ఈ సినిమా అందరికీ ఓ సమాధానం! | Sakshi
Sakshi News home page

ఈ సినిమా అందరికీ ఓ సమాధానం!

Published Sat, Oct 31 2015 10:35 PM

ఈ సినిమా అందరికీ ఓ సమాధానం!

‘‘నేను ఇటీవలే ‘సరైనోడు’ అనే టైటిల్ రిజిస్టర్ చేశాను. ‘వీడు మాములోడు కాదు’ అనే టైటిల్‌ను పెట్టి కోన వెంకట్‌ను హీరోగా పెట్టి తీద్దామనుకుంటున్నా. కోన వెంకట్ కు ఏదైనా చేయగల సత్తా ఉంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా చూడాలనిపించేలా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా పతాకంపై నిఖిల్, నందిత జంటగా అంజలి ముఖ్యపాత్రలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించి, తొలి సీడీని కథానాయిక సమంతకు అందించారు.

ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ- ‘‘కోన వెంకట్ నా శ్రేయోభిలాషి. ఏది చేసినా కొత్తగా ట్రై చేస్తాడు. ‘శంకరా భరణం’ టైటిల్ పెట్టి, తుపాకీలు, బీహార్ బ్యాక్‌డ్రాప్ అనగానే చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘కోన వెంకట్‌గారు ఇక్కడ నేను కెరీర్ స్టార్ చేసినప్పట్నుంచీ తెలుసు. సాంగ్స్‌లో మంచి కిక్ ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని సమంత అన్నారు.

 కోన వెంకట్ మాట్లాడుతూ- ‘‘ఈ రోజు చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ముందు పవన్‌కల్యాణ్‌గారి నుంచి మొదలుపెట్టాలి. తర్వాత సమంత గారికి చెప్పాలి. ‘శంకరాభరణం’ తర్వాత  అంజలికి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. నందిత తన పాత్రలో జీవించింది. ఈ సినిమా బాగా రావడానికి కారణం కెమేరామ్యాన్ సాయిశ్రీరామ్. చాలామంది ఇది కాపీ సినిమా అంటున్నారు. ‘ఫస్ గయే రే ఒబామా’ అనే హిందీ సినిమా దక్షిణాది రైట్స్ తీసుకుని, ఆ కథాంశం స్ఫూర్తితో ఓ లైన్ తీసుకుని ఈ ఫిల్మ్ చేశాం. అక్కడి రాజకీయ నాయకులకు కిడ్నాపింగ్ సైడ్ బిజినెస్. వాళ్ల పేర్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఇక్కడి ప్రేక్షకులకి కొత్తగా ఉంటుంది. బాలీవుడ్ తరహా సినిమాలు ఇక్కడ రావడం లేదనే వారందరికీ ఈ సినిమానే సమాధానం’’ అని చెప్పారు. దర్శకులు కె.విశ్వనాథ్, శ్రీవాస్, బాబీ, మారుతి, నిఖిల్, నందిత, రావురమేశ్, దీక్షాపంత్, తమన్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement