Sakshi News home page

రేపే 'మా'ఎన్నికలు

Published Sat, Mar 28 2015 9:14 PM

జయసుధ - రాజేంద్ర ప్రసాద్

హైదరాబాద్: ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ నెల 29వ తేదీ ఆదివారం జరుగనున్నాయి. ఈ ఎన్నికలలో పోటీ చేసేవారు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో విమర్శలకు దిగారు. అధ్యక్ష పదవికి సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ  పోటీ చేస్తున్నారు. మరికొన్ని ఇతర స్థానాలకు వారి వారి ప్యానల్స్ తరపున ఇతరులు పోటీపడుతున్నారు. ఈ అసోయియేన్ ఎన్నికలు  రెండేళ్లకోసారి జరుగుతాయి.

ప్రస్తుతం ‘మా’ కోశాధికారిగా ఉన్న శివాజీరాజా ఈసారి ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేసి, ఆ తరువాత పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం కార్యవర్గ  సభ్యుడిగా ఉన్న నటుడు ఉత్తేజ్ జాయింట్ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగారు. తీరా ఇప్పుడు విచిత్రంగా ‘వ్యక్తిగత కారణాల రీత్యా’ అంటూ ఉత్తేజ్ పక్కకు తప్పుకొన్నారు.  ఏకాభిప్రాయంతో ఎవరో ఒక్కరే పోటీలో ఉంటారంటేనే ఉద్దేశంతో నామినేషన్ వేశానని, ఇప్పుడు మాట మార్చి, అవతలి వైపు నుంచి నటుడు అలీని ప్రత్యర్థిగా నిలబెట్టారని శివాజీరాజా పేర్కొన్నారు. ఈ రాజకీయం నచ్చకనే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.  రాజేంద్రప్రసాద్‌  ప్యానెల్‌కు  సీనియర్ నటుడు, నిర్మాత నాగబాబు  మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. జయసుధ ప్యానల్కు  ఆరు పర్యాయాలు అంటే 12 ఏళ్ల పాటు ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న మురళీమోహన్ మద్దతు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే, అసోసియేషన్లో, ఈ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, ఎన్నికలు నిలిపివేయాలని  నటుడు ఓ.కల్యాణ్ గురువారం  సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కల్యాణ్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు విన్నది. అనంతరం ఎన్నికల నిర్వహణకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఓట్లను లెక్కించరాదని, ఎన్నికల ఫలితాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికలు రేపు జరుగనున్నాయి.

Advertisement
Advertisement