‘స్పెక్టర్’లో మిస్టేక్స్ ఎన్నో! | Sakshi
Sakshi News home page

‘స్పెక్టర్’లో మిస్టేక్స్ ఎన్నో!

Published Mon, Nov 30 2015 6:13 PM

‘స్పెక్టర్’లో మిస్టేక్స్ ఎన్నో!

హాలివుడ్: దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసిన తాజా బ్లాక్‌బస్టర్ జేమ్స్ బాండ్ మూవీ ‘స్పెక్టర్’ పోరాట సన్ని వేశాల్లో దాదాపు 35 త ప్పులను జేమ్స్ బాండ్ అభిమానులు గుర్తించారు. వాటిని ఐఎండీబీలో పరస్పరం షేర్ చేసుకున్నారు. మంచు ప్రాంతంలో కారును విమానం ఛేజ్ చేసి డీకొట్నిప్పుడు విమానానికున్న ల్యాండింగ్ వీల్స్‌లో ఓ వీల్ ఊడిపోతుంది. ఆ తర్వాత సీన్‌లో విమానం ల్యాండ్ అయినప్పుడు అన్ని వీల్స్ పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. ఓ సీన్‌లో విమానం ముందటి గ్లాస్‌కు బుల్లెట్ తగిలి పగిలిపోయిన గుర్తు ఉంటుంది. ఆ తర్వాత సీన్‌లో ఆ గ్లాస్ ఎలాంటి పగుళ్లు లేకుండా శుభ్రంగా ఉంటుంది.

 

హెలికాప్టర్ క్రాష్‌లో బాండ్ ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ రివర్ బ్యాంక్ వైపు దూసుకెళుతుంది. జేమ్స్ బాండ్ బ్రిడ్జ్ పైన పరుగెత్తుతుంటే బీట్ పోలీసులు చోద్యం చూస్తుంటారు. రైల్లోని డైనింగ్ హాల్లో పోరాట సన్నివేశంలో ప్రయాణికులు కనిపిస్తారు. హఠాత్తుగా ప్రయాణికులు, కిచెన్ సిబ్బంది మాయమవుతారు. రెప్పపాటులో బాండ్ గర్ల్ సెడాక్స్ దుస్తులు మారిపోతాయి.

 మరో సీన్‌లో మెడలీన్ స్వాన్ ఓ హోటల్‌లో  నిండుగా దుస్తులు ధరించి కనిపిస్తుంది. అదే క్షణంలో గోడను బద్దలుకొట్టుకొని జేమ్స్ బాండ్ ప్రవేశించినప్పుడు మాత్రం ఆమె నైటీ ధరించి ఉంటుంది. లండన్‌లో నెంబర్ 15 బస్సులో జేమ్స్ బాండ్ ప్రయాణిస్తుంటే మార్గమధ్యంలో ఆయన షూ మారిపోతుంది. ఇలా ఒక్కొక్క అభిమాని ఒక్కో తప్పుచొప్పున మొత్తం సినిమాలో 35 తప్పులను డేగ కళ్లతో వెతికి పట్టుకున్నారు. అయినా గత ‘స్కైఫాల్’ చిత్రంలోకన్నా బెటర్ అని, ఆ చిత్రంలో ఏకంగా 68 మిస్టేక్స్ దొరికాయని వారంటున్నారు.

ఎన్ని తప్పులుంటేమి, ఇప్పటి వరకు స్పెక్టర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3,200 కోట్ల రూపాయలను వసూలు చేసిందని నిర్మాతలు మురిసి పోతున్నారు. వందేళ్లకు ముందే హాలివుడ్ సినిమా, మేకింగ్‌లో పర్‌ఫెక్షన్ సాధించిందన్న ప్రముఖ భారతీయ దర్శకుడు సత్యజిత్ రే ఈ చిత్రాన్ని చూస్తే ఏమనేవారో! అయినా ప్రపంచంలోని 50 పాపులర్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించకున్న అమితాబ్ నటించిన ‘షోలే’ చిత్రంలో కూడా ఇలాంటి తప్పులెన్నిన వాళ్లు లేకపోలేదు.

 

అందులోని ఓ పోరాట సన్నివేశంలో ఓ చెక్క వంతెనను విలన్లు పేల్చి వేస్తారు. ఆ తర్వాత సీన్‌లో చెక్కుచెదరకుండా ఉన్న ఆ చెక్క వంతెన మీది నుంచి ధర్మేంద్ర, హేమమాలిని వెళతారు. సినిమా క్లైమాక్స్‌లో గబ్బర్ సింగ్‌తో రెండు చేతులు భుజాలవరకు లేని ఠాకూర్ (సంజీవ్ కుమార్) ఫైట్ చేస్తున్నప్పుడు చొక్కా నుంచి ఓ అరచేతి కూడా కనిపిస్తుంది. అసలు కరెంటనేదే లేని ఠాకూర్ విలేజ్‌లో ఎత్తుగా కట్టిన వాటర్ ట్యాంక్ నుంచి నీళ్ల సరఫరాకు ఎలాంటి టెక్నాలజీని వాడోరో ఎప్పటికీ సస్పెన్సే!

Advertisement
Advertisement