సూర్య భర్త కావడం నా అదృష్టం | Sakshi
Sakshi News home page

సూర్య భర్త కావడం నా అదృష్టం

Published Sat, May 30 2015 2:50 AM

సూర్య భర్త కావడం నా అదృష్టం - Sakshi

పెళ్లి చేసుకున్న హీరోయిన్‌కు తదుపరి వచ్చేది అక్క, అమ్మ వేషాలేననే అపోహ ఉందని నటి జ్యోతిక అన్నారు. నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జ్యోతిక సుమారు ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం 36 వయదినిలే. ఇటీవల విడుదలై విజయం సాధించింది. జ్యోతిక మాట్లాడుతూ తన భర్త సూర్య తన భావాలను గ్రహించి నటించడానికి అనుమతి ఇవ్వడం ఆయనలోని గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అన్నారు.

సాధారణంగా పెళ్లయిన హీరోయిన్లకు అమ్మ, అక్క వేషాలే వస్తాయనే అపోహ ఇక్కడుందన్నారు. అయితే అది తప్పేనని ఈ చిత్రం చూసిన తరువాత దర్శక, నిర్మాతలకు అర్థం అవుతోందన్నారు. అలాగే భార్యలు భర్త నుంచి కారు, బంగ్లాలు మాత్రమే కోరుకోరన్నారు. రోజులో కనీసం 30 నిమిషాలన్నా పిల్లలతో, తనతో భర్త గడపాలని ప్రతి భార్య కోరుకుంటుందన్నారు.

అదే విషయాన్ని 36 వయదినిలే చిత్రంలో చెప్పామని అన్నారు. తనకు మాత్రం సూర్య లాంటి భర్త లభించడం అదృష్టం అని జ్యోతిక అన్నారు. ఇకపై బయట చిత్రాలలో నటిస్తారా? అని అడుగుతున్నారని మంచి కథ, పాత్రలు లభిస్తే తప్పకుండా నటిస్తానని ఆమె స్పష్టం చేశారు. త్వరలో జ్యోతిక తన భర్త సూర్యతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు.

Advertisement
Advertisement