'పోటుగాడు' సినిమా రివ్యూ! | Sakshi
Sakshi News home page

'పోటుగాడు' సినిమా రివ్యూ!

Published Sat, Sep 14 2013 1:31 PM

'పోటుగాడు' సినిమా రివ్యూ! - Sakshi

టాలీవుడ్ తెరపై ఎప్పుడూ విభిన్నంగా కనిపించాలని తాపత్రయపడే యువతరం హీరోల్లో మంచు మనోజ్ ఒక్కరని నిస్సందేహంగా చెప్పవచ్చు. నటుడిగా మంచు మనోజ్ అభిరుచికి 'నేను మీకు తెలుసా?', 'ప్రయాణం', 'ఝుమ్మంది నాదం', 'ఊ కొడుతారా ఉలిక్కి పడుతారా' చిత్రాలే నిదర్శనం. తాజాగా కన్నడంలో విజయం సాధించిన ‘గోవిందయ నమః’ చిత్ర రీమేక్ ఆధారంగా రూపొందించిన ‘పోటుగాడు’  శనివారం (సెప్టెంబర్ 14) రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఆడియోతో ‘పోటుగాడు’ ప్రేక్షకులకు దగ్గరై.. అభిమానుల్లో భారీ ఈ చిత్రం అంచనాలు పెంచింది. ఎలాగైనా భారీ హిట్‌ను సాధించాలని కసితో చేసిన ‘పోటుగాడు’ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను ఆలరించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే!
 
జీవితాన్ని  ఎప్పుడు చాలా లైట్‌గా తీసుకునే గోవిందం.. ఆత్మహత్య చేసుకోవాలని సీరియస్‌గా నిర్ణయం తీసుకుని ఓ కొండపైకి చేరుకుంటాడు. అదేసమయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంకట్ కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అయితే కొండపైకి చేరుకున్న గోవిందం, వెంకట్‌లు ఆత్మహత్య చేసుకున్నారా? ఒకవేళ ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానుకుంటే ఎందుకు? ఆత్మహత్యను విరమించుకునేలా ప్రభావం చేసిన అంశాలేమిటనే ప్రశ్నలకు సమాధానమే పోటుగాడు సినిమా సింగిల్ లైన్ కథ. 
 
సింగిల్ లైన్ కథ చాలా సింపుల్‌గా అనిపించినా.. డిటైల్డ్ స్టోరిలో ప్రేక్షకుల్ని ఐదు ప్రేమకథలు వినోదంతో గిలిగింతలు పెట్టాయని చెప్పవచ్చు. గోవిందం పాత్రలో నాలుగు రకాల ప్రేమ వ్యవహారాల్లో నడిపించిన మనోజ్.. నాలుగు రకాల విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రతి పాత్రలోనూ మనోజ్ పలికించిన హావభావాలు, సంభాషణలు పలికే తీరు ‘డైలాగ్ కింగ్’ మోహన్‌బాబును మరిపించేలా ఉన్నాయి. ఇప్పటి వరకు స్టార్‌గానే అభిమానులను ఆలరించిన మనోజ్.. తన నటుడుగా నూటికి నూరు మార్కులు సొంతం చేసుకున్నాడు. గోవిందం పాత్ర ఛాలెంజ్ లాంటిది. అయితే మనోజ్ తనదైన శైలిలో రఫ్ ఆడించాడు. చిత్ర అధికభాగం ఎంటర్‌టైన్‌మెంట్‌తో అదరగొట్టిన మనోజ్..క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌తో వాహ్ అనిపించాడు. ఇక నటన, డ్యాన్స్‌లేకాక.. ఈ చిత్రంలో మనోజ్ కంపోజ్ చేసిన స్టంట్స్ నేచురల్‌గా ఉన్నాయి. మనోజ్‌కు సపోర్టింగ్‌గా చేసిన వెంకట్ క్యారెక్టర్‌లో పోసాని కృష్ణమురళి నటన ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. నలుగురు హీరోయిన్లగా వైదేహి(సిమ్రాన్ కౌర్), ముంతాజ్ (సాక్షి చౌదరీ), రేచల్ (రేచల్), ప్రియ (అనుప్రియ)లు నటించారు. నలుగురిలో ముఖ్యంగా ముంతాజ్ ఎక్కువ మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు. 
 
 ఇక దర్శకుడు పవన్ వడెయార్ స్క్రీన్‌ప్లే, కథను నడిపించిన తీరు మరింత బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా శ్రీధర్ సీపానీ మాటలు బ్రహ్మండంగా పేలాయి. కొంత డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఇబ్బంది పెట్టినా.. మనోజ్‌తో పలికించిన తీరు కొంత రిలీఫ్ కలిగించాయి. అచ్చు అందించిన సంగీతం విడుదలకు ముందే ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. ‘ప్యార్ మే పడిపోయా’ అంటూ ఇందూ నాగరాజ్‌తో కలిసి మనోజ్ పాడిన పాట,  శింబు పాడిన బుజ్జి పిల్లా, దేవతా పాటల చిత్రీకరణ బాగుంది. చిత్ర ద్వితీయార్థంలో కొంత నెమ్మదించినా.. అన్ని రంగాల సమిష్టి కృషి ముందు పెద్దగా ప్రభావం చూపేలా అనిపించలేదు.  లగడపాటి శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన  ఈ చిత్రంలో అభిమానులను, ప్రేక్షకులను సంతృప్తి పరిచే కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా థియేటర్‌కు రప్పించగలిగితే.. గత కొద్దికాలంగా ఎదురు చూస్తున్న కమర్షియల్ హిట్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా... కలెక్షన్లను రాబట్టడంలో కూడా మంచు మనోజ్ ‘పోటుగాడు’గా నిలువడం ఖాయం!
 - రాజాబాబు అనుముల

Advertisement
Advertisement