టాలీవుడ్ లో రౌడీయిజం నడుస్తోంది: దాసరి | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ లో రౌడీయిజం నడుస్తోంది: దాసరి

Published Tue, Oct 21 2014 1:16 AM

టాలీవుడ్ లో రౌడీయిజం నడుస్తోంది: దాసరి - Sakshi

 ‘‘ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న నీచమైన పరిస్థితిని మునుపెన్నడూ నేను చూడలేదు’’ అని దర్శక - నిర్మాత డా. దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. నాగశౌర్య, అవికా గోర్ జంటగా రూపొందిన  ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రం ఆడియో ఆవిష్కరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నంద్యాల రవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం చిత్రపరిశ్రమలో రౌడీయిజం నడుస్తోంది. పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేస్తున్నారు.
 
  ఆ మధ్య విడుదలైన ‘లౌక్యం’ సినిమా అద్భుతమైన వసూళ్ల రాబడుతూ, ముందుకెళుతున్న సమయంలో ఓ పెద్ద హీరో కోసం ఐదో రోజున 37 సెంటర్లలో ఆ సినిమా తీసేశారు. కానీ, ఆ హీరో సినిమా మూడు రోజులు కూడా ఆడలేదు. దాంతో మళ్లీ ‘లౌక్యం’ చిత్రాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు’’ అన్నారు. సినిమా పరిశ్రమకు వారసులే కాదు ఎవరైనా రావొచ్చని దాసరి అన్నారు. ‘‘వారసులు రావడం తప్పు కాదు. కానీ, సినిమా మీద సినిమా  తీసి వాళ్లను జనాల మీద రుద్దడం తప్పు. ‘అసలు ప్రస్తుతం పరిశ్రమ ఉన్న పరిస్థితుల్లో సినిమా తీయడం గొప్ప కాదు. థియేటర్లు దక్కించుకోవడం ముఖ్యం’’ అని దాసరి పేర్కొన్నారు. ఈ వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు కేఎం. రాధాకృష్ణన్, దర్శకుడు నంద్యాల రవి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement