మాది అమలాపురమండి.. ఆయ్‌! | Sakshi
Sakshi News home page

మాది అమలాపురమండి.. ఆయ్‌!

Published Mon, Dec 11 2017 10:40 AM

Swamy rara Fame Sathya Akkala Special Interview - Sakshi

శ్రీనగర్‌కాలనీ: ఎర్రబస్సెక్కి కృష్ణానగర్‌ వచ్చిన పతోడు హీరో అయిపోదామనే అనుకుంటాడు. అదే ఆశతో వస్తారు.. శ్వాసగా జీవిస్తారు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడతారు. కొందరు ఇంట్లో చెప్పి వస్తే.. ఇంకొందరు ఇంటి నుంచి పారిపోయి వస్తారు. ‘సత్య అక్కల’ది కూడా అలాంటి బాపతే. ఎవరీ సత్య అనుకుంటున్నారా..! ‘స్వామిరారా’ గుర్తింది కదా.. అందులో ‘ఐదు లక్షలు తీసుకునేటప్పడు ఐదు నిమిషాలు ఆగలేవా..!’ అంటూ తన అమాయకత్వంతో ఐదుకోట్ల రూపాయిలు చేజార్చుకునేలా చేస్తాడే అతడే ఇతడు. సినిమాల్లో అవకాశాల కోసం ఇంట్లో నుంచి పారిపోయి తూ.గో.జి లోని అమలాపురం నుంచి వచ్చాడు. గోదారి ఎటకారానికి తన హావభావాలు జోడించి ఇప్పుడు వెండితెరపై నవ్వులు పూయిస్తున్న సత్య తన కెరీర్‌ విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు సత్య మాటల్లోనే..  

మాది తూగో జిల్లా అమలాపురమండి. నాన్న వెంకట్రావు టీచర్‌. చిన్నప్పట్నుండి సినిమాలంటే మా పిచ్చిగా ఉండేది. చిరంజీవి, రజనీకాంత్‌ బొమ్మ పడిదంటే తొలాట చూడాల్సిందే. అలా బీటెక్‌ను మధ్యలోనే ఆపేసి 2005లో రైలెక్కి హైదరాబాద్‌లో దిగిపోయానండి. కానీ మా అమ్మా, నాన్న అస్సలు ఒప్పుకోలేదు. చేసేది లేక తిరిగి అమలాపురం వెళ్లిపోయా. కానీ నరనరాల్లో ఉన్న సినిమా అక్కడ ఉండనీయలేదు. దీంతో ఇంట్లో చెప్పి మరుసటి ఏడు మళ్లీ సిటీకి వచ్చేశా. నా స్నేహితుల పరిచయాలతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను.

‘రౌడీ ఫెలో’ చిత్రంలో నారా రోహిత్‌తో
పిల్ల జమిందార్‌లో బొమ్మ పడిందండి..
అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ద్రోణ, పిల్లజమిందార్‌ చిత్రాలకు పనిచేశా. పిల్లజమిందార్‌ చిత్రంలో కూడా నటించే అవకాశం వచ్చిందండి. అందులో నా పాత్ర పండడంతో సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ‘స్వామిరారా’ చిత్రంలో లీడ్‌ రోల్‌ ఇచ్చారు. ఆ సినిమా హిట్టవడంతో ఇక వరుసగా అవకాశాలొచ్చాయి. రౌడీ ఫెల్లో, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య, స్పీడున్నోడు, మజ్ను, జై లవకుశ, ప్రేమమ్, ఎక్కడిపోతావు  చిన్నవాడా.. చిత్రాల్లో చేసిన పాత్రలకు మంచి స్పందన వచ్చింది.లిక దర్శకుడు సుధీర్‌ వర్మ ప్రోత్సాహమైన మర్చిపోలెనండి బాబు.

‘ఫ్లైయింగ్‌ కలర్స్‌’ తోడుగా..   
తెలుగు కమెడియన్స్‌లో శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్యం రాజేష్‌ లాంటి సీనియర్లు, యువ కమెడియన్లు 14 మందితో ‘ఫ్లైయింగ్‌ కలర్స్‌’ అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నామండి. ప్రతీ నెలా రెండో శనివారం గ్రూప్‌లోని ఓ కమెడియన్‌ పార్టీ ఇస్తారు. అన్ని వంటకాలతో పాటు వెరైటీ ప్రోగ్రామ్స్‌తో సంతోషాన్ని పంచుకుంటామండి. ఆరోజు మా కామెడీతో కడుపు చెక్కలవ్వాల్సిందేనండి. అంతేకాదండి.. గోదారోణ్ని కదా అండి ఆయ్‌.. తినడం కూడా ఇష్టమేనండి. నచ్చిన తిండి ఎక్కడున్నా తిని తీరాల్సిందేనండి.. ఆయ్‌.

ఇది దేవుడిచ్చిన వరమండి..
అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చిన నేను అనుకోకుండా ప్రేక్షకులను నవ్వించే అవకాశం వచ్చిందండి. ఇది దేవుడిచ్చిన వరమనుకుంటానండి. ఇంక బ్రహ్మానందం, సునీల్‌ అన్నయ్య అంటే చాలా ఇష్టమండి. తెలుగులో హీరో రామ్‌చరణ్‌ నటిస్తున్న రంగస్థలం, నాగచైతన్య హీరోగా సవ్యశాచి చిత్రాల్లో నటిస్తున్నానండి. నన్ను ఆదరిస్తున్న తెలుగువారికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి.. ఆయ్‌. 

Advertisement
Advertisement