మురుగదాస్‌ చిత్రానికి రజనీ ఎన్ని రోజులు కేటాయించారంటే..? | Sakshi
Sakshi News home page

మరో చిత్రానికి సిద్ధం

Published Mon, Feb 4 2019 9:32 AM

Rajinikanth And A R Murugadoss Movie Shooting Starts - Sakshi

తమిళసినిమా: పేట చిత్రం అన్ని విధాలా దుమ్మురేపడంతో ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్‌తో పాటు, ఆయన అభిమానులు యమ ఖుషీగా పండగ చేసుకుంటున్నారు. చాలాకాలం తరువాత సూపర్‌స్టార్‌ ఖాతాలో మరో మంచి కమర్షియల్‌ చిత్రం చేరిందని చెప్పవచ్చు. పేట చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన రజనీకాంత్‌ గత నెల చివరలో కుటుంబంతో సహా విహారయాత్రకు అమెరికా వెళ్లొచ్చారు. తాజాగా మరింత ఉత్తేజంతో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన ఇప్పుడు దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే.

పలు విశేషాలతో కూడిన ఈ చిత్రం మార్చిలో సెట్‌పైకి వెళ్లనుందన్నది తాజా సమాచారం. ఇందులో హీరోయిన్‌ ఎవరన్నది చిత్ర వర్గాలు స్పష్టం చేయకపోయినా, యువ క్రేజీ నటి కీర్తీసురేశ్‌ పేరు వార్తలో చాలా రోజులుగానే నానుతోంది. అదేవిధంగా ఇది రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రం అని, దీనికి నర్కాలి అనే టైటిల్‌ను చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీన్ని దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ ఖండించారు. ఇది అసలు రాజకీయ నేపథ్యంలో సాగే కథే కాదని తేల్చి చెప్పారు. దీంతో ఆ తరువాత ఇందులో రజనీకాంత్‌ మరోసారి పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై మాత్రం దర్శకుడు ఎలాంటి ఖండన చేయలేదు. పేట చిత్రంలో పాటలను, నేపథ్య సంగీతాన్ని అదరగొట్టిన యువ సంగీతదర్శకుడు అనిరుధ్‌నే రజనీకాంత్‌ తాజా చిత్రానికి సంగీత బాణీలు కట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక మరో విషయం ఏమిటంటే ఈ భారీ చిత్రం కోసం సూపర్‌స్టార్‌ ఏకంగా 90 రోజులు కాల్‌షీట్స్‌ కేటాయించారట. చిత్రాన్ని మార్చిలో చెన్నైలో ప్రారంభించి, ఆపై హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో నిర్వహించడానికి ప్రణాళికను చిత్ర వర్గాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement