వెండితెరపై... మన్మోహన్ సింగ్ పాలన! | Sakshi
Sakshi News home page

వెండితెరపై... మన్మోహన్ సింగ్ పాలన!

Published Wed, Jul 22 2015 11:23 PM

వెండితెరపై... మన్మోహన్ సింగ్ పాలన!

పుస్తకం రైట్స్ కొన్న నిర్మాత మరణించిన ప్రముఖులతో పాటు సజీవంగా ఉన్న ప్రముఖుల మీద కూడా జీవితకథా చిత్రాలు తీయడం ఇటీవల హిందీ చిత్రసీమలో బాగా పెరిగింది. ఆ ప్రముఖుల జాబితాలో ఇప్పుడు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరు కూడా వచ్చి చేరింది. ప్రపంచం మెచ్చిన ఈ ఆర్థికవేత్త రాజకీయ జీవితంపై ప్రముఖ నిర్మాత సునీల్ బోహ్రా ఒక సినిమా తీయనున్నారు. మన్మోహన్ సింగ్ పదవిలో ఉన్నప్పుడు ఆయనకు మీడియా సలహాదారుగా వ్యవహరించిన ప్రముఖ జర్నలిస్టు సంజయ్ బారు రాసిన పుస్తకం ఈ చిత్రానికి ఆధారం. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్ - ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ అనే ఈ రచన గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్కెట్‌లోకి వచ్చి, సంచలనం రేపింది.

ఇప్పుడీ పుస్తకం హక్కుల్ని సునీల్ పొందారు. గమ్మత్తేమిటంటే, రాజకీయంగా ఎంతో కీలకమైన గడచిన దశాబ్ద కాలం గురించి వస్తున్న ఈ సినిమాను పూర్తిగా రాజకీయేతరంగా ఉండేలా తీయాలని భావించడం! గతంలో ‘చిట్టగాంగ్’, ‘షాహిద్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’ లాంటి పలు చిత్రాలు అందించిన బోహ్రా బ్రదర్స్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సునీల్ బోహ్రా మాట్లాడుతూ, ‘‘ఇదేదో రాజకీయ అజెండాతో తీస్తున్న సినిమా కాదు. సంజయ్ బారు తన పుస్తకంలో ఏం రాశారో, సరిగ్గా అదే సినిమాలో చూపెడతాం’’ అన్నారు. ‘‘2004 నుంచి 2014 దాకా గడచిన పదేళ్ళు రాజకీయ చరిత్రనూ, దేశంలోనే పురాతన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ భవితవ్యాన్నీ మార్చేశాయి. ఆ పదేళ్ళ కాలాన్ని ప్రతిబింబించేలా సినిమా తీయాలన్నది నా ఉద్దేశం’’ అని ఆయన చెప్పారు.

రానున్న ఎన్నికల ముందు... సినిమా
పాలనా కాలంలో క్యాబినెట్ సహచరులపై మన్మోహన్‌కు కానీ, ప్రధానమంత్రి కార్యాలయానికి కానీ నియంత్రణ ఉండేది కాదంటూ సంజయ్ బారు తన రచనలో పేర్కొన్నారు. ఈ అంశాలన్నిటినీ తెర మీద కెక్కిస్తే, అత్యంత నాటకీయంగా ఉంటుందంటూ రచయితను సునీల్ సంప్రతించారు. సంజయ్ బారు కూడా సరేనన్నారు. దేశంలోని బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ పుస్తకంలో లేనిదేదీ స్క్రిప్టులో చేర్చబోమంటూ ముందుగానే ఒప్పందం రాసుకున్నారు.

కాగా, ఇప్పుడీ తీయబోయే చిత్రం 2018 చివరకు రిలీజవుతుందని భావిస్తున్నారు. అంటే, 2019లో ఓటర్ల తీర్పు కోరుతూ మోదీ మళ్ళీ జనం ముందుకు వెళ్ళడానికి కొద్దిగా ముందు ఈ సినిమా వస్తుందన్న మాట. డాక్యుమెంటరీ లాగా కాకుండా ఫీచర్‌ఫిల్మ్‌గా దీన్ని తీస్తానంటున్న నిర్మాత అంతకు మించి వివరాలు చెప్పడానికి ఇష్టపడడం లేదు. ప్రీప్రొడక్షన్ ప్రారంభించామన్న ఆయన వివిధ పాత్రలను పోషించడానికి నటీనటుల కోసం ఆన్‌లైన్‌లో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. మన మధ్య ఉన్న నిజజీవిత వ్యక్తుల పాత్రలను ఎవరు పోషిస్తారో కానీ, ఎవరు చేసినా అది సంచలనమే! ఏమైనా, ఏదో సామెత చెప్పినట్లు... రాసేవాళ్ళు ఒకందుకు రాస్తే, తీసేవాళ్ళు ఒకందుకు తీయడమంటే ఇదేనేమో!
 

Advertisement
Advertisement