రొటీన్‌గా తీస్తే... రొటీన్‌గా హిట్ చేశారు! | Sakshi
Sakshi News home page

రొటీన్‌గా తీస్తే... రొటీన్‌గా హిట్ చేశారు!

Published Tue, Jun 2 2015 11:30 PM

రొటీన్‌గా తీస్తే... రొటీన్‌గా  హిట్ చేశారు!

 విమర్శకుల మాటెలా ఉన్నా, ప్రేక్షకులు మాత్రం వినోదం అనిపిస్తే చాలు... రొటీన్ సినిమాలకు కూడా పట్టం కట్టేస్తారు. తాజాగా ‘పండగ చేస్కో’ సినిమాకు వస్తున్న వసూళ్ళే అందుకు నిదర్శనం. రామ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ తదితరులు నటించగా, పరుచూరి ప్రసాద్ నిర్మాతగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘పండగ చేస్కో’ గతవారం రిలీజైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం చిత్ర విజయోత్సవం జరిపిన యూనిట్, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
 
  చిత్రానికి పనిచేసిన నట, సాంకేతిక వర్గంతో పాటు, పలువురు సినిమా ప్రముఖలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో హీరో రామ్ మాట్లాడుతూ -‘‘2013 మే నెలలో వెలిగొండ శ్రీనివాస్ నుంచి ఈ కథ విన్నాను.  అప్పుడు ఫ్రెష్‌గా అనిపించింది. తరువాత చాలా సినిమాలు రావడం వల్ల కొంత రొటీన్ అనే అభిప్రాయం వ్యక్తమైందేమో. ఈ సినిమాకు పరిశ్రమలోని బెస్ట్ టీమ్ పనిచేసింది’’ అన్నారు. ‘‘రామ్ కెరీర్‌లో ‘రెడీ’, ‘కందిరీగ’ లాగా ‘పండగ చేస్కో’ కమర్షియల్ హిట్. వినోదం వల్లే ఈ సినిమా ఇంత హిట్. సెకండాఫ్ గంటా 27 నిమిషాలనూ ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏణ్ణర్ధం పాటు కష్టపడి నిర్మాత పరుచూరి ప్రసాద్ తీసిన ఈ సినిమా మా డిస్ట్రిబ్యూటర్లందరికీ డబ్బులు తెచ్చిపెడుతోంది’’ అని డిస్ట్రిబ్యూటర్ ‘దిల్’ రాజు అన్నారు.
 
  ‘‘రివ్యూలకూ, రెవెన్యూకూ సంబంధం లేకుండా ఉంది. వైజాగ్‌లో మా థియేటర్‌లో అన్ని ఆటలూ ఫుల్స్‌తో ఆడుతోంది’’ అని ప్రముఖ దర్శకుడు, ఎగ్జిబిటర్ వి.వి. వినాయక్ చెప్పారు. ‘‘ఫ్యామిలీ డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ల వల్లే ఈ సినిమా బాగా ఆడుతోంది. మేము పడిన కష్టానికి నిదర్శనంగా ఏ రోజుకారోజు సినిమా కలెక్షన్లు పెరుగుతూ వెళుతున్నాయి. ఈ సక్సెస్‌ను ఎవరూ ఆపలేరు’’ అని దర్శకుడు గోపీచంద్ మలినేని వ్యాఖ్యానించారు.
 
  ‘‘మేము చాలా రొటీన్ కథను రొటీన్‌గా తీస్తే, ఆడియన్స్‌ను కూడా రొటీన్‌గా చూసి, రొటీన్‌గా హాలులో పగలబడి నవ్వడం వల్ల, రొటీన్‌గానే హీరో, హీరోయిన్లు, ‘మిర్చి’ సంపత్ సీన్లు పండించడం వల్ల ఈ సినిమా రొటీన్‌గానే హిట్టయింది’’ అంటూ చిత్ర రచయితల్లో ఒకరైన కోన వెంకట్ వ్యంగ్యంగా మాట్లాడారు. మొత్తానికి, సినిమాలో బూతు ఎక్కువగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తినా, జనం మాత్రం అవేమీ పట్టించుకోకుండా ‘పండగ చేస్కో’ను ఆదరిస్తుండడం విశేషమే. మరి, ఇందులో తప్పెవరిది? జనం నాడి అందుకోలేకపోతున్న విమర్శకులదా? కాసేపు నవ్వుకుంటే చాలు... మిగతావన్నీ ఎందుకంటున్న ప్రేక్షకులదా? ఆలోచించాల్సిన విషయమే!
 

Advertisement
Advertisement