టేక్‌ అనగానే పూనకం వచ్చేస్తుంది | Sakshi
Sakshi News home page

టేక్‌ అనగానే పూనకం వచ్చేస్తుంది

Published Tue, Nov 19 2019 12:14 AM

rajendra prasad speech at about bommalata - Sakshi

‘‘రెండు హిట్స్‌ వస్తే రిలాక్స్‌ అయ్యే రోజులివి. ఇన్నేళ్లు ఫీల్డ్‌లో ఉన్నామంటే నిరంతరం పరిగెడుతుండటమే కారణం. రేస్‌లో ఉండాలంటే ప్రతిరోజూ పరిగెత్తాలి. రెస్ట్‌ తీసుకొని అవసరమైనప్పుడే పరిగెడతాను అంటే కిందపడతాం’’ అన్నారు రాజేంద్రప్రసాద్‌. విశ్వంత్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తోలుబొమ్మలాట’.  విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వంలో దుర్గా ప్రసాద్‌ మాగంటి నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ చెప్పిన విశేషాలు.

► మన పెద్దవాళ్లు చెప్పేవారు ‘జీవితమే ఒక తోలుబొమ్మలాట’ అని. తల్లి, తండ్రి, గురువు, దైవం ఇలా ఎవరో ఒకరు మనల్ని ఆడిస్తూనే ఉంటారు. మనందర్నీ ఆ దేవుడు ఆడిస్తున్నాడని నేను నమ్ముతాను. అనుకున్నట్టు జరగనిదే జీవితం. దాన్ని ఆస్వాదించాలి.

► దర్శకుడు విశ్వనాథ్‌ నాకు ‘తోలుబొమ్మలాట’ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ‘ఈ కథ మొత్తం మీ చుట్టూనే తిరుగుతుంది’ అన్నాడు. అవునా, సరే అని విన్నాను. కథ పూర్తయ్యేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది. ‘ఈ కథ నువ్వే రాశావా?’ అని అడిగాను. కథ నాకు అంత బాగా నచ్చింది. కుటుంబ బంధాలు, అనుబంధాలు గురించి చెప్పే మంచి కథ. కానీ దర్శకుడి వయసు చూస్తే 30కి తక్కువే. అందుకే కథ నువ్వే రాశావా? అని అతన్ని అడిగాను.

► ఈ సినిమాలో సోడాల రాజు అనే పాత్ర చేశాను. ఇందులో నా పాత్ర కొత్తగా కనపడాలనుకున్నాం. కొత్తగా కనపడాలంటే పాత్ర మాత్రమే కనపడాలి. పెద్ద మనిషిలా కనపడాలి. అందరూ గౌరవించేలా ఉండాలి. మనిషికి ఎన్నో బంధాలు. వాటి వల్ల పొందే కష్టాలు, సుఖాలు ఉంటాయి. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను మా సినిమాలో చూపించాం.

► కామెడీ ఎప్పుడూ రెండు రకాలు. ఒకటి హీరో చేసేది, మరోటి కమెడియన్‌ చేసేది. ఎవరు కామెడీ చేసినా సరే అది ఎక్కువ కాలం నిలబడాలంటే కామెడీ ఎప్పుడూ హుందాగా ఉండాలి. కొత్తకొత్తవాళ్లతో సినిమాలు చేస్తున్నాను. కొందరు ఎలా చేద్దాం? అని డిస్కస్‌ చేస్తుంటారు. అలాంటప్పుడు నా అభిప్రాయాలు చెబుతుంటాను.

► నటుడిగా ఇన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నా ఎప్పుడూ కూడా నా వృత్తిని తేలికగా తీసుకోలేదు. ఎప్పుడైనా బయటకు సరదాగా చెబుతాం అవలీలగా పాత్రలు చేసేశాం అని. అయితే ప్రతీ పాత్ర చేయడానికి ఎంతో శ్రమ దాగి ఉంటుంది. నేనేదైనా కథ విన్నాక ఓ 2–3 గంటలు మా ఇంట్లో ఎవ్వరూ నన్ను డిస్ట్రబ్‌ చేయరు. ఆ సమయాన్నంతా పాత్రలోకి ఎలా వెళ్లాలి? అని ఆలోచిస్తుంటాను. సెట్లో కూడా ఆ పాత్ర గురించి ఆలోచిస్తుంటాను. టేక్‌ అనగానే నాకు పూనకం వచ్చేస్తుంది.

► ప్రస్తుతం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాను. ‘సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో..’ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. ‘ఎర్ర చీర’ చేస్తున్నాను.  ‘సరిలేరులో..’ మహేశ్, నేను టామ్‌ అండ్‌ జెర్రీలా ఉంటాం. ‘వైకుంఠ..’లో పోలీసాఫీసర్‌ పాత్ర చేస్తున్నా.

► నా వారసుణ్ణి కూడా నేనే. నాకు ఆసక్తి ఉండి నేనే సినిమాల్లోకి వచ్చాను. మా పిల్లలు రాలేదు. కానీ నా మనవరాలు ‘మహానటి’ ద్వారా పరిచయం అయింది. తనకి ఆసక్తి ఉండి చేసింది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మంచి పాత్ర చేస్తోంది కూడా.

► మన ఇంట్లో ఉన్న సమస్యను మన ఇంట్లో కూర్చునే పరిష్కరించుకోవాలి. బయటకు వచ్చి గొడవలు పడితే ఎవరికి నష్టం? చూసేవాళ్లకు గొడవలు బాగా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ వాళ్లు వాళ్ల సమస్యను అసోసియేషన్‌ లోపలే పరిష్కరించుకోవాలి. సమస్యలు వస్తాయి. హుందాగా ఎదుర్కోవాలి. బయటపడిపోకూడదు. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను.

Advertisement
Advertisement