సంగీత్ సప్నోంకీ రాజా! | Sakshi
Sakshi News home page

సంగీత్ సప్నోంకీ రాజా!

Published Wed, Oct 1 2014 12:09 AM

సంగీత్  సప్నోంకీ రాజా!

  సందర్భం  ఎస్.డి. బర్మన్ జయంతి
 మనసును వెంటాడే పాట... జ్ఞాపకాలను మోసుకొచ్చే పాట... పరిమళాలను వెదజల్లే పాట... కలల్నిండా వెన్నెల నింపే పాట... అవును... ఆ ఇంద్రజాలమంతా ఎస్.డి. బర్మన్‌దే! ఎన్ని పాటలు... ఎన్నెన్ని స్వరాలు... ఎన్ని మలుపులు... ఎన్నెన్ని మెరుపులు...
 
 ‘గాతా రహే మేరా దిల్’ (గైడ్)... ‘ఖోయా ఖోయా చాంద్ ఖులా ఆస్‌మాన్’ (కాలాబజార్)... ‘మేరే సప్నోంకీ రాణీ’ (ఆరాధన)...     ఇవాల్టికీ రికార్డులే రికార్డులు. పాటలు వింటూ కలలు కనాలనిపిస్తుంది. ఆ స్వప్న లోకంలో తేలియాడుతూ బర్మన్ పాటను తోడు తీసుకెళ్లాలనిపిస్తుంది.
 
 పాట కూడా కల కంటే... ‘కుఛ్ షక్ నహీ’... అది కచ్చితంగా ఎస్.డి. బర్మనే!
 
  ఎస్.డి. బర్మన్ పుట్టింది ఇప్పుడు బంగ్లాదేశ్‌లో భాగమైన కొమిల్లాలో. వాళ్లది త్రిపుర రాజకుటుంబం. ఆయన తండ్రి నవద్వీప్‌చంద్ర దేవ్ బర్మన్ స్వతహాగా సితార్ వాద్య నిపుణుడు, ద్రుపద్ గాయకుడు. అయిదుగురు అన్నదమ్ముల్లో ఆఖరైన ఎస్.డి, తండ్రి వద్దే సంగీత శిక్షణ పొందారు.
 
  ఎస్.డి.కి గురువుల్లో ఒకరు అంధుడైన గాయకుడు - కృష్ణ చంద్ర డే. ఈ కృష్ణ చంద్ర వేరెవరో కాదు, మరో దిగ్గజం మన్నాడేకు స్వయానా అంకుల్.
 
  1930లలోనే కలకత్తా రేడియో స్టేషన్‌లో పాడడం మొదలు పెట్టిన ఎస్.డి. బర్మన్ అప్పట్లో బెంగాలీ, త్రిపురీ జానపద సంగీతానికి పెట్టింది పేరు.
  ప్రసిద్ధ బెంగాల్ కవి, స్వరకర్త కాజీ నజ్రుల్ ఇస్లాఅప్పట్లో ఎస్.డి. వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు గడిపారట. ఆయన పాటే ఎస్.డి. ఇచ్చిన తొలి రికార్‌‌డ.
 
ఎస్.డి. మొదట సినిమాల్లోకి వచ్చింది సంగీత దర్శకుడిగా కాదు.. గాయకుడిగా! ‘యహూదీ కీ లడ్కీ’ (’33) చిత్రంతో! పంకజ్ మల్లిక్‌కు ఆయన పాట పాడారు కానీ, చివరి క్షణంలో అది తీసేసి, నిన్నటి తరం సంగీత దిగ్గజం పహాడీ సన్యాల్‌తో పాడించారు. ‘సంజ్‌బేర్ పిడివ్‌ు’ (’35)తో తొలి సారిగా సినీ గాయకుడిగా గొంతు వినిపించారు.

 మన హైదరాబాద్‌లో మూకీలు తీసిన బెంగాలీయుడు ధీరేన్ గంగూలీ తీసిన టాకీ ‘విద్రోహి’ (’35)లో ఎస్.డి.
 నటించారు కూడా!
 
 బెంగాలీ రంగస్థలంలో కొన్నాళ్ళు కృషి చేసి, 1930ల చివర నుంచి సినీ సంగీత దర్శకత్వం వహిస్తూ వచ్చిన ఎస్.డి.బర్మన్ ’40ల తొలిరోజుల్లో బొంబాయి వచ్చారు. అదీ గాయకుడిగా! ఆ తర్వాత హిందీలో సంగీత దర్శకుడయ్యారు.
 
ఇవాళ సినీ సంగీత దిగ్గజంగా అందరూ చెప్పుకొనే ఎస్.డి. 1951లో ఒక సందర్భంలో బాలీవుడ్‌పై భ్రమలు తొలగిపోయి, బొంబాయి వదిలివెళ్ళి పోయారట. ఆ తరువాత కొన్నాళ్ళకు తిరిగొచ్చి, హిందీసీమలో స్థిరపడ్డారు.

ఆనాటి ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థలైన ఫిల్మిస్తాన్, నవ్‌కేతన్‌లకు సంగీతం అందించారు. గురుదత్ (‘బాజీ’, ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’) చిత్రాలకు ఎస్.డి. సంగీతం పెద్ద బలం. బిమల్ రాయ్ (‘దేవదాస్’, ‘సుజాత’, ‘బందిని’) చిత్రాలను చిరస్మరణీయం చేసిన ఘనతలో ఆయన బాణీలకు భాగం ఉంది. ఇక, దేవానంద్ చిత్రాలకైతే (‘పేయింగ్ గెస్ట్’, ‘జ్యువెల్ థీఫ్’, ‘ప్రేవ్‌ు పూజారి’, వగైరా) ఎన్నో ఏళ్ళ పాటు కీలకం ఎస్.డి. సంగీతమే!

ఎస్.డి. బర్మన్ సినీ బాణీలపై ఈశాన్య భారతానికి చెందిన బెంగాలీ భటియాలీ, శారీ, ధమైల్ సంప్రదాయపు జానపద సంగీత ప్రభావమెక్కువ. గొంతు సన్నమైనా, బలంగా వినిపించే ఆయన కంఠంలోని పాటలు భావోద్వేగభరితమైన విలక్షణ సందర్భాలకు అచ్చంగా అతికినట్లుండేవి.
 
  గాయకుల గొంతు ఎలా ఉందో తెలుసుకొని గానీ, పాట రికార్‌‌డ చేసేవారు కాదు ఎస్.డి. బర్మన్. దానికి ఆయనకో విలక్షణ పద్ధతి ఉండేది. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేసి వస్తూనే, గాయకులకు ఫోన్ చేసేవారు. ఫోన్‌లో వారి మాట విని, గొంతెలా ఉందో గ్రహించి రికార్డింగ్ పెట్టేవారు.
 
  ఒక హీరోకు ఒకే గాయకుడితో పాడించే పద్ధతిని నిరసిస్తూ, పాట తీరు, సందర్భాన్ని బట్టి ఒకే సినిమాలో ఒక హీరోకు వేర్వేరు గాయకులతో పాడించడం ఆ రోజుల్లో ఎస్.డి. చేసిన విప్లవం. అన్నట్లు, ఆయన తన ఆత్మకథ కూడా రాసుకున్నారు. దాని పేరు - ‘సంగమేర్ నిఖద్’.
 
  కాస్తంత సేద తీరాలంటే  ఎస్.డి. బర్మన్ బొంబాయిలో ఒక చెరువు దగ్గరకు వెళ్ళి, రోజంతా చేపల వేటలో గడిపేవారట!
 
మౌత్ ఆర్గాన్ వాయించడంలో తప్ప, చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టని కుమారుడు ఆర్.డి. బర్మన్‌ను చిన్నతనంలోనే సంగీతం వైపు ప్రోత్సహిం చారాయన. తండ్రి బాటలోనే సినీ సంగీతంలోకి వచ్చిన ఆర్.డి. ఆయనకు చేదోడు వాదోడయ్యారు. తరువాతి కాలంలో తండ్రిని మించిన సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
 
ఒకరోజు మార్నింగ్ వాక్‌లో ఎస్.డి. బర్మన్‌ను చూసిన ఒకాయన తన పక్క వ్యక్తితో ‘ఆయన ఎవరనుకున్నావ్? ఆర్.డి. బర్మన్ తండ్రి’ అన్నారు. అది విన్న ఎస్.డి ఇంటికొచ్చి కొడుకుని కౌగలించుకొని, సంబరపడ్డారట!
 

Advertisement

తప్పక చదవండి

Advertisement