టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ... | Sakshi
Sakshi News home page

టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ...

Published Sun, Dec 8 2013 2:17 AM

టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ...

 ప్లస్ పాయింట్స్
  క్రమశిక్షణ   వృత్తిపట్ల విపరీతమైన డెడికేషన్
  అందాల ప్రదర్శనతో పాటు అభినయానికి పాధాన్యమివ్వడం
 
 మైనస్ పాయింట్స్
  తెలుగులో అగ్రతారగా ఎదిగినా కూడా అస్సలు తెలుగు భాష నేర్చుకునే ప్రయత్నం చేయకపోవడం
  సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండడం
 
 
 టాప్ 5 మూవీస్
  వర్షం   నువ్వొస్తానంటే నేనొద్దొంటానా 
  అతడు  ఆడవారి మాటలకు అర్థాలు వేరులే  కృష్ణ
 
 ‘జోడి’ సినిమాలో కథానాయిక సిమ్రాన్ స్నేహితురాలిగా ఓ బక్క పలుచటి అమ్మాయి చేసింది. పేరు త్రిష. గొప్ప అందగత్తె కాదు కానీ, కళ్లల్లో... ముఖ్యంగా నవ్వులో ఏదో గ్రేస్. నటనలో ఈజ్. కట్ చేస్తే... ‘మౌనమ్ పేసియాదె’ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా ఆఫర్. ఆ తర్వాత నాలుగైదు తమిళ సినిమాల్లో అవకాశాలు. 2003... త్రిష జీవితాన్ని మలుపు తప్పింది. ప్రముఖ నిర్మాత ఏయమ్ రత్నం పెద్దకొడుకు ఏయమ్ జ్యోతికృష్ణ తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ‘నీ మనసు నాకు తెలుసు’ మొదలుపెట్టాడు. తరుణ్ హీరో. ఇద్దరు హీరోయిన్లు కావాలి. శ్రీయ ఓకే. ఇంకొకరు ఎవరు? ఎవరెవర్నో అనుకుని ఫైనల్‌గా త్రిష దగ్గరకొచ్చారు. అదే త్రిష తొలి తెలుగు సినిమా. 2003 డిసెంబర్ 6న రిలీజైంది. పదేళ్లపాటు తెలుగు ఇండస్ట్రీని ఏలతానని త్రిష ఆ రోజు అనుకుని ఉండదు. 
 
 నిర్మాత ఎమ్మెస్ రాజు, ప్రభాస్ హీరోగా ‘వర్షం’ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో హీరోయిన్ పాత్ర చాలా ఇంపార్టెంట్. గ్లామర్ కన్నా పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్. రకరకాల ఆప్షన్లు. ఎవ్వరూ నచ్చడం లేదు. ప్రభాస్‌లాంటి పొడవాటి హీరో పక్కన కొంచెం ఆనాలి కదా. అయితే పొట్టి, లేకపోతే లావు. స్లిమ్‌గా తెలుగింటి అమ్మాయిలా కనపడాలి. ఇదీ ఎమ్మెస్ రాజు ఆప్షన్స్. ఓ సినిమా మేగజైన్‌లో త్రిష ఫొటో చూసీ చూడగానే తనే హీరోయిన్ అని ఎమ్మెస్ రాజు ఫిక్సయిపోయారు. చెన్నై కబురెళ్లింది. అప్పటికే త్రిష రెండు, మూడు తమిళ సినిమాలు కమిట్ అయ్యింది. కొంచెం బిజీనే. కానీ ‘వర్షం’ ప్రాజెక్ట్ ఎట్రాక్టివ్‌గా అనిపించింది. వెంటనే ఓకే అనేసింది. అదే ఆమె కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. 
 
 ‘వర్షం’ లేకపోతే త్రిషకు ఇంత స్టార్‌డమ్ వచ్చేదా? ఏమో... వచ్చేది కాదేమో. ఆ తర్వాత వెంట వెంటనే సూపర్‌హిట్లు. సూపర్ స్టార్‌డమ్. బ్లాంక్ చెక్‌లు. భారీ ఆఫర్లు. ఉత్తమనటిగా అవార్డులు. చిరంజీవి నుంచి నితిన్ వరకూ అందరికీ త్రిష బెస్ట్ చాయిస్ అయిపోయింది. ఒక్క బాలకృష్ణ తప్ప, తెలుగులో దాదాపుగా అందరు హీరోలతోనూ యాక్ట్ చేసింది. తమిళంలోనూ అదే హవా. అక్కడ కూడా అగ్రతాంబూలమే. ఓ దశలో త్రిషే నంబర్‌వన్ హీరోయిన్. నయనతార, ఇలియానా, శ్రీయ, చార్మి... ఇలా ఎంతమంది హీరోయిన్లు పోటీకొచ్చినా త్రిష ప్లేసు మారలేదు. దాదాపుగా ఇప్పుడున్న హీరోయిన్లంతా అర్బన్ కేరక్టర్స్‌కే సెట్ అవుతారు. రూరల్ కేరెక్టర్స్‌కి కరెక్ట్‌గా ఫిట్ కారు. త్రిషతో ఆ సమస్య రాలేదు.
 
  ‘వర్షం’లో కానివ్వండి, ‘నువ్వొస్తానంటే నేనొద్దొంటానా’ కానివ్వండి, ‘అతడు’ కానివ్వండి... ఆ పల్లెటూరి అమాయకత్వాన్ని, సోయగాన్ని లంగా ఓణీల్లో అందంగా ఆవిష్కరించగలిగిందామె. కొన్ని చిలిపి పాత్రలూ అల్లరి పాత్రలకూ త్రిష టైలర్‌మేడ్‌లాగా అనిపిస్తుంది. అలాగని మెట్రో తరహా పాత్రలకు తనేమీ అన్యాయం చేయలేదు. టూ పీస్ బికినీ అయితే వేయలేదు కానీ, చిన్న చిన్న గ్లామర్ డ్రెస్‌లకు అభ్యంతరం చెప్పలేదు.అయితే ఆమె బ్యాడ్‌లక్ ఏంటంటే - తను ఇంతవరకూ అనుష్కలాగా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేయలేకపోయింది. కమర్షియల్ సినిమాల మూసలోనే ఒదిగిపోయింది. కొంచెం ఆ బౌండరీలు దాటి వచ్చి ఉంటే, తనలోని నటికి ఇంకా మంచి అవకాశాలు దక్కేవి.కొత్తనీరు రాగానే పాతనీరు వెళ్లిపోవడం సహజమే. 
 
 అసలు ఇప్పుడు హీరోయిన్ల కెరీర్ లైఫ్ నాలుగైదేళ్లకు మించి ఉండటం లేదు. అలాంటిది త్రిష పదేళ్లు ఉండగలిగింది. నిజం చెప్పాలంటే - త్రిషకు ఇది లాస్ట్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. మునుపటి క్రేజ్ లేదు. తెలుగులో అయితే ఒక్క ఛాన్సూ లేదు. ఆమధ్య ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ‘రమ్’ సినిమా చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. తమిళంలో మాత్రం మూడు ఆఫర్లున్నాయి. అదేం చిత్రమో కానీ, త్రిష మొదట్నుంచీ మీడియాకు దూరమే. అయినా మీడియాలో ఎక్కువ నలుగుతుంటారు. ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గాసిప్ ఏంటంటే - త్రిష ఇప్పుడు ప్రేమలో మునిగి తేలుతున్నారట. అది కూడా ఓ తెలుగు యువనటునితో. వచ్చే ఏడాది త్రిష సినిమాలకు స్వస్తి చెప్పి, పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉందని కొన్ని వెబ్‌సైట్లలో వార్తలొస్తున్నాయి. ఇలాంటి వాటిని త్రిష ఏనాడూ ఖండించలేదు.అదే ఆమె ప్లస్సూ!... మైనస్సూ కూడా!
 

Advertisement

తప్పక చదవండి

Advertisement