ప్రేక్షకుల వేలు విడవని నటుడు | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల వేలు విడవని నటుడు

Published Wed, Aug 6 2014 11:20 PM

ప్రేక్షకుల వేలు విడవని నటుడు

సందర్భం: ‘సుత్తివేలు’ జయంతి
ఒక పాత్ర, ఒక మేనరిజమ్ ద్వారా ఒక నటుడి పేరే మారిపోవడం, చరిత్రలో ఆ పేరుతోనే మిగిలిపోవడం చాలా చిత్రమైన విషయం. సినీ చరిత్రలో అలాంటి అదృష్టం దక్కిన అరుదైన కొందరు నటుల్లో సుత్తివేలు ఒకరు. కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు అనే అసలు పేరుతో ఆయన తెలిసింది చాలా కొద్దిమందికే. ‘వేలెడంత లేవు? ఏమిటీ అల్లరి?’ అంటూ చిన్నప్పుడు చుట్టుపక్కలవాళ్ళు పిలవడంతో ‘వేలు’ అనే ముద్దుపేరుతోనే ప్రసిద్ధుడైన బక్కపల్చటి మనిషి ఆయన. అయితే, ఆకారానికి ఆంగికాభినయ ప్రతిభ తోడై, దర్శక - రచయిత జంధ్యాల ‘నాలుగు స్థంభాలాట’లోని పాపులర్ ఊతపదం ‘సుత్తి’తో ఆయన క్రమంగా ‘సుత్తి’వేలుగా జనంలో స్థిరపడ్డారు. తోటి నటుడు ‘సుత్తి’ వీరభద్రరావుతో కలసి ‘సుత్తి’ జంటగా 1980 - ‘90లలో సినీసీమను కొన్నేళ్ళు ఏలారు.
 
కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరలోని భోగిరెడ్డిపల్లెలో 1947 ఆగస్టు 7న పుట్టిన సుత్తివేలు నటనలో అంత సద్యస్ఫూర్తి, సహజత్వం పలకడానికి కారణం - రంగస్థల అనుభవమే. చదువుకొనే రోజుల నుంచి వేసిన నాటకాలు ఆయనకు పేరు తెచ్చాయి. చిన్నతనమంతా మచిలీపట్నంలో గడిపిన ఆయన నాటకాల దెబ్బకు చదువు అటకెక్కి, ఎలాగోలా మెట్రిక్ అయిందనిపించి, హైదరాబాద్, బాపట్ల సహా ఎన్నోచోట్ల ఎన్నెన్నో చిరుద్యోగాల తరువాత ఆఖరుకు విశాఖపట్నం ‘నావల్ డాక్ యార్డ్’లో స్టోర్ కీపర్‌గా తేలారు. ‘మనిషి నూతిలో పడితే’ నాటకంలోని అభినయ ప్రతిభ దర్శకుడు జంధ్యాల ద్వారా తొలి సినీ అవకాశమూ ఇప్పించింది. అలా ‘ముద్దమందారం’గా మొదలైన ప్రస్థానం ‘నాలుగు స్థంభాలాట’ నాటి ‘సుత్తి’తో జోరందుకుంది.
 
కొన్ని పదుల చిత్రాల్లో ‘సుత్తి’ జంట ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తితే, మరెన్నో చిత్రాల్లో వేలు - నటి శ్రీలక్ష్మి కాంబినేషన్ సూపర్‌హిట్టయింది. ‘‘అనుక్షణం వీరభద్రరావు వెన్నంటి ఉంటూ, పరిశీలించడం ద్వారా ఎంతో నేర్చుకున్నా’’ అని వేలే అంగీకరించారు. వీరభద్రరావు అందించిన సలహాలు, సూచనలు తనకెంతో ఉపకరించాయని అప్పట్లోనే చెప్పిన వేలు, తమ కాంబినేషన్ సన్నివేశాలు పండడం కోసం ఇద్దరం కలిసే డబ్బింగ్ చెప్పేవాళ్ళమని వెల్లడించారు. అప్పట్లో ‘నాలుగుస్థంభాలాట’లోని వారి డైలాగులు క్యాసెట్‌గా వచ్చి, బాగా అమ్ముడయ్యాయి.

కానీ, వేలును హాస్యానికే పరిమితం చేసి చూడడం ఆయనలోని నటుణ్ణి అవమానించడమే అవుతుంది. కావాలంటే, ‘ప్రతిఘటన’లోని పిచ్చివాడైన కానిస్టేబుల్ పాత్ర చూడండి. ‘వందేమాతరం’లోని ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అందించిన పాత్రను గమనించండి. 1980లలో జనాన్ని ఆలోచనల్లోకి నెట్టిన ‘ఈ పిల్లకు పెళ్ళవుతుందా?’, ‘ఈ చదువులు మాకొద్దు’ లాంటి సినిమాలు ఏ టీవీలోనో వస్తే ఇంకొక్కసారి పరిశీలించండి. ‘కలికాలం’లో మధ్యతరగతి తాతయ్య పాత్రను పరికించండి. ‘ఒసేయ్ రాములమ్మ’లో రాములమ్మ తండ్రి పాత్రను మరోసారి చూడండి. క్యారెక్టర్ నటుడిగా ఆయనలోని వైవిధ్యం అర్థమవుతుంది. కరుణరసాన్ని కూడా కంటి చూపులతోనే ఆయన ఎలా పలికించేవాడో అనుభవంలోకి వస్తుంది.
 
గుండె గదుల్లో వేదాంతం, ఒకింత విషాదం, జీవిత విచారం గూడుకట్టుకున్నవారే హాస్యాన్ని అలవోకగా పలికించగలరనడానికి సుత్తివేలు మరో ఉదాహరణ. వీరభద్రరావు మరణం (1988), ఆ తరువాత జంధ్యాల జోరు తగ్గడం, చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మారడంతో క్రమంగా వెనుకబడ్డ వేలు ఆ తరువాత మునుపటి ప్రాభవాన్ని సంపాదించడానికి చాలానే కష్టపడ్డారు. కానీ, మళ్ళీ ఆ వెలుగు రాలేదు. తొలి రోజుల్లో దూరదర్శన్‌లో ‘ఆనందోబ్రహ్మ’లో వెలిగిన వేలు చరమాంకంలో భార్య, ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయితో సంసారాన్ని ఈదడం కోసం టీవీ సీరియల్స్‌ను ఆశ్రయించారు.

2012 సెప్టెంబర్ 16న తన 66వ ఏట కన్నుమూసే దాకా పాత్రల కోసం ఆయన జీవన పోరాటం ఆగలేదు. ఆంగ్ల రచయిత షేక్‌స్పియర్ అంటే అభిమానం, మద్రాసులో ఆంతరంగికులతో ఏ సాయంత్రమో కలిసినప్పుడు రాగయుక్తంగా పద్యాలు, పాటల గానం, ఆగని ఛలోక్తుల జడివానతో సందర్భాన్ని రసభరితం చేయడం వేలు ప్రత్యేకత. ఇవాళ్టికీ ‘రెండు జెళ్ళ సీత’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘ఆనందభైరవి’, ‘రెండు రెళ్ళు ఆరు’, ‘సీతారామ కల్యాణం’, ‘చంటబ్బాయ్’ లాంటి సినిమాలు చూస్తే, తెలుగు తెరను ఆయన చిరస్మరణీయం చేసిన ఘట్టాలెన్నో కనిపిస్తాయి. ఆ సన్నివేశాల్లో ఇవాళ్టికీ ఆయన ప్రేక్షకుల వేలు విడవని అభినయ చిరంజీవే!

Advertisement
Advertisement