రెండు ఖండాల్లో ప్రేమకథ | Sakshi
Sakshi News home page

రెండు ఖండాల్లో ప్రేమకథ

Published Mon, Mar 31 2014 11:22 PM

రెండు  ఖండాల్లో ప్రేమకథ

 ‘‘ప్రతిష్ఠాత్మకంగా నేను చేసిన ‘ఒక్క మగాడు’, ‘సలీం’ సినిమాలు అపజయం పాలైనపుడు నా బాధ వర్ణనాతీతం. మా నాన్న, అన్నయ్య చనిపోయినప్పుడు కూడా నేనంత బాధ పడలేదు’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు దర్శక - నిర్మాత వైవీఎస్ చౌదరి. సాయిధరమ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రేయ్’. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వైవీఎస్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించిన సినిమా ‘రేయ్’ అని, కానీ.. కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచీ ఈ సినిమాకు అవాంతరాలేనని, విడుదలకు కూడా అలాంటి అవాంతరాలే తలెత్తుతున్నాయని, మొక్కవోని ధైర్యంతో ముందుకెళుతున్నానని వైవీఎస్ చెప్పారు. 
 
 ‘రేయ్’ గురించి ఇంకా చెబుతూ -‘‘రెండు ఖండాల నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకే అమెరికా, వెస్టిండీసుల్లో భారీ షెడ్యూల్ చేశాం. ఎఫ్‌డీసీ నిబంధనల మేరకు కొన్ని సన్నివేశాలు ఇక్కడే తీయాల్సి వచ్చింది. అందుకే అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ... ఇక్కడే కొన్ని సన్నివేశాలు తీశాను. దానికి అదనంగా భారీ ఖర్చయింది. అరుంధతి, మగధీర చిత్రాల తర్వాత ఆ స్థాయి గ్రాఫిక్స్‌తో తెరకెక్కిన సినిమా ఇది. మెగా కుటుంబం నాపై పెట్టిన నమ్మకాన్ని వందకు వంద శాతం నిలబెడుతుందీ సినిమా’’ అని విశ్వాసం వెలిబుచ్చారు వైవీఎస్.
 

Advertisement
Advertisement