 AM

ముచ్చటగా మూడో లుక్! - Sakshi

 సినిమానే శ్వాసించే అతికొద్దిమంది భారతీయ నటుల్లో ఆమిర్‌ఖాన్ ఒకరు. 24 శాఖలపై ఆమిర్‌కున్న అవగాహన అపారం. సినిమా కోసం ఎంతటి కష్టాన్నయినా అనుభవించడం ఆయన నైజం. ప్రస్తుతం ఆయన ‘పీకె’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్‌లుక్ వివాదాలకు తెరలేపింది. ఆమిర్‌లాంటి సూపర్‌స్టార్ ఇలా నగ్నంగా నటించడమేంటని విమర్శలు కూడా తలెత్తాయి. కానీ... ఆయన అలాంటివాటిని లెక్క చేయరు. ఆమిర్‌కి పాత్రే ప్రాణం. పంజాబీ వాయిద్యకారునిగా ‘పీకె’ సెకండ్ లుక్ దేశవ్యాప్తంగా ఆమిర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది.
 
  ఇప్పుడు ముచ్చటగా మూడో స్టిల్‌ని మీడియాకు విడుదల చేశారు ఆమిర్. పోలీస్ యూనిఫాంలో ఆమిర్ కనిపిస్తున్న ఈ థర్డ్‌లుక్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. డ్రస్‌ని బట్టి చూస్తే... ఆ యూనిఫాం తనది కాదని చూడగానే పట్టేయొచ్చు. లూజ్‌గా, భారీ కొలతలతో ఉన్న యూనిఫామ్‌ని, బెల్డ్ సహాయంతో బిగించి మరీ తొడిగి కనిపిస్తున్నారు ఆమిర్. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే కథ తెలియాల్సిందే. ఇందులో ఆమిర్‌ది గ్రహాంతరవాసి పాత్రట. గ్రహాంతర వాసి మానవరూపం ధరించడానికి కారణమేంటనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం. అనుష్కశర్మ ఇందులో కథానాయిక. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న విడుదల చేయనున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement