కొన్ని లిరిక్స్ వినిపించకపోవడమే మన అదృష్టం : కీరవాణి | Sakshi
Sakshi News home page

కొన్ని లిరిక్స్ వినిపించకపోవడమే మన అదృష్టం : కీరవాణి

Published Mon, Oct 6 2014 11:11 PM

కొన్ని లిరిక్స్ వినిపించకపోవడమే మన అదృష్టం : కీరవాణి

‘‘ఇతర సంగీత దర్శకుల గురించి వ్యాఖ్యానించడం నా అభిమతం కాదు. ఎవరిష్టం వచ్చినవాళ్లతో వాళ్లు పాడించుకుంటారు. బేసిక్‌గా నాకు తెలుగువాళ్లతో పాడించడం ఇష్టం. ఇప్పుడీ చిత్రంలోని పాటలన్నీ పాడింది తెలుగు గాయనీ గాయకులే. ఫలానా సింగర్ పాడితేనే బాగుంటుందని నాకనిపించే ఏకైక గాయకుడు ‘బాలుగారు’. ఆయన కోసం మాత్రమే ఆగిన సందర్భాలున్నాయి’’ అని కీరవాణి చెప్పారు.
 
  త్రికోటి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రానికి స్వరాలందించిన కీరవాణి సోమవారం పత్రికలవారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. నా కెరీర్ ఆరంభం నుంచి అవసరాన్ని బట్టి పెద్ద, చిన్న సినిమాలు చేస్తున్నాను. నాకు చిన్నా, పెద్దా అనే వ్యత్యాసం లేదు. ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాకి ఏం అవసరమో ఆ పరిధిలో ఒదిగిపోయి చేశాను.
 
  నా దృష్టిలో పెద్ద సినిమా, చిన్న సినిమా అనేది నిర్మాణ వ్యయాన్నిబట్టి ఉండదు. 100 కోట్లతో తీసిన సినిమా కూడా సరైన సమయానికి విడుదల కాకపోతే అది చిన్న సినిమా కిందే లెక్క. అదే 50 లక్షలతో తీసిన సినిమా అయినా సరైన సమయానికి విడుదలవుతుందనే భరోసా ఉన్నప్పుడు అది పెద్ద సినిమానే.  ఈ చిత్రదర్శకుడు త్రికోటి ఎప్పట్నుంచో తెలుసు. ఆయనతో ఏమైనా చెప్పొచ్చు.. ఏమైనా మాట్లాడొచ్చు. ఈ సినిమా విషయంలో సౌలభ్యం ఏంటంటే... ‘మాకిలా కావాలి.. అలా కావాలి’ అని అడిగే హీరో లేరు. దాంతో కావాల్సినంత స్వేచ్ఛ లభించింది. హాయిగా పాటలు చేయగలిగాను. నేనిచ్చిన స్వరాలు కథానుసారం ఉండటంతో కోటి వాటినే తీసుకున్నారు.
  ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారు.
 
 అజయ్ నంబర్ వన్ అంటాను. ఇప్పటివరకు తను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే, ఈ సినిమా మరో ఎత్తు అవుతుంది. ‘ఈగ’లో సుదీప్ నటన నాకే  స్థాయిలో నచ్చిందో, ఈ చిత్రంలో అజయ్ నటన అంత బాగా నచ్చింది. సాయి కొర్రపాటితో ‘ఈగ’ సమయంలోనే నాకు మంచి అవగాహన ఏర్పడింది. ఏ నిర్మాత అయినా నన్ను నమ్మితే నేను సౌకర్యవంతంగా సినిమా చేయగలను. సాయి కొర్రపాటి ఆ కోవకు చెందిన నిర్మాతే. ఈ సినిమా చేయడానికి అదొక కారణం అయితే మరో కారణం కథ. ఇందులో ఉన్నవన్నీ సందర్భానుసారంగా సాగే పాటలు కావడంతో చాలా హాయి అనిపించింది.
 
 ట్యూన్ రిపీట్ కావడం అనేది సహజం. ఆర్టిస్టులు వేసుకున్న మేకప్పే వేసుకుంటున్నారు. రచయితలు రాసిందే రాస్తున్నారు. సాహిత్యం గురించి తీసుకుందాం.. మనసు, ప్రేమ, ఆరాధన.. ఇలాంటి పదాలు లేకుండా పాటలొస్తున్నాయా? కొన్ని లిరిక్స్ అదృష్టవశాత్తు వాయిద్యాల హోరులో  వినిపించలేదంటే సంతోషపడాలి. అవి వినపడితే బాధపడాలి. నాకు తెలిసి.. స్వరాలే నవ్యంగా ఉంటున్నాయి. ఫలానా పాట ఎక్కడో విన్నట్లుందే అని అనిపించిందనుకోండి.. అది కూడా దర్శక, నిర్మాతలకో, హీరోకో అలాంటి పాట కావాలని చెప్పడంవల్లే జరుగుతుంది. ఒక్కోసారి సరిపోనంత టైమ్ లేకపోవడంవల్లా రిపిటీషన్ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన సంగీతదర్శకుల్లో నాకు ‘స్వామి రారా’ సంగీతదర్శకుడు ఎం.ఆర్. సన్నీ నచ్చాడు.
 
  నాకు నేనుగా సినిమాలు తగ్గించలేదు. నా దగ్గరికొచ్చి అడిగితే, చేస్తున్నాను. ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు, ఆ చిత్ర సంగీతదర్శకుడికి ‘ఆల్ ది బెస్ట్’ చెబుతాం.  ఓ పది ఆడియో రిలీజులకు వెళ్లినప్పుడు పది ఆల్ ది బెస్ట్‌లు చెబుతాం. ఆ పది సంగీతదర్శకులకు మూడేసి సినిమాలకు అవకాశం వచ్చినా.. మనకు తగ్గుతాయి. నేనెవరికి ఆల్ ది బెస్ట్ చెప్పినా మనస్ఫూర్తిగా చెబుతాను. సో.. ఒకవైపు వారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ, నేను కూడా బిజీగా ఉండాలని కోరుకోవడం హాస్యాస్పదం.
 

Advertisement
Advertisement