ప్రతి మనసుకు వైద్యం కావాలి | Sakshi
Sakshi News home page

ప్రతి మనసుకు వైద్యం కావాలి

Published Thu, Dec 1 2016 11:44 PM

ప్రతి మనసుకు వైద్యం కావాలి

ప్రతి జీవితం ప్రియమైనది కావాలి
కాయ్‌రాకు తన ప్రాబ్లం తనకు తెలియదు. అందంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్‌గా మంచి ప్రతిభ ఉంది. ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. తనకు మంచి భవిష్యత్తు కూడా ఉంది. కాని తను ఒక రిలేషన్‌ను, జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. మొదటి బాయ్‌ఫ్రెండ్ ఒక హోటల్ యజమాని. మంచివాడు. పొడుగ్గా ఉంటాడు. కాని అతడికి నో చెప్పేస్తుంది. సింగపూర్‌లో ఔట్‌డోర్ షూటింగ్‌లో ఉండగా ఆ సినిమా నిర్మాతైన యువకునితో చనువుగా ఉండాల్సి వచ్చింది కనుక నో చెప్తున్నానని చెప్తుంది. ఆ తర్వాత ఆ నిర్మాతైన యువకుడు ఆమెకు సన్నిహతం కాబోతాడు.

అమెరికాలో తీయబోతున్న సినిమాకు ఆమెను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకుంటాడు. అయితే చిన్న ఇబ్బంది చెబుతాడు. తనకు గతంలో ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉండేదని ఆమెతో తెగదెంపులు అయిపోయాయని అయితే ఆమె ఈ సినిమాకు  కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాల్సి వస్తోందని ఈ విషయం ముందే చెప్పడం మంచిదని చెప్పేస్తున్నానని అంటాడు. అంతేకాదు ఇక మనం మన అనుబంధం పట్ల  సీరియస్ అవుదాం, పరస్పరం దీనిని ముందుకు తీసుకెళదాం అని కూడా చెప్తాడు. కాని అతడికీ నో చెప్పేస్తుంది. బతిమిలాడినా వినదు. దాంతో అతడు అమెరికా వెళ్లి తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తోనే ఎంగేజ్‌మెంట్ చేసుకుంటాడు.

అక్కడ సమస్య మొదలవుతుంది.
పర్సనల్ వెర్సస్ ప్రొఫెషనల్. పర్సనల్‌గా ఆమె అతడిని వద్దనుకుంది. ప్రొఫెషనల్‌గా అతడి సినిమాలో పని చేయాలనుకుంటోంది. కాని అలా పని చేయాలంటే రోజూ అతణ్ణి చూడాలి, అతడి గర్ల్‌ఫ్రెండ్‌ని చూడాలి, వాళ్లిద్దరి సాన్నిహిత్యాన్ని చూడాలి ఇదంతా తాను పడగలదా అనే సందేహం. వద్దనుకుంటే బంగారంలాంటి సినిమా అవకాశం పోతుందే అని బాధ. ఈ రెంటి మధ్య నలిగిపోయి నిద్రకు కరువవుతుంది. వారాల తరబడి నిద్ర పట్టదు. నిద్రమాత్రలు మింగినా నిద్ర పట్టదు. దాని నుంచి బయటపడటానికే చివరకు గోవా వస్తుంది. అక్కడ ఉండే తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడుతుంది. చివరకు గోవా సైకియాట్రిస్ట్ అయిన జహంగిర్ ఖాన్‌తో తన సమస్య చెప్పుకుని దాని నుంచి బయటపడుతుంది. అప్పటి వరకూ నరకంగా మారిన ఆ జీవితం ఆమెకు ఇప్పుడు ప్రియమైనదిగా మారుతుంది.


‘డియర్ జిందగీ’ వర్తమాన సమాజంలో వస్తున్న భావోద్వేగ సమస్యలకు వైద్యం ఎలా అవసరమో సున్నితంగా చెప్పే సినిమా.
ఇందులో కాయ్‌రాగా ఆలియాభట్, సైకియాట్రిస్ట్ జహంగిర్ ఖాన్‌గా షారూక్ ఖాన్ కనిపిస్తారు. షారూక్ తన ఎంట్రీలోనే మన దేశంలో ఉన్న సమస్యను బహిరంగ పరుస్తాడు- ‘మన దేశంలో కిడ్నీ పాడైందనో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందనో ఇరుగుపొరుగువారికి ధైర్యంగా చెప్తాము. కాని మనసు పాడైంది అని మాత్రం చెప్పుకోము. ఇంట్లో కూడా అదొక రహస్యంగా భావిస్తాము’ అంటాడతడు. ‘మన మెదడు మన దేహంలో భాగం కాదా?’ అని ప్రశ్నిస్తాడు. అతడు వైద్యం చేసే పద్ధతి కూడా భిన్నంగా ఉంటుంది. మందులూ మాకులతో చేసే వైద్యం కాదు అది. కేవలం మాట్లాడటం ద్వారా ఎదుటివారికి తమను తాము అర్థం చేయించడం ద్వారా చేసే వైద్యం. ‘పజిల్‌ని పూర్తి చేయాల్సింది నువ్వే. నేను కేవలం అందుకు సహాయకుణ్ణి మాత్రమే’ అంటాడు ఒకచోట.

ఇంతకూ కాయ్‌రా సమస్య ఏమిటి? ఆమెకు ఆరేళ్ల వయసప్పుడు తల్లిదండ్రులు ఆమెను అమ్మమ్మ, తాతయ్య దగ్గర వదిలేసి జీవిక కోసం విదేశాలకు వెళ్లారు. ఆ ఎడబాటు ఆమె భరించలేకపోయింది. అక్కడ తమ బతుకు పోరాటంలో వాళ్లు కాయ్‌రాను పూర్తిగా అలక్ష్యం చేశారు. అంతే కాదు కన్నకూతురు తమకు దూరంగా ఉందని కాక రెండో తరగతిలో ఆమె ఫెయిల్ అయ్యిందనే కారణాన విదేశాల నుంచి స్వదేశం వచ్చి ఇక్కడే ఉండిపోయారు. తనంటే ప్రేమ లేదా? తానెంతో ప్రేమించిన తల్లిదండ్రులు తన పట్ల చూపే ప్రేమ ఇదా అని ఆమె మనసులో లోతైన గాయం అయ్యింది. ఆ గాయం వల్ల తాను మనస్ఫూర్తిగా ఎవరినీ ప్రేమించలేకపోయింది. ఎవరైనా దగ్గర కావడానికి ప్రయత్నించినా వాళ్లు ఎక్కడ ‘నో’ చెప్తారో అని తానే ముందు ‘నో’ చెప్పేస్తుంది. ఎందుకంటే తాను ఎవరినైనా కోరుకుంటే వాళ్లు దూరం అవుతారేమోనన్న భయం.

ఇది ఆమెకు తెలియజేసి ఆమెను ఆ సమస్య నుంచి దూరం చేస్తాడు సైకియాట్రిస్ట్ షారుక్. తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారని కనుక తల్లిదండ్రుల తప్పును క్షమించేస్థాయికి ఎదగాలని అంటాడు. నువ్వు ఎవరి సమక్షంలో  భద్రంగా సంతోషంగా ఫీలవుతావో అతను దొరికే దాకా వెతకడం, రిజెక్ట్ చేయడం తప్పు కాదని చెబుతాడు. ‘ఇష్టం లేకపోయినా కఠినమైన నిర్ణయాలు తీసుకుని మనసునూ శరీరాన్ని బాధించుకోవడం కంటే అసలు ఆ నిర్ణయాన్ని వదులుకోవడం మేలు’ అనే సూచన చేస్తాడు.

ఇవన్నీ కాయ్‌రాకు మాత్రమే కాదు... థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులకు కూడా సూచనలే.
ఈ సినిమాలో ఆలియాతో పని మనిషి ‘ఎందుకమ్మా పిచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్లావు? నీకు పిచ్చా?’ అని అడిగితే ‘కాదు. మానసికంగా కొన్ని సమస్యలను ఎదుర్కోలేనప్పుడు డాక్టర్‌ని కలిస్తే ధైర్యం వస్తుంది’ అని జవాబు చెప్తుంది ఆలియా. అప్పుడు పని మనిషి ‘అలాగైతే మంచిదే. నిజానికి అందరికీఅలాంటి డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉంది’ అంటుంది అర్థం చేసుకున్న దానిలా.

నిజమే. మెదడు మన శరీరంలో భాగం అయినప్పుడు శరీరానికి ఏవో ఒక సమస్యలు వచ్చినట్టే మనసుకు కూడా ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో అది అనారోగ్యం కాదు అని అనుకోరాదు. చేయి తెగి రక్తం కారితే వైద్యం అవసరమనీ మనసు చెదిరి గాయపడితే వైద్యం అక్కర్లేదని అనుకోరాదు. మనందరం ఏదో ఒక సందర్భంలో మానసిక వైద్యం తీసుకోవాల్సిందే. తీసుకోవడమే మంచిది.

ఎందుకంటే వైద్యం కన్నా జీవితం ప్రియమైనది. మళ్లీ మళ్లీ దక్కనిది.
ఈ సినిమా దర్శకురాలు గౌరి షిండే, నిర్మాతలు గౌరి ఖాన్, కరణ్ జొహర్ ఇలాంటి సున్నితమైనసమస్యను తీసుకుని సినిమా తీసినందుకు అభినందనీయులు. 22 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే దాదాపుగా ఇప్పుడు 50 కోట్లు వసూలు చేసింది. ఇంకా చేయొచ్చు కూడా. చిన్న సినిమా అయినా షారూక్ ఇందులో నటించడం అతనికీ ప్రేక్షకులకూ ఒక మార్పు. ఆలియా భట్ తనలో ఉన్న టాలెంట్‌ని ప్రదర్శించడానికి ఈ సినిమా ఒక సవాలు. అందులో ఆమె ఒకటో ర్యాంకులో పాస్ అయ్యింది. సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ అమరిన అలంకరణలు. సెకండ్ హాఫ్‌లో కొంచెం స్లో అయినా క్లయిమాక్స్‌కు అందుకుంటుంది.

గోవాలో హాయిగా ఉండే వాతావరణంలో హాయిగా సాగే కథతో ఒక సినిమా చూడాలనుకుంటే డియర్ జిందగీ చూడొచ్చు. ఇది మీకు కొద్దోగొప్పో మేలే చేయగలదు. హాని కాదు. కెన్ గో ఫర్ ఇట్.

Advertisement
Advertisement