Sakshi News home page

‘అల్లరి’ నరేశ్ వస్తే హిట్టే!

Published Sun, Mar 13 2016 10:57 PM

‘అల్లరి’ నరేశ్ వస్తే హిట్టే! - Sakshi

 - సందీప్ కిషన్
‘‘తమిళంలో ఏడాది కిందట ‘నేరమ్’ సినిమా చూసి తెలుగులో చేద్దామని సందీప్ కిషన్‌తో చెప్పా. నాపై నమ్మకంతో ఈ సినిమా చేయమని కోరితే తను సరే అన్నాడు. దర్శకుడు అని కన్నెగంటి ఎక్కడా సోల్ మిస్సవకుండా తెరకెక్కించాడు. ఇందులో మహత్ మంచి క్యారెక్టర్ చేశాడు. జాతీయ అవార్డు గ్రహీత అయిన నటుడు బాబీ సింహాను తెలుగులో పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన తెలుగువాడే. ఈ నెల 23న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అనీల్ సుంకర చెప్పారు. సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్ జంటగా అని కన్నెగంటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మించిన చిత్రం ‘రన్’.సాయి కార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాటల సీడీని హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి హీరో రాజ్ తరుణ్‌కు ఇచ్చారు. నిర్మాత ఏయం రత్నం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ‘‘గత ఏడాది గుడ్ టైమ్, బ్యాడ్ టైమ్ రెండూ చాలా హెవీగా చూశా. ఈ ఏడాది అంతా గుడ్ టైమ్ ఉంటుందనుకుంటున్నా. నా సినిమా ఫంక్షన్స్‌కి ‘అల్లరి’ నరేశ్  అన్న వచ్చినవన్నీ బాగా ఆడాయి. సెంటిమెంట్ గా ఈ చిత్రం కూడా ఆడుతుంది’’ అని సందీప్ కిషన్ అన్నారు.

‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ- ‘‘ఇది నా సొంత బ్యానర్‌లాంటిదే. కొత్త పాత్రలు చేయాలి, కొత్త సినిమా చేయాలని కోరుకుంటాడు సందీప్. తమిళం, మలయాళంలోలానే తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. ఈ వేడుకలో దర్శకులు వీరు పోట్ల, కె.దశరథ్, జి.నాగేశ్వర రెడ్డి, నిర్మాత పి. కిరణ్, నటులు మహత్, అవసరాల శ్రీనివాస్, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement