అన్ని యాసలూ ఆమెకు సునాయాసమే! | Sakshi
Sakshi News home page

అన్ని యాసలూ ఆమెకు సునాయాసమే!

Published Sat, Jun 14 2014 11:11 PM

అన్ని యాసలూ ఆమెకు సునాయాసమే! - Sakshi

 కళ అనేది ప్రాంతాలకు, భాషలకు అతీతమైంది. అందుకు శకుంతలే ఓ నిదర్శనం. శకుంతల పుట్టింది మహారాష్ట్రలో. కానీ.. ఎదిగింది, ఒదిగింది, ఒరిగింది తెలుగు నేలపైనే. అందుకే... తెలుగు కళారంగానికి దొరికిన ఓ మణిహారంగా ఆమెను అభివర్ణించడం తప్పేం కాదు. తెలుగు రంగస్థలంపై నటనకు ఓనమాలు దిద్దుకున్న శకుంతల... తర్వాత కాలంలో తెలుగు తెరపై మూడున్నర దశాబ్దాల నట ప్రస్థానాన్ని సాగించారు.  తెలంగాణ సాయుధ పోరాటంపై బి.నరసింగరావు నిర్మించిన ‘మాభూమి(1979)’ చిత్రంతో తొలిసారి తెలుగుతెరపై మెరిశారు శకుంతల.
 
 తర్వాత తెలంగాణ నేపథ్యంలోనే రూపొందిన రంగులకల(1983), కొమరంభీమ్(1984) చిత్రాల్లో నటించి ‘తెలంగాణ’ను ఇంటిపేరుగా మార్చుకున్నారు. కానీ.. ఒక్క తెలంగాణ యాస మాత్రమే కాదు, తెలుగు భాషలోని యాసలన్నింటినీ అలవోకగా పలికించగలిగిన దిట్ట శకుంతల. ‘ఒక్కడు’ (2003)లో రాయలసీమ యాసలో మాట్లాడిన ఆమే... కొన్ని చిత్రాల్లో శ్రీకాకుళం యాసతో కూడా భళా అనిపించారు. గోదావరి యాసలోని కమ్మదనాన్ని కూడా తన గళంతో వినిపించారు. అన్ని యాసలూ ఆమెకు సునాయాసమే. శకుంతల ఆహార్యాన్నీ, వాచకాభినయాన్నీ గమనించిన ఎవరూ ఆమె మహారాష్ట్ర మహిళ అంటే నమ్మరు.
 
 కెరీర్ తొలినాళ్లలో శకుంతల చేసినవన్నీ చిన్నా చితకా పాత్రలే. వాటిల్లో జంధ్యాల ‘అహనా పెళ్లంట’(1987) ఒకటి. అందులో కూడా శకుంతల పాత్ర నిడివి రెండు నిమిషాలకు మించి ఉండదు. కానీ... ఇప్పటికీ ఆ పాత్ర జనాలకు గుర్తుండి పోయిందంటే... ఆమె నట సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆవేశపూరితమైన పాత్రలతోనే కాదు, హాస్యంతో కూడా మెప్పించగలనని ఆ సినిమాతో నిరూపించారామె. వెండితెరపై శకుంతలకు తొలి బ్రేక్ కృష్ణవంశీ ‘గులాబి’(1995). ఇక తేజ ‘నువ్వు-నేను’(2001) చిత్రమైతే ఆమెను ఏకంగా స్టార్‌ని చేసేసింది. ఆ సినిమాలో శకుంతల అనితరసాధ్యమైన విలనిజం ప్రదర్శించారు.
 
 ఒక్కడు, వీడే, గంగోత్రి, ఎవడిగోల వాడిది, లక్ష్మి, దేశముదురు, బెండు అప్పారావు ఆర్.ఎం.పి... తదితర హిట్ చిత్రాల్లో నటించి తెలుగుతెరపై తనదైన సంతకాన్ని లిఖించారు శకుంతల. ‘మచ్చకాళై’ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారామె. దాదాపు 80 చిత్రాల్లో నటించిన శకుంతల చివరి సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెద’(2014).
 
 ఈవీవీ ‘ఎవడిగోల వాడిదే’ చిత్రీకరణ సమయంలోనే శకుంతలకు తొలిసారి గుండెపోటు వచ్చింది. ‘ఒక వేళ నేను చనిపోతే... మేకప్‌లో చనిపోయిన అదృష్టం కలిగేది’ అని పలు సందర్భాల్లో చెప్పుకున్నారామె. నటనపై శకుంతలకున్న మమకారానికి ఇదొక గొప్ప నిదర్శనం. హాస్య, భయానక, బీభత్స, రౌద్ర, విషాద రసాల్లోని దేన్నయినా అవలీలగా పలికించగల మంచి నటి శకుంతల దూరమవ్వడం తెలుగుతెరకు నిజంగా తీరని లోటు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement