హీరో శింబుకు హైకోర్టులో ఊరట | Sakshi
Sakshi News home page

హీరో శింబుకు హైకోర్టులో ఊరట

Published Tue, Jan 5 2016 8:32 AM

హీరో శింబుకు హైకోర్టులో ఊరట - Sakshi

చెన్నై: బీప్‌సాంగ్ వ్యవహారంలో నటుడు శింబుకు ఊరట కలిగింది. ఆయనకు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. శింబు బీప్ సాంగ్ వివాదంతో ఇటీవల తమిళనాడే దద్దరిల్లిందని చెప్పవచ్చు. మహిళా సంఘాలు ఆందోళనలు, పోలీసులు కేసులు నమోదులు అంటూ.. పెద్ద రచ్చే జరిగింది. బీప్ సాంగ్ రాసి పాడిన శింబు, సంగీతాన్ని అందించిన అనురుధ్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ కావచ్చు అంటూ మీడియా ప్రచారం హోరెత్తించింది. కోవై పోలీసులు శింబును అరెస్ట్ చేయడానికి చెన్నై వచ్చి మూడు రోజు లు ఆయన కోసం గాలించారు కూడా. శింబు పరారీలో ఉన్నారనే ప్రచారం కలకలం సృష్టించింది. ఇక అనిరుధ్ అయితే సంగీత కచేరీ కోసం కెనడా వెళ్లి అక్కడే ఉం డిపోయారు. కాగా శింబు ముందస్తు బెయిల్ కోసం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటీషన్ గత నెల 22 న హైకోర్టులో విచారణకు రాగా ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ తుది విచారణను జనవరి నాలుగవ తేదీకి వాయిదా వేశారు. ఆలోపు పోలీసులు శింబు ను అరెస్ట్ చేయవచ్చునని కూడా ప్రకటించారు. కాగా శింబు కేసు సోమవారం విచారణకు వచ్చింది. కేసును పరిశీలించిన న్యాయమూర్తి శింబుకు ముందస్తు బెయిల్ ఇవ్వకపోయేంత బలమైన కారణాలు లేవు అంటూ బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బీప్ సాంగ్ వ్యవహారంలో పోలీసులు వాయిస్ టెస్ట్‌కు అనుమతి కోరుతున్నారు కాబట్టి శింబు అందుకు సహకరించాలని ఆదేశించారు. అదేవిధంగా శింబును కోవై, రేస్‌కోర్స్ పోలీసులు మంగళవారం (5వ తేదీ)విచారణకు హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసినందున్న ఈ నెల 11న వారి విచారణకు హాజరవ్వాల్సిందిగా హైకోర్టు న్కాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
 

 శింబుపై మరో రెండు కేసులు; ఇదిలా ఉండగా బీప్ సాంగ్ వ్యవహారంలో శింబుపై తూత్తుకుడి, కోవై లలో మరో రెండు కేసులు నమోదవ్వడం గమనార్హం. మహిళలను అవమాన పరచే విధంగా బీప్‌సాంగ్‌ను రూపొందించిన శింబు, అనిరుద్‌లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తూత్తుకుడికి చెందిన న్యాయవాది శక్తికని స్థానిక 2వ జ్యూడిషియల్ మేజిస్టేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. స్త్రీజాతిని అగౌరపరచే విధంగా బీప్‌సాంగ్‌ను రూపొందించిన నటుడు శింబు, సంగీతదర్శకుడు అనిరుద్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ పిటీషన్‌ను విచారించిన న్యాయమూర్తి శింబు, అనిరుద్‌లపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేసి వివరాలను మార్చి 7వ తారీకున కోర్టుకు సమర్పించాలని తూత్తుకుడి, మద్దియపాక్కమ్ పోలీసులకు ఆదేశించారు. దీంతో మద్దియపాక్కమ్ పోలీసులు శింబు, అనిరుద్‌లపై 509,67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా కోవైకు చెందిన ఇళంగోవన్ అనే వ్యక్తి కోవై 2వ నేర విభాగ న్యాయస్థానంలో శింబు, అనిరుద్‌లపై పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన మెజిస్ట్రేట్ రాజకుమార్ ఈ నెల 12వనతేదీన కేసును విచారించనున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement