బస్తాలు మోశా... | Sakshi
Sakshi News home page

బస్తాలు మోశా...

Published Fri, May 13 2016 12:02 AM

బస్తాలు మోశా... - Sakshi

- విశాల్
 ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా హరి నాకు చాలాకాలంగా తెలుసు. తొలిసారి ‘రాయుడు’ చిత్రంతో నిర్మాతగా మారాడు. ఈ సినిమా విజయం సాధించి తనకు కాసుల వర్షం కురవాలి. విశాల్ గత చిత్రాలు మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఈ చిత్రం కూడా భారీ విజయం సాధించాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ పేర్కొన్నారు. విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘రాయుడు’. హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.
 
 డి.ఇమాన్ స్వరపరచిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వినాయక్ బిగ్ సీడీ లాంచ్ చేయగా, పాటల సీడీని హీరో రానా విడుదల చేసి, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌కి అందించారు. దర్శకుడు విక్రమ్ కుమార్ ట్రైలర్ ఆవిష్కరించారు. విశాల్ మాట్లాడుతూ- ‘‘హీరోలకు మంచి మాస్ ఇమేజ్‌ను వినాయక్‌గారే తీసుకురాగలరు. ఆయన సినిమాలంటే నాకు, ముత్తయ్యకు ఇష్టం. ‘రాయుడు’లో బస్తాలు మోసే పాత్ర చేశా.
 
 ఈ సినిమాలో అనంతపురం యాసలో మాట్లాడతా. తెలుగు ప్రేక్షకుల మధ్య కూడా నేను హీరోగా నిలదొక్కుకోవాలన్నది మా నాన్నగారి కల. ‘పందెం కోడి’  చిత్రంతో ఆ కల నెరవేరింది. మంచి, చెడులో నాకెప్పుడూ తోడుండే వ్యక్తి రానా. చెన్నై వర్షాలప్పుడు, స్టార్ క్రికెట్ ఆడినప్పుడు రానా చేసిన సాయం మరువలేను’’ అని చెప్పారు. ‘‘వినాయక్, సుకుమార్, రాజమౌళిగారి సినిమాలు మిస్ కాకుండా చూస్తుంటా. చెన్నైలో రిలీజయ్యే ప్రతి తెలుగు సినిమా చూస్తా.
 
  తప్పకుండా ‘రాయుడు’ చిత్రం తెలుగువారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని ముత్తయ్య అన్నారు. ‘‘విశాల్ నాకు మంచి మిత్రుడు. తెలుగువాడైనా తమిళంలో పెద్ద హీరో అయ్యాడు. ఈ  చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అని రానా అన్నారు. చిత్ర నిర్మాత హరి, కథానాయిక శ్రీదివ్య, నిర్మాతలు ‘దిల్’ రాజు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డీవీవీ దానయ్య, దర్శకులు దశరథ్, గోపీచంద్ మలినేని, విశాల్ తండ్రి జీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement