చల్లపేట చిన్నోడు.. సినిమా యాక్టరయ్యాడు | Sakshi
Sakshi News home page

చల్లపేట చిన్నోడు.. సినిమా యాక్టరయ్యాడు

Published Fri, Aug 14 2015 11:00 AM

హీరోయిన్ అవికా గౌర్ తో సంతోష్ - Sakshi

‘సినిమా చూపిస్త మావ’ చిత్రంలో అవకాశం
వెండి, బుల్లి తెరలపై రాణిస్తున్న సంతోష్


మెంటాడ : సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు. ఆర్థిక సమస్యలతో చదువుకు మధ్యలో స్వస్తి పలికాడు. హోటల్ రూమ్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నప్చడు వేసిన నాటకాల అనుభవం సినిమా రంగం వైపు పురిగొలిపింది. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే అవకాశాలు వాటంతటవే వస్తాయి. ఆ యువకుడి విషయంలోనూ అదే జరిగింది. వరుసగా 10 సినిమాల్లో అవకాశం లభించింది. టీవీ చానళ్ల వినోద కార్యక్రమాలతో ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. ఆ యువకుడు మెంటాడ మండలం చల్లపేటకు చెందిన లోకారపు సంతోష్. ఇటీవల విడుదలైన ‘సినిమా చూపిస్త మావ’ చిత్రంలో హీరో స్నేహితుడిగా కూడా నటించాడు.

ఆ ప్రశంస స్ఫూర్తినిచ్చింది
డిగ్రీ వరకూ చదువుకున్న సంతోష్ ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువుకు వెళ్లలేదు. కుటుంబానికి అండగా నిలవాలని విశాఖలోని ఒక ప్రైవేటు హోటల్లో రూం బాయ్గా చేరాడు. అందులో బస చేసేందుకు వచ్చే నటులు, దర్శకులు, నిర్మాతలతో పరిచయం పెంచుకున్నాడు. ఒకరోజు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సంతోష్ను చూసి అచ్చం నాగ చైతన్యలా ఉన్నావని అభినందించడంతో ఉప్పొంగిపోయాడు. చిన్నతనంలో పండగలు, ఉత్సవాల సమయంలో చిన్న చిన్న నాటకాలు వేసిన అనుభవంతో సినిమా రంగంవైపు అడుగులు వేశారు.

తొలిసారి 2007లో ‘నా అనేవాడు’ అనే చిత్రంలో చిన్న అవకాశం సంపాదించాడు. ఇప్పటివరకూ సుమారు 10 సినిమాల్లో నటించారు. ఈ సమయంలోనే ఒక టీవీ చానల్లో ప్రసారమవుతున్న కార్యక్రమంతో సంతోష్కు గుర్తింపు వచ్చింది. అలీ 369, గెట్ రెడీ, అలీ టాకీస్, భలే ఛాన్సులే, క్యాష్ ఎపిసోడ్లలో కూడా నటించారు. వీటితో పాటు ‘అలా మొదలైంది, గంగతో రాంబాబు, శ్రావణీ సుబ్రహ్మణ్యం’ తదితర సీరియల్స్లో కూడా నటించాడు. తాజాగా రాజ్ తరుణ్, అవికాగౌర్ జంటగా నటించిన ‘సినిమా చూపిస్త మావ’ చిత్రంలో హీరో స్నేహితుడిగా నటించాడు. ఆ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని జిల్లా ప్రజలు చూసి తనను ఆశీర్వదించాలని కోరాడు.

Advertisement
Advertisement