సంజీవ్ కుమార్ - ది బెస్ట్ | Sakshi
Sakshi News home page

సంజీవ్ కుమార్ - ది బెస్ట్

Published Wed, Nov 5 2014 11:43 PM

సంజీవ్ కుమార్ - ది బెస్ట్ - Sakshi

  నేడు సంజీవ్ కుమార్ వర్థంతి
 తమిళంలో ఒక సినిమా వచ్చింది. తొమ్మిది పాత్రలట. ఒకే నటుడు వేశాడట. అదరగొట్టేశాడట.
 ఎవరు... ఎవరు..?
 ఇంకెవరు. శివాజీ గణేశన్. సినిమా- నవరాత్రి.
 తెలుగులో దీనికి సరిజోడు. అంతకు తగ్గవాడు కావాలి.
 ఎవరు... ఎవరు..?
 ఇంకెవరు. అక్కినేని నాగేశ్వరరావు.
 శభాష్.
 ఈ స్థాయిలో హిందీలో కూడా అదరగొడదాం. శివాజీ గణేశన్‌కూ, అక్కినేనికీ సరిసాటి రాగల నటుడు ఎవరు?
 రాజ్ కపూర్? ఊహూ. దిలీప్ కుమార్. ఊహూ. అమితాబ్ బచ్చన్. ఊహుహూ.
 సంజీవ్ కుమార్.
 అరె. చంకలో మేకపిల్లను - కాదు పులిపిల్లను పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నామే.
 
 సంజీవ్ కుమార్. ది బెస్ట్.

 సినిమా అంటే? కొన్ని పాత్రల మధ్య నడిచే కథ. పాత్రలు అంటే హీరోది ఒక పాత్ర. విలన్‌ది ఒక పాత్ర. కేరెక్టర్ ఆర్టిస్టుది ఒక పాత్ర. అదేమిటి? కేరెక్టర్ ఆర్టిస్టు వేరా? మరి హీరో క్యారెక్టర్ ఆర్టిస్టు కాడా? అయితే ఇంకేం. కాని దురదృష్టం. హీరోలందరూ సినిమాలో హీరోలుగానే కనపడతారు. ఏ పాత్ర వేసినా తమలాగే కనిపిస్తారు. పాత్ర కంటే పెద్దగా. పాత్రను మింగేసేంత పెద్దగా. కాని సంజీవ్ కుమార్ అలా కాదు. ఎప్పుడూ పాత్రే. హీరో వేసినా పాత్రే. క్యారెక్టర్ వేసినా పాత్రే. నటుడనేవాడికి చిన్న సూత్రం తెలియాలి. అదీ- తాను పాత్రను ధరించాలిగాని పాత్ర తనను ధరించకూడదనే సూత్రం.
 
 సంజీవ్ కుమార్, అసలు పేరు వికిపిడియాలో ఉంటుంది, ఆ గోల మనకెందుకు,     తన ఇరవై ఏళ్ల వయసు నుంచే అరవై ఏళ్ల వయసు పాత్రలతో నాటకాల్లో పడ్డాడు. తొలి నాటకంలో అతడి సరసన భార్యగా నటించింది ఎవరో తెలుసా? షబానా ఆజ్మీ తల్లి షౌకత్ ఆజ్మీ. ఇంకో నాటకంలో బిడ్డల తండ్రిగా మేకప్ వేసుకుంటే లీలా చిట్నీస్ వచ్చి ‘ఏమండీ’ అని పిలిచే వేషానికి అంగీకరించింది. సంజీవ్ కుమార్‌కు వేరే దారి లేదు. చాలా నిరుపేద గుజరాతీ కుటుంబం. ఒకరి నెత్తి మీద మరొకరు నిద్రపోయేంత చిన్న గదిలో నివాసం. చిల్లి గవ్వ లేదు. చదువు మీద పెద్ద శ్రద్ధ లేదు. నాటకాల్లో పనికొస్తాననే నమ్మకం. సినిమాల్లో గెలుస్తాననే విశ్వాసం. చూసుకుందాం.
 
 ఒకటి రెండు ప్రయత్నాలు జరిగాయి. మన తెలుగుపెద్ద ఎల్.వి.ప్రసాద్- ఈ కుర్రాడిలో కళ ఉంది అని గ్రహించి 1970లో ‘ఖిలోనా’లో లీడ్ రోల్ ఇచ్చారు. పరాయివాణ్ణి పెళ్లాడిన ప్రియురాలు పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకుంటే అది చూసి పిచ్చివాడయ్యే భావుకుని పాత్ర అది. సినిమా అంతా నిలబెట్టాలి. నిలబెట్టాడు. తాను నిలబడ్డాడు.     ఆ వరుసలో ‘సీతా ఔర్ గీతా’, ‘మన్‌చలీ’ వచ్చినా ఆ టైమ్‌లోనే గుల్జార్ డెరైక్టర్‌గా మారి కాసింత బుద్ధీ జ్ఞానం ఉన్న సినిమాలు ట్రై చేద్దామని సంజీవ్ కుమార్ లీడ్ రోల్‌లో ‘కోషిష్’ తీశాడు. లీడ్‌రోల్ అంటే మాటలు మాట్లాడాలి. పాటలు గొంతెత్తి పాడాలి.

ఈ రెండూ లేవు. ఎందుకంటే అది మూగ, చెవిటి పాత్ర. కళ్లు, కనుబొమలు, నుదురు, పెదాలు, కాళ్లు, చేతులు... ఇవి యాక్ట్ చేయాలి. ఆ పని సంజీవ్ కుమార్‌కు వచ్చు. ఆ సినిమాలో క్లయిమాక్స్ ఎవరికైనా గుర్తుందో లేదో. దారి తప్పిన కొడుక్కి తండ్రి బుద్ధి చెప్పే పెద్ద సీన్. కాని మాటల్లేవు. అంతా అభినయించి ప్రేక్షకులకు కన్వే చేయాలి. ఆ సీన్‌ను కన్సీవ్ చేసిన గుల్జార్‌కు టెన్షన్ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది సంజీవ్ కుమార్.సూర్యుడు ఇవాళ వెలుగిచ్చాడు.. రేపు వెలుగిచ్చాడు... ఎల్లుండి వెలుగిచ్చాడు... ఎన్నిసార్లు చెబుతాం? అది అతడి పని. ఇంకోటి చేత కాదు. సంజీవ్ కుమార్ కూడా అంతే. దస్తక్, అనామికా, నయా దిన్ నయీ రాత్, ఆంధీ, మౌసమ్.... అన్నింటా అన్ని సందర్భాల్లోనూ ది బెస్ట్.
 
 అప్పుడే ఒకటి సంభవించింది. అలాంటిది మళ్లీ సంభవించలేదు. షోలే. 36 ఎం.ఎం. రోజులు పోయాయి. 70 ఎం.ఎం స్థాయికి నటించాలి. ఆ పెద్ద తెర మీద పెద్ద నటన పండించాలి. ధరమ్ పాజీ, బచ్చన్‌జీ సరే. కొత్త కుర్రాడు అంజద్‌ఖాన్ గబ్బర్‌సింగ్ వేషానికట. వీరందరినీ ఒక సూత్రంలో నడిపించే పెద్ద తల కావాలి. చిన్న కనుసైగతో వీరిని కంట్రోల్ చేయాలి. సంజీవ్ కుమార్ తప్ప వేరే చాయిస్ లేదు. ఠాకూర్ బల్దేవ్ సింగ్. ‘ఏ హాత్ నహీ ఫాంసీకే పంథే హై గబ్బర్’.... ‘లోహాగరమ్ హై మార్‌దో హతోడా’... ఆ నడక... ఆ గాంభీర్యం... మెత్తదనం అంతా దాచుకుని కఠినంగా మారినట్టుగా ఆ కంఠం... హీరోలను సవాలు చేసిన పాత్ర అది.
 
  క్యారెక్టర్. అది చేయగలిగినవాడు మొదట ఆర్టిస్ట్. తర్వాత కేరెక్టర్ ఆర్టిస్ట్.
 సంజీవ్ కుమార్ చాలా వెలగాల్సింది. అతడికి ప్రత్యేకమైన అభిమానులున్నారు. చదువుకున్నవాళ్లు. ‘టేస్ట్’ ఉన్నవాళ్లు. అతడు సినిమాలు చేస్తూ ఉంటే చూస్తూ పోయేవాళ్లు. కాని ఆ జర్నీ ఆగిపోయింది. వాళ్ల ఇంట గుండె జబ్బుల అనువంశికత ఉంది. ఎవరూ యాభైకి మించి బతకరు. ముగ్గురన్నదమ్ములు వాళ్లు. ఆరు నెలల తేడాతో ముగ్గురూ పోయారు. త్రిశూల్, సిల్‌సిలా, అంగూర్, పతీ పత్నీ ఔర్ ఓ... లాంటి సినిమాలు చేసిన సంజీవ్ కుమార్, లండన్‌లో బైపాస్ సర్జరీ చేసుకొని, గట్టిగా బతుకుతానని నమ్మి, దానిని ఒమ్ము చేసి పోయాడు. 47 ఏళ్లు. ఏం పెద్ద వయసు కనుక. జీవితాంతం ముసలాళ్ల వేషం కట్టాడే! ముసలాడయ్యేంత వరకూ బతికుంటే దేవుడు బతికించి ఉంటే ఎంత బాగుండేది. ఊహూ. కుళ్లు. అలాంటి బెస్ట్ యాక్టర్ తన దర్బార్‌కు కావద్దూ.
 
 పెళ్లి చేసుకోకుండా బేచిలర్‌గా మిగిలిన సంజీవ్ కుమార్‌కు తెర మీద స్త్రీలతో సుందరమైన సహచర్యం ఉంది. పాటల వైభోగం ఉంది. అలాంటిది మరొకరికి లేదు. ‘ఖుష్ రహే తూ సదా’ (ఖిలోనా), ‘మేరీ భీగీ భీగీ సీ’ (అనామిక), ‘హవా కే సాత్ సాత్’ (సీతా ఔర్ గీతా), ‘దిల్ ఢూండ్‌తా హై ఫిర్ వహీ’ (మౌసమ్), ‘తేరే బినా జిందగీ సే కోయీ’ (ఆంధీ).... బోలెడన్నీ.
 ఒక సున్నితమైన వీచిక భారతీయ వెండితెర మీద అలా వీచి ఇలా మాయమైంది.
 రెప్పపాటు సమయమే.
 కాని- ఆ స్పర్శ ఆయుష్షు ఒక జీవిత కాలం.
 

Advertisement
Advertisement