తొలి చిత్రంతోనే సన్నిహితుడయ్యాడు | Sakshi
Sakshi News home page

తొలి చిత్రంతోనే సన్నిహితుడయ్యాడు

Published Sat, Sep 24 2016 2:21 AM

తొలి చిత్రంతోనే సన్నిహితుడయ్యాడు

తెలుగులో తొలి చిత్రంతోనే చైతూ నాకు సన్నిహితుడయ్యాడని నటి సమంత అన్నారు. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ఈ చెన్నై చంద్రం పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. వీరి మధ్య చాలా కాలంగా రహస్యంగా సాగుతున్న ప్రేమ వ్యవహారం ఇటీవలే బహిరంగమైంది. దీని గురించి తాజాగా సమంత చెప్పిన సమాచారం ఏమిటో చూద్దాం.   ‘నా ప్రేమ వ్యవహారం గురించి దాచాల్సిన అవసరం లేదు. నా తొలి తెలుగు చిత్రం నుంచే చైతూ(నాగచైతన్య) సన్నిహితుడయ్యాడు. మూడు నెలల క్రితమే మా ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసింది.
 
  ఇరు కుటుంబ పెద్దల ఆశీస్సులు మాకు లభించాయి. మంచి ముహూర్తం చూసి పెళ్లి ఎప్పుడన్నది పెద్దలే వెల్లడిస్తారు. అందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఈ ఏడాదే పెళ్లి అనే ప్రచారంలో నిజం లేదు. ఎనిమిదేళ్లుగా నటిగా కొనసాగుతున్నాను.సినిమాకు దూరం అవ్వాలన్న అంశం గురించి ఆలోచనే లేదు. చైతూ కూడా నేను నటనను కొనసాగించాలని కోరుకుంటున్నారు. సినిమాను ప్రేమించే కుటుంబంతో జీవితాన్ని పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వివాహానంతరం నటిగా నన్ను అభిమానులు ఎలా ఆదరిస్తారో అన్న భయం లేకపోలేదు.
 
 అయినా వారు వద్దనే వరకూ నటిస్తూనే ఉంటాను. ఇక చైతూలో మీకు నచ్చిన అంశం ఏమిటని అడుగుతున్నారు. తనలో నాకు నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. అయోమయంలో ఉన్న నా జీవితాన్ని సుస్థిరత కల్పించారు. పడవకు తెడ్డు ఎంత ముఖ్యమో అలా నాకు చైతూ’ అని సమంత అన్నారు. సమంత, నాగచైతన్యల పెళ్లి వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనుందని సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement