శాండిల్‌వుడ్‌లో తెలుగుతేజం | Sakshi
Sakshi News home page

శాండిల్‌వుడ్‌లో తెలుగుతేజం

Published Tue, Feb 2 2016 9:49 PM

శాండిల్‌వుడ్‌లో తెలుగుతేజం

  పబ్లిసిటీ డిజైనర్‌గా రాణిస్తూ
 దర్శకత్వం వైపు అడుగులు

 
 బెంగళూరు(బనశంకరి) : కన్నడ  చలన చిత్ర రంగంలో ప్రవేశించిన ఓ ప్రవాసాంధ్రుడు పబ్లిసిటీ డిజైనర్‌గా రాణిస్తూ దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. తెలుగు తేజమైన ఎన్‌పీ తులసీ సీతారామ్‌రాజ్ కన్నడ చిత్ర పరిశ్రమలో పబ్లిసిటీ డిజైనర్‌గా స్థిరపడి తాజాగా ఓ కన్నడ చిత్రానికి దర్శకత్వం చేయనున్నారు. 24 ఏళ్ల తులసీరామ్ అనంతపురం జిల్లా పుట్టపర్తి తాలూకా నాగిశెట్టిపల్లికి చెందిన వారు. ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడు. 2014లో కన్నడ సినిమా రంగంలో అడుగుపెట్టి ఎవరి అండదండలు లేకుండా స్వశక్తితో తన సాంకేతిక పరిజ్ఞానంతో కన్నడ సినిమా పోస్టర్స్, పేర్లను తనదైనశైలిలో డిజైనింగ్ చేస్తూ కన్నడ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.
 
  కన్నడ రంగంలో రాణించాలనే ఉద్దేశంతో సొంతంగా ఏపీఎస్ అనే సంస్థను నెలకొల్పారు. దాదాపు 26 చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా, చిత్ర నిర్మాణ పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహించారు. అంతేగాక గత ఏడాది సూపర్‌హిట్ కన్నడ సినిమాలైన గూళిహట్చి, పరమశివ, కోలాహల, మిర్చిమండక్కిఖడక్‌చాయ్, బిలియన్ డాలర్ బేబీ, పస్ట్‌ర్యాంక్‌రాజు తదితర సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేశారు. కామెడీ చిత్రం ‘ఫస్ట్‌ర్యాంక్‌రాజు’ తులసీరామ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
 
 ఈ సందర్భంగా తులసీరామ్ సాక్షితో మాట్లాడుతూ... తెలుగు సినీరంగంలో క్రియేటిక్ డెరైక్టర్‌గా రాణిస్తున్న ఎస్‌ఎస్.రాజమౌళిని ఆదర్శంగా తీసుకుని తాను కన్నడ సినిమా రంగంలోకి ప్రవేశించానన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి తాలూకా నాగశెట్టిపల్లి తన స్వస్ధలం అయినప్పటికీ బెంగళూరు నగరంలోనే సివిల్ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశానని చెప్పారు. మాతృభాష తెలుగు అయినప్పటికీ  కన్నడ సినిమా రంగంలో అడుపెట్టడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కన్నడ, తెలుగు భాషల్లో ఉత్తమ సినిమాలు రూపొందించాలన్నదే తన ధ్యేయమన్నారు.
 
  ఈ ఏడాది తన చేతిలో ఉడుంబ, పంద్య, జీనియస్ తదితర సినిమాలకు పబ్లిసిటీ డిజైనింగ్ చేయనున్నట్లు చెప్పారు.  అలాగే తన స్వీయ దర్శకత్వంలో ఫిబ్రవరి రెండవ వారంలో కన్నడ చిత్ర ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.   కన్నడలో పౌరాణిక చిత్రం తీయాలనేది తన లక్ష్యమని చెప్పారు. రవిచంద్రన్ హీరోగారూపొందించిన పరమశివ అనే సినిమాకు 2015 సంవత్సరం ఉత్తమ డిజైనర్ గా అవార్డు దక్కడం తనకు మరచిపోలేని అనుభూతి అన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement