రజనీకాంత్, మహేశ్‌ బాబు.. ఓ మల్టీ స్టారర్! | Sakshi
Sakshi News home page

రజనీకాంత్, మహేశ్‌ బాబు.. ఓ మల్టీ స్టారర్!

Published Thu, Sep 25 2014 11:00 PM

రజనీకాంత్, మహేశ్‌ బాబు.. ఓ మల్టీ స్టారర్!

సూపర్‌స్టార్స్ రజనీకాంత్, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో సినిమా... గురువారం మధ్యాహ్నం నుంచి మీడియాలో హల్ చల్ చేసిన వార్త ఇది. అసలిది నిజమేనా? అయితే ఎప్పుడు ఉంటుంది? రకరకాల ప్రశ్నలు. వీటన్నిటికీ పాఠకులకు సమాధానం ఇవ్వడం కోసం సీనియర్ నిర్మాత యు. సూర్యనారాయణ బాబుతో మాట్లాడింది ‘సాక్షి’. రామ్ రాబర్ట్ రహీమ్, సంధ్య, శంఖారావం, బజార్ రౌడీ... ఇలా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో  20 చిత్రాలు నిర్మించిన సూర్యనారాయణబాబు, స్వయానా సూపర్‌స్టార్ కృష్ణకు చెల్లెలు భర్త. కృష్ణతో ‘అల్లుడు దిద్దిన కాపురం’(1991) తీశాక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారాయన. రజనీకాంత్, మహేశ్‌బాబు తన సినిమాలో కథానాయకులుగా నటించడానికి పచ్చజెండా ఊపేశారని చెబుతున్న సూర్యనారాయణ బాబు ‘సాక్షి’తో ఏమన్నారంటే...
 
రజనీకాంత్‌తో సినిమా అంటే అది వంద కోట్లపై మాట. పైగా మహేశ్ కూడా మరో హీరో అంటున్నారు. ఇది సాధ్యమేనా?
రజనీకాంత్ ఇచ్చిన భరోసా ఇది. నేనంటే ఆయనకు అభిమానం. ‘‘ ‘లింగా’ తర్వాత ఇరోస్ సంస్థలో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంది. అది కూడా పూర్తయ్యాక మీ సినిమా చేస్తాను’’ అని ఆయనే స్వయంగా నాతో చెప్పారు. నేను ఆయనతో తెలుగులో ‘రామ్ రాబర్ట్ రహీమ్’, ‘అన్నదమ్ముల సవాల్’, హిందీలో ‘మేరా అదాలత్’, ‘మహా గురు’ తీశాను.
 
ఇంతకూ రజనీకాంత్‌ని ఎప్పుడు కలిశారు?
తమిళ నిర్మాత కె.సి.ఎన్.చంద్రుగారితో నా గురించి వాకబు చేశారట రజనీ. వెంటనే.. నేను, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో రజనీని కలిశాం. ‘సినిమాలు తీయడంలేదే’ అనడిగారు రజనీ. ‘మీ నిర్మాతను కదా. మీరు ‘ఓకే’ అంటే చేయాలనే ఉంది’ అన్నాను. ఆయన కూడా ఓకే అన్నారు. పైగా ఆయనే ‘అన్నదమ్ముల సవాల్’లా మల్టీస్టారర్ అయితే బావుంటుందని సూచించారు.  ‘అన్నదమ్ముల సవాల్’లో కృష్ణ, రజనీకాంత్ నటించారు.
 
మరి మహేశ్‌బాబుకు ఈ విషయం చెప్పారా?
చెప్పాను. ‘సూపర్‌స్టార్‌తో చేయడం నాకూ హ్యాపీనే’ అన్నారాయన. ఇద్దరు సూపర్‌స్టార్లతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉంది.
 
మీరొక్కరేనా... ఇంకెవరినైనా కలుపుకొని ఈ సినిమా చేస్తారా?
నేనొక్కడినే చేస్తాను. 23 ఏళ్ల విరామం తర్వాత చేస్తున్న సినిమా అవ్వడం వల్లే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాను. ఇంత విరామం తర్వాత వచ్చే సినిమా ఈ స్థాయిలోనే ఉండాలనేది నా ఆలోచన.
 
మంచి సినిమాలు నిర్మించిన మీరు ఉన్నట్లుండి సినిమా రంగానికి ఎందుకు దూరమయ్యారు?
వ్యాపార రీత్యా విజయవాడలో స్థిరపడ్డాను. సినిమాలపై మమకారంతో మళ్లీ నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాను... అంతే.
 
దర్శకుడు, కథ, సాంకేతిక బృందం వివరాలు...
రజనీకాంత్, మహేశ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది మొన్నే కదా. ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టే. త్వరలోనే వివరాలు చెబుతాం.
 
సెట్స్‌కి వెళ్లేదెప్పుడు?
వచ్చే ఏడాది చివర్లో కానీ, 2016లో కానీ ఉంటుంది. మా పద్మావతీ ప్రొడక్షన్స్ పతాకంపైనే ఈ చిత్రాన్ని నిర్మిస్తాను.

Advertisement
Advertisement