సోనూసూద్‌.. నువ్వు రియల్‌ హీరో’ | Sakshi
Sakshi News home page

నీ వీరోచిత ప్రయత్నానికి బిగ్‌ సెల్యూట్‌: ధావన్‌‘

Published Tue, May 26 2020 11:34 AM

Shikhar Dhawan salute Sonu Sood For Heroic Efforts - Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా అర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు ఓ వైపు అయితే వలస జీవుల దుర్భర పరిస్థితి మరోవైపు. కొన్ని లక్షల వలస కార్మికుల జీవితాలను లాక్‌డౌన్‌ చిన్నాబిన్నం చేసింది. పనులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఇంటి బాట పడుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సొంతింటికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులను తరిలించేందుకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ అండగా నిలుస్తున్నారు. ముంబైలో చిక్కుకున్న వేరే రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల కోసం సొంత ఖర్చుతో బస్సులు ఏర్పాటు చేసి వారిని తరలిస్తున్నారు. ('సోనూసూద్‌ మీ సేవలకు గర్వపడుతున్నాం')


మహరాష్ట్ర నుంచి కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, కేరళ వంటి రాష్ట్రాలకు వేల సంఖ్యలో కార్మికులను తమ సొంత ఊరికి చేరుస్తూ రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో అభిమానుల నుంచి ప్రముఖుల వరకు సోనూసూద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి సృతి ఇరానీ ఈ బాలీవుడ్‌ విలన్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. తాజాగా భారత క్రికెట్‌ ఆటగాడు శిఖర్‌ధావన్‌ సోనూసూద్‌ సేవలను కొనియాడారు. ట్విటర్ వేదికగా ధావన్‌.. సోనూసూద్‌ చేస్తున్న సేవలకు సెల్యూట్‌ చేశారు. ‘ఇతర రాష్ట్రాల్లో ఒంటరిగా ఉన్న వలస కార్మికులను వారి ఇళ్లకు చేర్చడంలో నువ్వు చేస్తున్న వీరోచిత ప్రయత్నానికి నా బిగ్‌ సెల్యూట్’‌  అంటూ ట్వీట్‌ చేశారు. ఇక ధావన్‌ ట్వీట్‌పై స్పందించిన సోనూసూద్‌‌.. శిఖర్‌ ధావన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (వలస కార్మికుల కోసం సోనూసూద్.. హ్యాట్సాఫ్‌)

వలస జీవుల కోసం నూసూద్‌ తాజాగా హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ను సైతం ప్రారంభించారు. ముంబైలో ఉండి తమ సొంత ఊరికి వెళ్లాలనుకునే వారు 18001213711కు కాల్‌ చేయాలని కోరారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘దయచేసి ఎంతమంది ప్రజలు ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నారో నాకు తెలియజేయండి. మీరు ఎ‍క్కడ ఉన్నారో, ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారో చెప్పండి. నేను, నా టీమ్‌తో కలిసి శాయశక్తుల ప్రయత్నిస్తాం’. కాగా ‘సోనూసూద్‌ కేవలం సినిమా‍ల్లోనే విలన్‌ అని.. నిజ జీవితంలో సూపర్‌ హీరో’ అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (నెటిజన్‌కు.. దిమ్మ తిరిగే సమాధానం)

Advertisement
Advertisement