నల్ల హీరోలు! | Sakshi
Sakshi News home page

నల్ల హీరోలు!

Published Sun, Mar 25 2018 2:08 AM

Suriya takes a massive step to reduce producers' burden. Heres what he did - Sakshi

ఇప్పుడు తమిళ సినిమా అభిమానులంతా సూర్యను ‘నల్లహీరో’ అనే పిలుస్తున్నారు. అదేంటీ  సూర్య మంచి కలర్‌తో హ్యాండ్‌సమ్‌గా ఉంటాడు కదా. మరి నల్ల హీరో అని పిలవటం ఏంటీ? అని ఆశ్చర్యపోకండి. తమిళంలో ‘నల్ల’ అంటే మంచి అని. ఇలా పిలుచుకోవటానికి కారణం ఏంటంటే.. తమిళనాడులో  థియేటర్స్‌ బంద్‌ కారణంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజినెస్‌ అనేదే జరగడం లేదు. వీటికి తోడు బడ్టెట్‌ అదుపు దాటడం, ఏదైనా స్ట్రైక్‌తో షూటింగ్‌ రద్దు కావడం, యూనిట్‌లో ఎవరితోనైనా మనస్పర్థలు ఏర్పడటం, ఇన్నీ చేసి రిలీజ్‌ టైమ్‌కి థియేటర్స్‌ దక్కించుకునే విషయంలో టెన్షన్‌.... ఇలా నిర్మాతలు బోలెడన్ని సమస్యలతో సతమతమౌతున్నారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కూడా పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చింది. అందుకే నిర్మాతలకు కొంచెం భారం తగ్గించే విధంగా ఓ నిర్ణయం తీసుకున్నారు సూర్య. జనరల్‌గా హీరో, హీరోయిన్‌ పర్సనల్‌ స్టాఫ్‌ శాలరీ కూడా నిర్మాతలే భరిస్తారు.

ఇప్పుడు తన స్టాఫ్‌ అందరికీ తన సొంత డబ్బులనే చెల్లించదలిచారు హీరో సూర్య. ఈ విషయంపై సూర్య 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహ నిర్మాత రాజశేఖర్‌ పాండియన్‌ మాట్లాడుతూ–‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ఉద్యమం, నిర్మాతల కష్టాలను గమనించి బాధ్యతగల సీనియర్‌ నటుడిగా, షూటింగ్‌ సమయాల్లో తనతో ఉండే  స్టాఫ్‌ జీతాలను తానే స్వయంగా చెల్లించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు సూర్య. ఈ ఖర్చు సుమారు 30–40 లక్షల మధ్య ఉంటుంది. షూటింగ్‌ డేస్‌ని బట్టి పెరగొచ్చు తగ్గొచ్చు కూడా’’ అని పేర్కొన్నారు. నిర్మాతల కష్టాల గురించి ఆలోచించి, ఇలా వాళ్ల భారం తగ్గిస్తున్నారంటే సూర్య నిజంగా రొంబ (చాలా) నల్ల హీరోనే కదా. విశేషం ఏంటంటే.. సూర్య బాటను ఆయన తమ్ముడు, హీరో కార్తీ కూడా ఫాలో కానున్నారు. హీరో విశాల్‌ కూడా ఈ లిస్ట్‌లో జాయిన్‌ అయ్యారు. కోట్లు తీసుకునే హీరోలు ఇలా తమ స్టాఫ్‌కు జీతాలను పే చేస్తే నిర్మాతకు కొంచెం భారం తగ్గుతుంది. ఇది ఇండస్ట్రీకు శుభపరిణామమే.
 

Advertisement
Advertisement