.కేసీఆర్‌గారూ... ఓ విజ్ఞప్తి | Sakshi
Sakshi News home page

.కేసీఆర్‌గారూ... ఓ విజ్ఞప్తి

Published Tue, Jun 27 2017 11:48 PM

.కేసీఆర్‌గారూ... ఓ విజ్ఞప్తి

‘‘సినిమా థియేటర్లలో టికెట్‌ రేట్లు పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు సగటు ప్రేక్షకుడికి వినోదం (సినిమా) దూరమైపోతుంది’’ అని నటుడు–దర్శక–నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23న సినిమా టికెట్‌ రేట్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీని వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం చేకూరుతుందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘భారతీయుల జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి థియేటర్లో 60 శాతం నేల–బెంచీలు, 40 శాతం కుర్చీలు ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వాలు నిర్ణయించాయి.

ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. థియేటర్లలో 90 శాతం కుర్చీలు ఉంటే... నేల–బెంచీలు 10 శాతం మాత్రమే ఉంటున్నాయి. కొన్ని థియేటర్లలో ఆ 10 శాతం కూడా కనిపించడం లేదు. రెండు మూడు లైన్లు ఉంటున్నాయంతే. దీని వల్ల సగటు ప్రేక్షకుడు, పేద–మధ్య తరగతి ప్రజలు ఆత్మనూన్యతకు లోనయి అప్పో సొప్పో చేసి అప్పర్‌ క్లాస్‌కి వెళ్తున్నారు.ఇప్పుడు టికెట్‌ రేట్లు పెంచడం వల్ల వాళ్లంతా థియేటర్లకు రావడం మానేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎగ్జిబిటర్లు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. ఆల్రెడీ స్టార్‌ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ఫ్లాట్‌ రేటుకు టికెట్లను అమ్ముతున్నారు.

ఇప్పుడు జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) సాకు చూపిస్తూ, టికెట్‌ రేట్లు పెంచితే సగటు ప్రేక్షకుడి పరిస్థితి ఏంటి? కనీసం చిన్న సినిమాకు అయినా రాగలడా? మంచి సినిమా అని టాక్‌ వచ్చి, ప్రేక్షకుడు చూడాలనుకునే లోపే  సినిమాను థియేటర్ల నుంచి తీసేస్తారు. దీని వల్ల ప్రేక్షకుడికి వినోదం దూరమవుతుంది. అయినా... రూ. 100 పై ఉన్నవాటికే పెంచమన్నది ఆదేశం కదా. అలాంటప్పుడు నగర పరిధి (మున్సిపాలిటీ, పంచాయతీ) లోకి రాని థియేటర్లలో రూ. 100లోపు ఉన్న బాల్కనీ టికెట్‌ రేటును పెంచడం ఎంతవరకు సమంజసం? అందువల్ల, టికెట్‌ రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాల్సిందిగా గౌరవనీయులైన తెలంగాణ సీయం కేసీఆర్‌గారికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement