ప్రివ్యూ టాక్: 24 సినిమా ఎలా ఉందంటే.. | Sakshi
Sakshi News home page

ప్రివ్యూ టాక్: 24 సినిమా ఎలా ఉందంటే..

Published Thu, May 5 2016 5:36 PM

ప్రివ్యూ టాక్: 24 సినిమా ఎలా ఉందంటే..

తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిట్ట చివరి చిత్రం.. మనం. ఈ సినిమాను అత్యంత ధైర్యంగా తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కుమార్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా చూశాడు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ చాలామంది దీనిగురించి చర్చించుకుంటున్నారు. ఆ సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ నుంచి వచ్చిన మరో చిత్రం.. సూర్య హీరోగా నటించిన '24'. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే బోలెడంత హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ఈ సినిమాను ఆకాశానికెత్తేశాడు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రివ్యూ చూసిన తరణ్.. తన భావావేశాన్ని ఆపుకోలేక ఈ సినిమా గురించి వరుస ట్వీట్లతో మోతెక్కించాడు.

విక్రమ్ తన నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడని, 24 సినిమా సబ్జెక్టును చాలా మేధస్సుతో డీల్ చేశాడని తరణ్ అన్నాడు. ఈసారి మూడు పాత్రలలో నటించిన సూర్య కూడా అవార్డు విన్నింగ్, నాకౌట్ పెర్ఫార్మెన్సు చూపించాడని ప్రశంసించాడు. ముఖ్యంగా చెడ్డవాడైన విరోధి పాత్రలో అదరగొట్టాడని చెప్పాడు. ఈ సినిమాను కేవలం బాగుందని చెప్పలేమని.. ఇందులో ఇంకా చాలా ఉన్నాయని అన్నాడు. ఇంత మంచి సబ్జెక్టును తీసుకున్నందుకు మొత్తం సినిమా టీమ్‌కు అభినందనలు చెప్పాడు. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం, సబ్జెక్టు మీద పట్టు, వాటన్నింటితో పాటు ఆర్థిక దన్ను అన్నీ ఉండాలని తెలిపాడు. టైటిళ్లతో మొదలుపెట్టి ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, తర్వాత 2.40 గంటల పాటు ఒక రోలర్ కోస్టర్‌లో తిరుగుతున్నట్లుగా అద్భుతమైన అనుభూతికి లోనవుతారని తరణ్ అన్నాడు. ఈ సినిమాకు అతిపెద్ద బలం దాని కాన్సెప్టేనని, దానికి తోడు ఇందులో కావల్సినంత వినోదం, ఎవరూ ఊహించలేని ట్విస్టులు, మలుపులు ఉంటాయంటూ ప్రేక్షకులను ఊరించాడు. సూర్య - సమంతల మధ్య సన్నివేశాలు కూడా చూడదగ్గవేనని, మంచి ఇంటర్వెల్ పాయింటు ఉందని తెలిపాడు.

 

Advertisement
Advertisement