రైట్ యాక్షన్?! | Sakshi
Sakshi News home page

రైట్ యాక్షన్?!

Published Tue, Sep 20 2016 12:28 AM

రైట్ యాక్షన్?! - Sakshi

సినిమా సూపర్ డూపర్ హిట్. హీరో ఏం చేశాడ్రా.. అభిమానులు సంబరపడిపోయారు. డెరైక్టర్ ఏం తీశాడ్రా... ఓవరాల్‌గా ఆడియన్స్ అభినందించేశారు. ప్రొడ్యూసర్ బాగానే ఖర్చు పెట్టాడబ్బా.. బొమ్మ రిచ్‌గా ఉంది.. సినీ లవర్స్ అందరూ ప్రశంసించేశారు. హిట్ తాలూకు క్రెడిట్ ముందు హీరోకీ.. ఆ తర్వాత దర్శకుడికీ.. తీసిన నిర్మాతకీ దక్కేసింది. మరి.. రాసిన రచయితకు? అందుకేనేమో కొంతమంది రైటర్లు డెరైక్టర్లు అవుతున్నారు.. యాక్షన్ చెబుతున్నారు.
 
‘సినిమా రచయితలు ఇప్పుడు చాలా అరుదైన మొక్కల్లాంటివాళ్లు. వాళ్లను కాపాడుకోవాలి’ ఇది ఓ దర్శకుడు అన్న మాట. ‘ఫలానా సినిమాకు దర్శకుడెవరో అందరికీ తెలుస్తుంది. కాని డైలాగులు ఎవరు రాశారో ఎవరికీ తెలియడం లేదు?’ ఇది ఒక రచయిత నిరసన. ఈ రెండు స్టేట్‌మెంట్లు తెలుగు సినిమా రచనారంగపు వర్తమాన స్థితికి అద్దం పడుతున్నాయి. ‘రెండు సినిమాలు రాయి. ఆ తర్వాత డెరైక్టర్‌గా స్థిరపడు’... అనే సూత్రాన్ని ప్రస్తుత తెలుగు సినిమా రచయితలు పాటిస్తున్నారు.

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస విజయాల తర్వాత ఇటీవలి కాలంలో కొరటాల శివ, బాబీ, అనిల్ రావిపూడి తదితరులు దర్శకులుగా మారడం, మరికొందరు మారుతుండటంతో వర్థమాన రచయితలు వీరిని మోడల్‌గా తీసుకొని పెన్ను పక్కన పెట్టి మెగాఫోన్ చేతపట్టేందుకు ఉత్సాహపడుతుండటం వల్ల ప్రస్తుతం రచయితల కొరత ఏర్పడుతోంది. మరోవైపు రచయితలుగా కొనసాగాలని ఉన్నా గుర్తింపు పట్ల అసంతృప్తితో, అవమానాల పట్ల ఏహ్యతతో దీని కంటే దర్శకుడిగా ఉండటమే మేలు అనుకోవడం వల్ల కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ రచయితలు లేక దిక్కులు చూస్తూ ఉంది.
 
కథ- మాటలు... రేటెంత?
గొప్ప కథ దొరికితే చిరంజీవి 150వ సినిమాకి కోటి రూపాయలు కూడా ఇవ్వొచ్చు, తప్పు లేదని రామ్‌చరణ్ ఒక సందర్భంలో అన్నారు. 150వ సినిమాకే అంత పారితోషికం ఎందుకు ఇవ్వాలి...? ఏ పెద్ద సినిమాకి అయినా ఒక మంచి కథకు కోటి రూపాయలు ఎందుకు ఇవ్వకూడదు? అనేది కొందరి ప్రశ్న. నలభై యాభై  కోట్ల బడ్జెట్‌తో ఒక పెద్ద సినిమా తీస్తున్నప్పుడు కోటి రూపాయలు రచయితకు ఇవ్వకూడదా? అనే ప్రశ్నకు ఇవ్వకూడదని చాలా మంది నిర్మాతలు సమాధానం చెప్తారు. దీని వల్ల ఎంత కష్టపడి ఎంత బాగా రాసినా ఓ మోస్తరు పేరున్న రచయితకు ఐదు నుంచి పది లక్షలు కూడా దక్కడం లేదన్నది ఒక చేదు వాస్తవం.

మహా మహా కొమ్ములు తిరిగిన రచయితలు ఖాళీగా ఉండటం ఎందుకులే?  అని ఐదు లక్షలకు ఒక స్క్రిప్ట్ అందిస్తుంటే కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చిన రచయితలు ఎంత మంచి కథ రాసినా పది ఇరవై లక్షలు అడగడానికి జంకుతున్నారు. ఒకవేళ అడిగినా పెద్ద రచయితలను చూపించి వారికే అంతివ్వడం లేదని నిర్మాతలు చెబుతున్నారు.
 
25 వేలు... 50 వేలు... 2 లక్షలు...
ఇండస్ట్రీలో రచయితల పారితోషికాలు ఎంతో డిమాండ్ ఉంటే తప్ప పెరగవు. సూపర్ హిట్ సినిమా ఇచ్చిన రచయిత మాత్రమే తను ఒక అంకె చెప్పి రాబట్టుకోగలడు. మిగిలినవా రికి అది దుస్సాధ్యం. ‘ఒక పెద్ద నిర్మాత నన్ను తన సినిమాకు ఒక వెర్షన్ రాయమన్నారు. 25 వేలు అడ్వాన్సు... పూర్తయ్యాక మరో ఇరవై అయిదు వేలు ఇస్తామన్నారు’ అని ఒక రచయిత తెలియచేశాడు. సాధారణంగా ఇప్పుడు చాలా మంది వర్థమాన రచయితలకు అడ్వాన్సుగా మహా అయితే లక్ష, స్క్రిప్ట్ పూర్తయ్యాక మరో లక్ష ఇస్తున్నారు. ఇందుకు ఆరునెలలు సినిమాతో పాటు ట్రావెల్ చేయాల్సి వస్తోంది. అంటే నెలకు ముప్పై వేల జీతం కూడా గిట్టుబాటు కావడం లేదన్న మాట.
 
డెరైక్టర్ల పారితోషికం...
సినిమా అనేది డెరైక్టర్ మీడియానే అయినా అది పుట్టేది కాగితం మీదే. రచయిత దానిని పేపర్ మీద రాయాలి. సింగిల్ లైన్, ట్రీట్‌మెంట్, డైలాగ్ వెర్షన్, అడిషనల్ డైలాగ్స్, లొకేషన్ ఇంప్రవైజేషన్... ఇవన్నీ ఒక సినిమా కోసం రచయిత చేసి పెట్టాల్సిన పనులు. ఒక సినిమాకు ఒక రచయిత అని కట్టుబడితే ఇది చాలా పెద్ద పనే. దీనికి వస్తున్న పారితోషికం మాత్రం చిన్నది. మరోవైపు దర్శకుడు కోటి రూపాయల నుంచి ఎనిమిది కోట్లు మరీ పెద్ద దర్శకుడైతే పదిహేను కోట్ల వరకూ తీసుకునే పరిస్థితి ఇండస్ట్రీలో ఉంది. మనం రాసిన దానిని తీసి అతను అంత సంపాదిస్తే మనమే తీసుకుని అంత డబ్బు సంపాదించవచ్చు కదా అనేది రచయితలకు దర్శకులుగా మారడానికి ఊతంగా పని చేస్తోంది.
 
సృజనాత్మక విభేదాలు...
రచయిత ఊహించినది లేదా రాసినది తెర మీద వేరేగా కనిపించినా తాను ఆశించినట్టుగా కనిపించకపోయినా రచయిత తీవ్ర అసంతృప్తికి లోనవడం సహజం. నా స్క్రిప్ట్‌ను నేను డెరైక్ట్ చేసుకుంటే ఈ బాధ ఉండేది కాదనుకునే అవకాశం ఉంది. ‘కొందరు డెరైక్టర్లు రచయితకు ఎక్కడ పేరొస్తుందో అని డైలాగును డల్ చేస్తారు. లేదా సీన్‌నే షార్ట్ చేస్తారు. ఇది మాకు చేస్తున్న అన్యాయమే’ అని ఒక పేరున్న రచయిత వాపోయారు. ఆడియో ఫంక్షన్లలో వేదిక మీదకు పిలవకపోవడం, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, టైటిల్స్‌లో అన్యాయం ఇవ్వన్నీ రచయితలను నిస్పృహకు గురి చేస్తున్నాయి.
 
ఏం చేయాలి?
రచయితలను విశ్వాసంలోకి తీసుకోవడం, ఒక సినిమాకు ఇద్దరు ముగ్గురిచే రాయించాలనుకున్నా ఆ సంగతి పారదర్శకంగా ఉంచి పని చేయించుకోవడం, పని- పని రోజులను బట్టి న్యాయమైన పారితోషికం ఇవ్వడం, క్రెడిట్స్‌లో గౌరవపూర్వకమైన భాగం ఇవ్వడం, ప్రమోషన్‌లో రచయితలను భాగం చేయడం, అన్నింటి కంటే మించి సినిమా అనేది అందరి కష్టంతో తయారయ్యే ప్రాడక్ట్ అని ప్రేక్షకులకు తెలియచేసేలా టెక్నిషియన్లను ప్రమోట్ చేయడం ఈ పరిస్థితికి కనీసం ఉపశమనం కావచ్చు.
- సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
మొత్తం మీరే చేశారు... ఇప్పటికీ నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది నాన్నా             
- బొమ్మరిల్లు

‘బొమ్మరిల్లు’ మాత్రమే కాదు.. ఊపిరి, క్షణం వంటి పలు హిట్ సినిమాలకు డైలాగులతో ప్రాణం పోసిన అబ్బూరి రవి ఏమంటున్నారంటే... ‘ప్రేక్షకుడు ఓ సినిమా చూస్తున్నప్పుడు ఈ డైలాగ్ బాగుంది. రాసిందెవరు? అనడిగితే మన ప్రతిభకు తగిన ప్రతిఫలం దక్కినట్లే. ఇక్కడ ఎవరూ ఎవర్నీ ఆపలేరు. ఎవరూ ఎవర్నీ దాచలేరు. ఎదుటి వ్యక్తి మనకు గుర్తింపు ఇస్తున్నారా? లేదా? అని ఆలోచిస్తే డిజప్పాయింట్ అవుతారు. ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో నాకు లభించిన గుర్తింపుకి హ్యాపీగా ఉన్నాను. వచ్చే ఏడాది దర్శకుడిగా మారబోతున్నా. ఎవరికో ఏదో చూపించాలని కాదు. నా కోసమే నేను దర్శకుడిగా మారుతున్నా.
-  అబ్బూరి రవి
 
కట్టప్పా... వీళ్ల తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగేయ్       
- బాహుబలి
‘బాహుబలి’ సినిమాకు మంచి పేరొచ్చింది. మరి, డైలాగ్ రైటర్స్ సీహెచ్ విజయ్‌కుమార్, అజయ్‌కుమార్‌లకు సక్సెస్ క్రెడిట్ దక్కిందా? వారి మాటల్లోనే.. ‘ప్రేక్షకులకు మేము తెలియదంతే. పబ్లిసిటీ కూడా చేసుకోలేదు. శ్రమ దోపీడి అనేది ప్రతి రంగంలోనూ ఉంటుంది. కొందరి రచయితల శ్రమను దోచుకున్నారేమో? మా (బాహుబలి) దర్శక-నిర్మాతలు చాలా మర్యాదగా చూసుకున్నారు. రచయితలు దర్శకులుగా మారడం వెనుక ఎవరి అభిప్రాయలు వారివి. ఇక్కడ చెప్పేదేంటంటే నన్ను నేను నిరూపించుకోవడానికే ఇండస్ట్రీకి వచ్చాను. ఎవరో గుర్తింపు ఇస్తారని ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా నువ్వేంటో నిరూపించుకో అనేది నా సిద్ధాంతం. త్వరలో హీరోగా, దర్శకుడిగా మారబోతున్నాను.
- అజయ్‌కుమార్

‘రాజమౌళిగారు అవకాశం ఇచ్చినప్పుడు నేను రాయగలనా? లేదా? అని సందేహపడుతుంటే.. ఆయనే ప్రోత్సహించారు. 17 ఏళ్ల నుంచి ఆయనతో పరిచయముంది. నాకు కోలీవుడ్, శాండిల్‌వుడ్‌ల నుంచి భారీ బడ్జెట్ మూవీ అవకాశాలు వస్తున్నాయంటే కారణం ‘బాహుబలి’ మూవీనే. తమ శ్రమకు తగిన గుర్తింపు రాలేదని బాధపడేవాళ్లు వాళ్ల ప్రయత్నాల్లో లోపం ఉందేమో చూసుకుంటే మంచిది’     
- సీహెచ్ విజయ్‌కుమార్

 
నువ్వొక వెర్షన్... నేనొక వెర్షన్!

తెలుగు సినిమాల్లో రచయితల మధ్య ఐకమత్యం లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమా? ఒకే రచయితకు ఎక్కువ పారితోషికం ఇచ్చి స్క్రిప్ట్ రాయించుకుని అది నచ్చక భంగపడటం కంటే ఎక్కువ మంది రచయితలకు తక్కువ పారితోషికం ఇచ్చి ఎక్కువ వెర్షన్‌లు రాయించుకుని వాటన్నింటి నుంచి సినిమాను రాబట్టుకోవడం మేలు అనే ధోరణి సినిమాల్లో బలపడింది. ఇది కొన్నిసార్లు ఉపయోగపడినా ఇదే సినిమాను వేరొకరు రాస్తున్నారు అన్న భావన రచయితను డీలా పడేస్తుంది.
 
రోలింగ్ టైటిల్స్ రాజకీయం...
దర్శకుడి చెప్పుచేతుల్లో ఉండే సినిమా ఇతరులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా పోయేలా చేయగలదు. దీనికి తార్కాణం టైటిల్స్. ఏ సినిమాకైనా దాని తారాగణం, సాంకేతిక నిపుణులు టైటిల్స్‌లోనే ప్రేక్షకులకు తెలుస్తారు. కొందరు దర్శకులు వేరొకరికి పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఈ టైటిల్స్‌ను జెట్ స్పీడు తో లాగించేస్తున్నారు. దీని వల్ల రచయిత కార్డు అసలు పడిందా లేదా? పడితే ఎవరు రాశారు అనేది తెలిసే లోపే ఆ కార్డు జారుకుని రచయితకు కడుపు మండే లా చేస్తోంది. ఇక మరీ అన్యాయంగా కొందరు దర్శకులు రచయితలను రోలింగ్ టైటిల్స్‌లో పడేస్తున్నారు.
 
కవిగారూ అనే గౌరవం ఏది?

సినిమాల్లో రచయితను కవిగారు అని పిలవడం పూర్వం ఆనవాయితీగా ఉండేది. సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, పింగళి నాగేంద్రరావు, ఆరుద్ర, శ్రీశ్రీ తదితరులంతా సెట్‌లోకి వచ్చిన వెంటనే ‘కవిగారు’ అని గౌరవం పొందేవారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి మహామహులు కూడా సినిమా రచనలో కొండవీటి వెంకటకవి, డి.వి.నరసరాజు, ముళ్లపూడి వెంకటరమణ వంటి వారిని గౌరవించారు. అయితే రైటర్స్‌గా స్టార్ స్టేటస్‌ను అనుభవించినవారిలో జంధ్యాల, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌లను చెప్పుకోవచ్చు. కాని రాను రాను ఈ పరిస్థితి మారింది. 2000 సం॥తర్వాత దర్శకుడే మాటల రచయితగా మారడంతో మాటల రచయితకు ఒక ఉనికి లేని పరస్థితి ఏర్పడింది.

