కొన్ని క్షణాలు.. సందర్భాలు | Sakshi
Sakshi News home page

కొన్ని క్షణాలు.. సందర్భాలు

Published Tue, Feb 27 2018 2:02 AM

Sridevis Achievements - Sakshi

మనసు నిండా ట్రాజెడీ... కెమెరా ముందు కామెడీ
జీవితంలోని కొన్ని క్షణాలు జీవితాంతపు క్షణాలుగా మిగిలిపోతాయి. స్టార్‌ నటి శ్రీదేవి జీవితంలోనూ అలాంటి క్షణాలు ఉన్నాయి! గుండె నిండా దుఃఖాన్ని ఉంచుకుని, ముఖమంతా నవ్వును అభినయించిన క్షణాలు అవి! యశ్‌చోప్రా చిత్రం ‘లమ్హే’ (1991) షూటింగ్‌ లండన్‌లో జరుగుతున్నప్పుడు ఆమెకు తండ్రి చనిపోయిన కబురు అందింది. వెంటనే ఇండియా వచ్చి, తండ్రి అంత్యక్రియల్లో ఉండి, తిరిగి లండన్‌ వెళ్లారు. ఆ దుఃఖంలోనే.. అనుపమ్‌ ఖేర్‌తో కామెడీ సన్నివేశాల్లో నటించారు! ‘లమ్హే’ అంటే క్షణాలు అని అర్థం.

ఎక్కడి నుంచి వచ్చిందో... ఎక్కడికి వెళ్లి పోయిందో
‘న జానె కహా సె ఆయీ హై’.. ‘చాల్‌బాజ్‌’ (1989) చిత్రంలోని పాపులర్‌ సాంగ్‌. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలుసు? ఆమె ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు?.. అని భావగర్భితంగా సాగే ఈ పాట.. ఈ సందర్భంలో శ్రీదేవి అభిమానుల హృదయాల మీద కదలాడే ఉంటుంది. ఆ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు శ్రీదేవికి 103 డిగ్రీల జ్వరం. పైగా బోరున కురిసే వర్షంతో మొదలయ్యే పాట అది!

ఆడినా తియ్యగా.. పాడినా తియ్యగా..
శ్రీదేవి నవ్వినా, మాట్లాడినా, పాటలు పాడినా చిన్న పిల్ల గొంతులా స్వీట్‌గా ఉంటుంది. సద్మా (1983), చాందినీ (1989), గర్జన (1991), క్షణక్షణం (1991) చిత్రాలలో ఆమె స్వయంగా పాడిన పాటలు ఉన్నాయి.

‘బర్క్‌’ అడిగినా...‘పార్క్‌’కి వెళ్లలేదు!
‘జురాసిక్‌ పార్క్‌’ (1994)లో శ్రీదేవి చిన్న పాత్ర వేస్తే బాగుంటుందని స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ముచ్చట పడ్డారు. శ్రీదేవి మంచి పీక్‌లో ఉన్న సమయం అది. అందుకని కాదు కానీ, అది పెద్దగా గుర్తుండిపోయే పాత్రేమీ కాకపోవడంతో శ్రీదేవి ఆ ఆఫర్‌ని మృదువుగా తిరస్కరించారు.

భాష రాకుండానే.. భావం ఒలికింది!
‘చాందినీ’కి ముందంతా శ్రీదేవి హిందీలో తన డైలాగులు తను చెప్పలేకపోయేవారు. అప్పట్లో ఆమె నటించిన చాలా సినిమాలకు నాజ్, రేఖ డబ్బింగ్‌ చెప్పేవారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement