ఆ తప్పుని మళ్లీ మళ్లీ చేస్తున్నా! | Sakshi
Sakshi News home page

ఆ తప్పుని మళ్లీ మళ్లీ చేస్తున్నా!

Published Wed, May 7 2014 10:23 PM

ఆ తప్పుని మళ్లీ మళ్లీ చేస్తున్నా!

 ‘‘సినిమా ప్రపంచం చాలా పెద్దది. నాకు తెలిసి వేరే ఏ రంగంలోనూ నేర్చుకోలేనన్ని విషయాలు ఇక్కడ నేర్చుకోగలుగుతాం’’ అన్నారు తాప్సీ. తను కథానాయిక అయ్యి నాలుగేళ్లయ్యింది. ఈ నాలుగేళ్లల్లో నేర్చుకున్న విషయాల గురించి తాప్సీ చెబుతూ -‘‘సినిమా పరిశ్రమ ఓపిక నేర్పిస్తుంది. సినిమాలో కొన్ని నిమిషాలే కనిపించే ఒక్క సీన్ కోసం మేం గంటలు గంటలు కష్టపడతాం. దాంతో ఓపిక వహించడం అలవాటైపోతుంది. ప్రతిభ, కష్టపడి పని చేసే మనస్తత్వం ఉంటే మాత్రం సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే విజయాలు చవిచూస్తాం అనే విషయాన్ని ఇక్కడికొచ్చిన తర్వాతే తెలుసుకున్నా.
 
  అంతకుముందు జరగకూడనిది ఏదైనా జరిగితే... అది చిన్న విషయమైనా ప్రపంచం తలకిందులైనట్లుగా బాధపడిపోయేదాన్ని. ఇప్పుడు నిబ్బరంగా ఉండటం అలవాటైంది. బహుశా సినిమాలపరంగా జయాపజయాలు చవిచూస్తుంటాం కాబట్టే, మనసు రాటుదేలి ఉంటుందేమో అనిపిస్తోంది. ఇక, షూటింగ్స్‌లో మా కష్టాలెలా ఉంటాయో తెలియనివాళ్లు కూడా మమ్మల్ని విమర్శిస్తుంటారు. అందుకే, విమర్శలను తేలికగా తీసుకోవడం అలవాటైంది. ఏది జరిగినా మన మంచికే అని సర్దిచెప్పుకోవడం సినిమాల్లోకి వచ్చాకే నేర్చుకున్నా.
 
  పరిశ్రమలో ఒక మంచి స్థానం సంపాదించుకున్న తర్వాత ‘హమ్మయ్య’ అని హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి లేదు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పరుగులు పెడుతూనే ఉండాలనే విషయం అర్థమైంది. ఇలా అన్ని విషయాలకూ ఎలా స్పందించాలో బాగా తెల్సుకోగలిగాను. కానీ, ఒకే ఒక్క విషయంలో మాత్రం మారలేకపోతున్నాను. ఎవరినైనాసరే నేను సులువుగా నమ్మేస్తాను. అది నాకు మైనస్. ఇకనుంచి ఎవర్నీ ఈజీగా నమ్మకూడదని అప్పుడప్పుడు అనుకుంటాను. కానీ, ఆచరణలో పెట్టలేను. నమ్మకం విషయంలో నేను మళ్లీ మళ్లీ తప్పు చేస్తున్నా’’ అని చెప్పారు.
 

Advertisement
Advertisement