తేజ, దశరథ్, శేఖర్ కమ్ముల, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, సుకుమార్ తదితరులు తమ సినిమాల డైలాగులు తామే రాసుకోవడం ట్రెండ్‌గా మారింది. దీని కొనసాగింపుగా శ్రీకాంత్ అడ్డాల, దేవా కట్టా, మోహనకృష్ణ ఇంద్రగంటి, తాజాగా అవసరాల శ్రీనివాస్ వంటి వారు తమ సినిమాలకు తామే డైలాగులు రాసుకుంటున్నారు. దీని వల్ల రాసుకునే దర్శకుడు ఉంటే రచయితగా ఎవరైనా పర్వాలేదు అనే భావం ఏర్పడింది.
 
‘రెడీ’, ‘కింగ్’, ‘నమో వెంకటేశ’, ‘దూకుడు’, ‘బాద్‌షా’ వంటి పలు హిట్ సినిమాలకు గోపీమోహన్ కథ అందించారు. కోన వెంకట్‌తో కలసి పలు సినిమాలకు పనిచేశారు. ‘సరైనోడు’ కథా చర్చల్లో పాలు పంచుకున్నారు. ఆయన ఏమంటారంటే...
‘దర్శకుడు-రచయిత మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మీద పని చేస్తుంటారు. నాకు ఇప్పటివరకూ ఏ ఇబ్బందీ ఎదురు కాలేదు. నిజానికి.. దర్శకుణ్ణి కావాలని ఇండస్ట్రీకి వచ్చా. యాధృశ్చికంగా రైటర్‌నయ్యా. డైలాగ్ రైటర్స్‌కి కాస్త ఎక్కువ అవకాశాలుంటాయి. స్టోరీ రైటర్స్‌కి తక్కువే. కమర్షియల్ దర్శకులు మాత్రమే స్టోరీ రైటర్స్ నుంచి కథలు తీసుకుంటున్నారు. త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల.. మెజారిటీ అగ్ర దర్శకుల్లో చాలా మంది తమ కథలను తామే రాసుకుంటున్నారు. నా క్రియేటివ్ థాట్స్‌ను ఆవిష్కరించాలని దర్శకుణ్ణి అవుతున్నా’.
- గోపీమోహన్
 
ఊసరవెల్లి, కిక్, ఎవడు, టెంపర్, రేసుగుర్రం తదితర చిత్రాలకు రచయితగా చేసిన వక్కంతం వంశీ ఏమంటున్నారంటే... ‘కథతో సినిమా పూర్తయ్యాక సినిమాకు సంబంధించి అనేక ప్రెస్‌మీట్‌లు, ఆడియో ఫంక్షన్‌లు జరుగుతుంటాయి. హీరో ఎవరో, దర్శకుడెవరో, సంగీత దర్శకుడెవరో అందరికీ తెలుస్తుంది. ఒక్క రచయిత తప్ప. ‘ఆడియో ఫంక్షన్‌లో నీ పేరు చెప్పటం మర్చిపోయాను. సారీ’ అంటారు. ఓ నవ్వు నవ్వి ఊరుకొంటాం. ఈలోపు సినిమా రిలీజు అవుతుంది. చూస్తే సగం కథ మనది ఉండదు. ఇదేంటని అడిగితే హీరో ఇలాగే కావాలన్నాడంటారు. సినిమా హిట్ అయితే  హీరో దగ్గర కథ అంతా నాదే.. ఏదో మొదటి నుండి మనతో తిరుగుతున్నాడు కదా అని క్రెడిట్ ఇచ్చాం అంటారు సదరు డెరైక్టర్. అందరికీ ఇవే రీజన్స్ అని నేను అనను. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఏది ఏమైనా మన వర్క్ గురించి నలుగురు మాట్లాడాలి అనుకొంటున్నాను. అందుకే, అతి త్వరలో మెగా ఫోన్ పట్టుకొంటున్నాను.           
- వక్కంతం వంశీ

Advertisement
Advertisement