నాకు నచ్చని ఒకే ఒక్క ప్రశ్న? | Sakshi
Sakshi News home page

నాకు నచ్చని ఒకే ఒక్క ప్రశ్న?

Published Tue, Feb 7 2017 6:51 AM

నాకు నచ్చని ఒకే ఒక్క ప్రశ్న? - Sakshi

నాకు నచ్చని ఒకే ఒక్క ప్రశ్న ఏమిటో తెలుసా? అంటున్నారు నటి కాజల్‌ అగర్వాల్‌. ఈ అమ్మడిప్పుడు మంచి జోరుమీదున్నారు. అజిత్‌కు జంటగా వివేకం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో స్టార్‌ హీరో విజయ్‌తో నటించే అవకాశం వరించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒకేసారి ఇద్దరు టాప్‌ హీరోలతో రొమాన్స్  చేస్తున్న నటి కాజల్‌ అగర్వాల్‌ అన్నది గమనార్హం. తెలుగులో ఇటీవలే చిరంజీవికి జంటగా నటించి బిగ్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న కాజల్‌ ఏమంటున్నారో చూద్దాం. కథానాయికలు ఏలాంటి ప్రశ్నలకైనా ఏదో రకంగా బదులిచ్చి బయటపడతారు కానీ పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు మాత్రం కాస్తంత అసహనం ప్రదర్శిస్తుంటారు. కాజల్‌ ఇందుకు అతీతం కాదు.

ఈ అమ్మడిని అలాంటి ప్రశ్న అడిగితే  ఆమె ఆగ్రహం చవిచూడాల్సిందేనట. అదేమిటో కాజల్‌ మాటల్లోనే హీరోయిన్లకు 30 ఏళ్ల వయసు వచ్చిందంటే చాలు వెళ్లిన చోటల్లా పెళ్లెప్పుడు అని అడుగుతుంటారు. ఇలా నన్ను చాలా మంది చాలా సార్లు అడిగారు. నాకు నచ్చని ఒకే ఒక్క పశ్న ఇదే. అలా అడిగిప్పుడు చాలా కోపం వస్తుంది. నటీమణులకు వివాహం అయితే ఇక హీరోయిన్  అవకాశాలకు ఆశలు వదులుకోవలసిందే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఏ అక్కగానో, వదినగానో, అమ్మగానో నటిస్తారా? అని అడుగుతుంటారు. ఇది కరెక్ట్‌ కాదు. నటనా ఒక వృత్తే. నటనను, వృత్తిని వేర్వేరుగా చూడకూడదు. వివాహమైన స్త్రీలు ఉద్యోగాలకు వెళ్లడం లేదా? నటనను ఆ కోణంలో ఎందుకు చూడడం  లేదు. ఈ పరిస్థితి మారాలి.

నటీమణులకు వివాహానంతరం హీరోయిన్  అవకాశాలు ఇవ్వాలి. పెళ్లైన నటీమణులను ప్రేక్షకులు కథానాయికలుగా ఆదరించరనేది ఒక అపోహ మాత్రమే. ఇదీ నటి కాజల్‌ అగర్వాల్‌ మనోగతం. ఇంతకీ మూడు పదుల వయసు దాటిన ఈ అమ్మడికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదా? అన్నది సినీ వర్గాల ప్రశ్న. దీనికి కాజల్‌కు మళ్లీ కోపం వస్తుందేమో. విషయం ఏమిటంటే ఈ భామ చెల్లెలు నిషా అగర్వాల్‌ పెళ్లి చేసుకుని సంసార జీవితంలో ఎప్పుడో సెటిల్‌ అయిపోయింది. మరి కాజల్‌ వివాహం ఎప్పుడో మరి?

Advertisement
Advertisement