విక్రమ్ @ 50 | Sakshi
Sakshi News home page

విక్రమ్ @ 50

Published Sun, Apr 17 2016 10:40 PM

విక్రమ్ @ 50

నటుడు విక్రమ్ అనే మూడక్షరాల పేరుకి మూడక్షరాల సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంది. అలాగే 75 ఏళ్ల సినిమా చరిత్రలో దాదాపు 25 ఏళ్లగా విక్రమ్ పేరు వినిపిస్తూనే ఉంది. నటుడు విక్రమ్‌కు సినిమా అంటే ఎనలేని ఫ్యాషన్. అందుకే చదువు పూర్తి కాగానే తొలి రోజుల్లో మోడలింగ్ రంగంలో పని చేసినా ఆ తరువాత ఇది కాదు తన గోల్ అని నిర్ధారించుకుని నటుడిగా ప్రయత్నాలు మొదలెట్టారు.అలా ప్రయత్నాలకే సుధీర్ఘ పయనం చేయాల్సి వచ్చింది. అలాంటి సమయంలో తన గొంతును ఇతర నటులకు అరువు కూడా ఇచ్చారు. అవన్నీ తన లక్ష్య సాధనలో భాగమే. విక్రమ్ శక్తి వంచన లేని కృషికి, శ్రమకు ఫలితం దక్కింది.1990లో ఎన్ కాదల్ కణ్మణి చిత్రం ద్వారా నటుడిగా రంగప్రవేశం చేశారు.

ఆ తరువాత ఒక్కోమెట్టు ఎక్కుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ, వాటిని సద్వినియోగం చేసుకుంటూ అభిమానులు సిమాన్ అనే బిరుదుతో గౌరవించుకునే స్థాయికి చేరారు. నటుడిగా స్వయం కృషితో ఎదిగిన విక్రమ్‌కు నటుడిగా పెద్ద గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం సేతు అనే చెప్పాలి.ఆ తరువాత పితామగన్ చిత్రం జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందించింది. అలా పలు ఫిలింఫేర్ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడు అవార్డు అంటూ విక్రమ్ తమిళసినిమా అనే పుస్తకంలో తనకంటూ కొన్ని పుటల్లో తన పేరును పొందుపరచుకున్నారు. శంకర్ దర్శకత్వంలో అన్నియన్ లాంటి వైవిధ్యభరిత చిత్రం, ఐ వంటి గ్రాండీయర్ చిత్రంలో నటించి నటుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ఇప్పటికీ వైవిధ్యం కోసం తపించే వయసు అయిదు పదులకు చేరుకుంది.

అవును 1966 ఏప్రిల్ 17న పుట్టిన విక్రమ్ ఆదివారం 50వ ఏట అడుగు పెట్టనున్నారు.ఈ 50 ఏళ్లలో విక్రమ్ పాతికేళ్లగా సినీకళామతల్లి సేవలోనే కొనసాగుతున్నారన్నది గమనార్హం. ఇక ఈ 25 ఏళ్లలో నటుడిగా విక్రమ్ అర్ధ సెంచరీ దాటేశారు.ఇందులో తమిళంతో పాటు తెలుగు,మలయాళం,హిందీ అంటూ ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా బహు భాషానటుడిగా ఉన్నత స్థాయిలో నట పయనాన్ని కొనసాగిస్తున్న విక్రమ్ ప్రస్తుతం ఇరుముగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్ అన్నియన్ లాంటి చిత్రాల్లో పలు విభిన్న గెటప్‌ల్లో నటించినా తన కెరీర్‌లో ద్విపాత్రాభినయం చేస్తున్న తొలి చిత్రం ఇరుముగన్ అన్నది గమనార్హం.

అదే విధంగా ఇందులో తొలిసారిగా నయనతార ఆయనతో జత కట్టడం విశేషం.మరో హీరోయిన్‌గా నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్‌శంకర్ దర్శకుడు. విజయ్ నటించిన పులి చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకున్న శిబు తమీన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్ర టీజర్‌ను విక్రమ్ పుట్టిన రోజును పరస్కరించుకుని ఆదివారం విడుదల చేయనున్నారన్నది ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం.

Advertisement

తప్పక చదవండి

Advertisement